సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం: రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల సీఐడీ విచారణ ఆదివారం ముగిసింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా నకిలీ ఒప్పందంతో నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేసి రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టిన కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
న్యాయస్థానం ఆదేశాలతో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయన్ని రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. పక్కా పన్నాగంతో ‘స్కిల్’ కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు సీఐడీ విచారణను కూడా పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. రెండు రోజుల విచారణలోనూ ఆయన ఏమాత్రం సహకరించనందున చంద్రబాబు కస్టడీని పొడిగించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది.
40 ఇయర్స్ ఇండస్ట్రీ.. 14 ఏళ్లు సీఎంనంటూ
సీఐడీ విచారణలో చంద్రబాబు సంబంధం లేని సంగతులు చెబుతూ తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్కిల్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఏ ప్రశ్నలు వేసినా చంద్రబాబు ఒకటే చెబుతూ వచ్చారు.
రాజకీయాల్లో తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని... 14 ఏళ్లు సీఎంగా చేశానంటూ కాలయాపన చేసేందుకే ప్రయత్నించారు. దీంతో ఆయన రాజకీయ అనుభవం గురించి తమకు కూడా తెలుసని, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ జీవో, ఒప్పందాలను ఏ ప్రాతిపదికన చేశారు? బిల్లులు చెల్లింపుల్లో హేతుబద్ధత ఏమిటీ? నిధుల మళ్లింపులో పాత్రధారులతో సంబంధాలు ఏమిటీ? అనే అంశాలకు సూటిగా సమాధానాలు చెప్పాలని సిట్ అధికారులు పదేపదే పట్టుబట్టాల్సి వచ్చింది.
వ్యూహాత్మక ప్రశ్నావళి.. కొంతవరకు సఫలీకృతం
మొదటి రోజు చంద్రబాబు విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో రెండో రోజు సిట్ అధికారులు ప్రశ్నావళిలో కొన్ని మార్పులు చేశారు. వరుస క్రమంలో కాకుండా ఓ అంశం నుంచి మరో అంశానికి జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే సీఐడీ, ఈడీ అరెస్ట్ చేసిన సుమన్‌బోస్, వికాస్ వినాయక్ కన్విల్కర్‌లతోపాటు నిధుల అక్రమ తరలింపులో షెల్ కంపెనీలతో చంద్రబాబు సంబందాలు, ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.
నిధుల అక్రమ మళ్లింపులో కీలక పాత్రధారులైన చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తాలతో చంద్రబాబు, లోకేశ్ లావాదేవీలపై కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీఐడీ నోటీసులు జారీ చేయగానే పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారు కావడంపై సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం.
వెరసి రెండు రోజుల విచారణలో వ్యూహాత్మకంగా ప్రశ్నలు సంధించడం ద్వారా సీఐడీ అధికారులు కొంతవరకు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు చంద్రబాబు విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. మధ్యవర్తుల సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేశారు. విచారణ సాగిన తీరు, వీడియో రికార్డింగ్ తదితర ఫైళ్లను న్యాయస్థానానికి సిట్ అధికారులు సమర్పించనున్నారు.
మరింత విచారించాల్సిన అవసరం
విచారణ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించి కాలహరణం చేసినందున చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలో విచారించేందుకు అనుమతించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసులో సిట్ నోటీసులు జారీ చేసిన ఇద్దరు కీలక వ్యక్తులు విదేశాలకు పరారు కావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లు నివేదించనుంది.
ఈ కేసులో గతంలో విచారించిన సాక్షులను ప్రభావితం చేసిన ఉదంతాలను కూడా న్యాయస్థానం దృష్టికి మరింత వివరంగా తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో కుట్రకోణానికి సంబంధించి పూర్తి వాస్తవాలను రాబట్టేందుకు చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని న్యాయస్థానానికి సిట్ అధికారులు విజ్ఞప్తి చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment