
రాజకీయంగా ఎదుర్కొనడం కష్టమైనపుడు ఎదుటివారి వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేయడం చంద్రబాబు నైజం. మొదటి నుంచి ఆయన వ్యవహార తీరే అంత. అప్పటి ఎన్టీయార్ నుంచి నేటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంటి ఎంతోమందిని అదే విధంగా వ్యక్తిత్వాలను దెబ్బతీసే వార్తలు తమ అనుకూల మీడియాలో రాయించడం, విపరీతంగా ప్రచారంలోకి తేవడం, టీవీల్లో చర్చలు జరపడం.. ఇదే ఆయన రాజకీయ శైలి.
ముందుగా ఆర్థికంగా కాస్త వెనుకబడిన వాళ్లలో హుషారైన వాళ్లను గుర్తించడం.. వారిని మెల్లగా దువ్వి తమ లైన్‌లోకి తెచ్చుకోవడం.. పక్షులకు గింజలు వేసి మచ్చిక చేసుకున్నట్లు ఈ యువత అవసరాలు గమనించి అప్పుడప్పుడు కాస్త డబ్బు సాయం చేసి వారిని మెల్లగా తమ వాళ్లుగా చేసుకోవడం.. ముందుగా అసలు పేర్లు మార్చేయడం.. కొత్త పేర్లతో గుర్తింపు తీసుకురావడం ఆ తరువాత అంచలంచెలుగా వారి మెదళ్లలోకి అవతలివారి గురించి విషాన్ని, విద్వేషాన్ని ఎక్కించడం. అప్పుడు వారు పూర్తిగా తమ కంట్రోల్లోకి వచ్చాక వారిని మానవ బాంబులు మాదిరిగా మర్చి అవతలివారి మీద ప్రయోగించడం.. దీనికి వెనక నుంచి అన్ని అండదండలూ అందిస్తూ వేడుక చూస్తూ పెద్దలు ఎంజాయ్ చేయడం.
ఎన్టీయార్, లక్ష్మీపార్వతి, చిరంజీవికి తప్పని ఎల్లో మీడియా దాడి
ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది మరి అప్పట్లో.. కేవలం ఎల్లో మీడియాతోనే అవతలివారి మీద బురదజల్లి ప్రజల్లో వారిని చులకన చేసేవారు. చివరికి ఎన్టీయార్‌ను సైతం వ్యక్తిత్వంల్లేని మనిషిగా చిత్రీకరించి తమ పత్రికల్లో పేజీలకొద్దీ వార్తలు రాసేవారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన భార్య లక్ష్మీ పార్వతీని ఇప్పటికీ వేధిస్తున్నారు. ఇక అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవిని అలాగే దిగజార్చారు. అనంతరం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత వైయస్ జగన్.. ఇలా తమ మార్గానికి అడ్డుగా వచ్చిన ప్రతి వారిని ఇలానే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వెళ్లారు.
ఆనాడు ఎన్టీయార్‌ను బాధ్యత లేని వ్యక్తిగా, నైతిక విలువలు లేని వ్యక్తిగా చెబుతూ పేజీలకొద్దీ వార్తలు వండి వార్చారు. ఇంకా అయన భార్య లక్ష్మి పార్వతి కూడా రాజ్యాంగేతర శక్తి, రాష్ట్ర ప్రజల పాలిట దెయ్యం భూతం అన్నట్లుగా మీడియాలో రాసి ప్రజలను భయపెట్టి ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నపుడు జెండా పీకేద్దాం అంటూ చిరంజీవిని అసమర్థుడిగా చిత్రించి పార్టీ క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు.
చదవండి: కేసీఆర్ కోపాన్ని చూడాల్సి వస్తుందని ఈనాడు భయపడిందా?
ఇక వైఎస్సార్‌ను సైతం అవినీతిపరుడిగా నిరూపించడానికి ఎల్లో మీడియా ఎన్ని పాట్లు పడిందో అందరికి తెలిసిందే. చివరిగా వైఎస్ జగన్‌ని రాజకీయంగా అణగదొక్కేందుకు చేయని ప్రయత్నం లేదు. ఆయన్ను ప్రజలు ఆమోదించి ఆయన్ను సీఎంగా ఎన్నుకున్నా ఎల్లో మీడియా ఒప్పుకోవడం లేదు.. రోజూ కాకుల మాదిరి వెంటాడి పొడుస్తూ వేధిస్తూ అయన వ్యక్తిత్వాన్ని దిగజార్చే కథనాలు వండుతూనే ఉన్నారు.
ఆ వార్తలను మళ్ళీ తమ ఛానెళ్లలో చర్చకు పెడతారు. నిజమని నమ్మిస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక యువతను ఇలాగే రెచ్చగొట్టి అవతలివారి కుటుంబాల్లోని మహిళలను సైతం అవమానించేలా పోస్టులు పెట్టిస్తారు. కొన్నాళ్ల పాటు వారికి డబ్బులు ఇస్తూ ప్రోత్సహించి బయటి నుంచి అన్నీ గమనిస్తూ ఉంటారు.
నష్టపోతే వీళ్ళు.. లాభపడితే పెద్దలు.. ఈ దుష్ట యజ్ఞంలో వ్యక్తిత్వాన్ని కోల్పోయి, శలభాల్లా మాడిపోయినవాళ్లు ఎందరో.. తెలుగుదేశం వారి సోషల్ మీడియా నెట్ వర్క్ (ఐటీడీపీ) పనితీరు ఇలాగే ఉంటుంది.. పాపం ఇబ్బందుల్లో ఉండే కొందరు యువతను ఇలాగే కాసిన్ని డబ్బులు ఇచ్చి వారిని తమ గ్రూపులోకి తెచ్చుకుంటారు.. వారి అసలు పేర్లు.. చివరికి కులం పేర్లు సైతం మార్చేసి, ఉన్మాదులుగా మార్చేసి ఎదుటివారి మీద విషం కక్కేలా శిక్షణ ఇస్తారు. అవతలివారి వ్యక్తిత్వాలను డ్యామేజ్ చేస్తారు. సోషల్ మీడియా లేని రోజుల్లో ఎదుటివారి వ్యక్తిత్వాలను డ్యామేజ్ చేసే బాధ్యత ఎల్లో మీడియా చూసుకునేది.
చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..!
తమ పెంపుడు కుక్కలా మాదిరిగా వారిని వాడుకుని ఎదుటివారిమీద ఇష్టానుసారం దాడులు చేసేటపుడు అవేమీ తప్పుగా వారికి అనిపించదు.. తప్పుల్లా కనిపించవు. తప్పు ఏదీ ఎక్కువ కాలం సాగదు కాబట్టి ఏదోరోజు వారు దొరికిపోవడమో.. ఓపిక నశించి ఎదురుదాడి జరగడమో అవుతుంది. ఇక అప్పుడు ఎక్కడలేని నటులంతా వచ్చి ఏడ్చి తమవాళ్లను ఎదుటివాళ్లు వేధిస్తున్నారని మళ్లీ మీడియాలో, ఛానెళ్లలో రోదనలు పెడతారు. యుద్ధం మొదలు పెట్టేటపుడే దాని పర్యవసానాలు ఏ స్థాయిలో ఉంటాయో గమనించాలి.. ఒకసారి ఇటు నుంచి ప్రతిదాడి మొదలైతే తట్టుకోలేని, చేతగాని పరిస్థితులు ఉన్నపుడు యుద్ధమే మొదలు పెట్టకూడదు. పాపం ఇలాగే చాలామంది యువత డబ్బులు, తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి కేసులు, కోర్టుల బారినపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment