
సాక్షి, అమరావతి: అమరావతి రైతులను అడ్డంగా దోచుకుని అక్కడ బినామీ సామ్రాజ్యం నిర్మించుకున్న టీడీపీ ‘అభివృద్ధి – పరిపాలన వికేంద్రీకరణ’, ‘సీఆర్‌డీఏ రద్దు’ బిల్లులను అడ్డుకునేందుకు విఫలయత్నాలు చేసింది. ప్రజా బలం లేకున్నా సాంకేతిక అంశాలను ఉపయోగించుకుని శాసన మండలి ద్వారా బిల్లులను నిలిపివేయడానికి చంద్రబాబు పన్నిన కుయుక్తులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
► అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులు మండలిలో ఆమోదం పొందకుండా టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చైర్మన్‌ను అడ్డుపెట్టుకుని ఆడిన వికృత ›నాటకాలు చూసి రాష్ట్రం విస్తుపోయింది.
► ఈ బిల్లులు మొదటిసారి అసెంబ్లీలో ఆమోదం పొంది మండలి ముందుకు వచ్చినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపాలని చూడడం ద్వారా వికేంద్రీకరణను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో చంద్రబాబు స్వయంగా మండలి గ్యాలరీలో కూర్చుని మరీ చైర్మన్‌పై ఒత్తిడి చేశారు.
► రెండోసారీ పలు సాకులతో అడ్డుకునేందుకు యనమల యత్నించారు.
► అమరావతి రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో రాజధానిలో కృత్రిమ ఉద్యమం సృష్టించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నాయకులు దాన్నో ప్రజా ఉద్యమంగా చిత్రీకరించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు.
► ఎంత చేసినా ఆ ఉద్యమం 29 గ్రామాలను దాటి బయటకు రాలేకపోయింది. ప్రజల దృష్టిలో డ్రామాగా మిగిలిపోయింది.
► సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో వికేంద్రీకరణపై ఈ ఉద్యమకారులు వేయని నిందలు, చెప్పని అబద్ధాలు లేవు.
► చివరికి చంద్రబాబు తనకు అనుకూలమైన వారితో కోర్టుల్లో కేసులు వేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వయంగా కొందరు టీడీపీ నేతలూ పిటిషన్లు వేశారు. కోర్టులను తప్పుదారి పట్టించేలా రకరకాల చిత్రీకరణలు, దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు.
► కేంద్రం పరిధిలో లేని అంశాన్ని కేంద్రం పరిధిలో ఉందని భ్రమలు కల్పించేలా చేయడం, వికేంద్రీకరణ రాజ్యాంగ విరుద్ధమని, బిల్లులను గవర్నర్ కాకుండా రాష్ట్రపతి ఆమోదించాలనే అబద్ధాల ద్వారా ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేందుకు చంద్రబాబు, ఆయన పరివారం ఎన్నో రకాల డ్రామాలాడింది. చివరికి పరిపాలన రాజధానిగా ప్రతిపాదించిన విశాఖ నగరంపై విషం చిమ్మేందుకు చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే ఎల్లో మీడియా వెనుకాడలేదు.
► కాకినాడ నుంచి విశాఖ వరకు సముద్ర తీరంలో చీలిక ఉన్నందున విశాఖ రాజధానికి అనువు కాదనే కొత్త వివాదం రేపేందుకు యత్నించి అభాసుపాలయ్యారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి తమకు అవసరం లేదని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటైతే రాయలసీమకు ప్రయోజనం దక్కినా ఒప్పుకోబోమని చెబుతూ అమరావతి ఒక్కటే రాజధాని కావాలని, దాని ద్వారా తాము బాగుండాలని చంద్రబాబు నిత్యం కుయుక్తులు పన్నారు.
► కానీ గవర్నర్ ఈ రెండు బిల్లుల్ని ఆమోదించడంతో ఆయన కుయుక్తులన్నీ తల్లకిందులయ్యాయి.