కృష్ణా, సాక్షి: విజయవాడవాసుల్ని కృష్ణమ్మ భయపెడుతోంది. వర్షం కాస్త తెరిపి ఇచ్చినప్పటికీ.. ఓ వైపు బుడమేరు.. మరో వైపు నది వరదతో ముంపు ప్రాంతాలను అంతకంతకు నీటి ప్రవాహం ముంచెత్తుతోంది. దీంతో.. నగర వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు.. సత్వర చర్యల్లో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యంపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది.
విజయవాడకు వర్ష, వరద ముప్పును ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు. పైగా రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వాన కురుస్తున్న యంత్రాంగం పట్టించుకోలేదు. ఫలితంగానే లక్షన్నర మందికిపైగా రెండు రోజులపాటు వరద నీటిలోనే ఉండి ఆహారం కోసం హాహాకారాలు చేస్తున్నారు. సహాయక చర్యల్లోనూ బాబు ప్రభుత్వం అలసత్వమే ప్రదర్శిస్తోంది.
నిన్నటి భవానీపురం, హెచ్.బి.కాలనీ, విద్యాధరపురం , ఊర్మిళానగర్, ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డు, జోజినగర్,మిల్క్ ప్రాజెక్టు,సితార సెంటర్ ప్రాంతాలు నీటిలోనే నానుతున్నాయి. తమనెవరూ పట్టించుకోవడం లేదని వరద బాధితులు వాపోతున్నారు. లక్ష ఆహారపొట్లాలు.. మంచి నీటి ప్యాకెట్లు ఎక్కడున్నాయని? ఏమైపోయాయని ప్రశ్నిస్తున్నారు.
‘‘నిన్నటి నుంచి మాకు భోజనాలు లేవు. పిల్లలు తిండి లేక అల్లలాడిపోతున్నారు. తాగేందుకు చుక్క నీరు దొరకడం లేదు’’ అంటూ ఓ మహిళ సాక్షితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యింది.
మరోవైపు అధికారుల ఫోకస్ అంతా చంద్రబాబు పర్యటన మీదే ఉంది. సహాయక చర్యలను అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శ వినిపిస్తోంది. ఇంకోవైపు.. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆయన కార్యకర్తలు ఎక్కడికి పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వం చేతులు ఎత్తేసిన వేళ.. పడవలో ఎక్కించుకుని తీసుకెళ్లాలంటే వెయ్యి నుంచి రెండు వేలు డిమాండ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
బాబు నివాసం మునిగిపోకూడదని.. !
బుడమేరు వదర ముందును అధికారులు నిర్లక్ష్యం చేరశాని విమర్శ వినిపిస్తోంది. కృష్ణా నది బుడమేరు కరకట్టలకు గండ్లు ఏర్పడగా.. చంద్రబాబు నివాసం కరకట్ట తెగిపోతుందనే భయంతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకులను ఎత్తివేశారు అధికారులు. ముందస్తు సమాచారం లేకుండా నీటి విడుదలతో పరివాహక ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
సింగ్‌నగర్ వాసులకు నరకం
విజయవాడలో ఎటు చూసినా వరద ముంపు వాసుల కష్టాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. సింగ్ నగర్‌లో అయితే ప్రజలు అధికారుల అలసత్వంతో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. నడుం లోతుకు పైగా నీటి నుంచి ప్రాణాలకు తెగించి ఆహారం కోసం ఒడ్డుకు వచ్చే యత్నం చేస్తున్నారు. మరోవైపు.. చంటి బిడ్డలతో తల్లుల బాధ వర్ణనాతీతంగా ఉంది. నగర వాసులు ఇంతలా ఇక్కట్లు పడుతున్న.. సేఫ్‌గా కరకట్ట నివాసరం నుంచి బయటకు వచ్చేసిన చంద్రబాబు స్వార్థ రాజకీయంతో ఇంకా గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment