కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డ ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. రెండో, చివరి దశలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. రైతు అనుకూల ప్రభుత్వమనే ముద్రతో అధికారం నిలుపుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. వరి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు అనేకానేక సంక్షేమ పథకాలు తమకు శ్రీరామరక్ష అని సీఎం భూపేశ్ బఘేల్ అంటున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సీఎం, మంత్రులపై అవినీతి ఆరోపణలు తమకు కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం దుబాయ్ బెట్టింగ్ యాప్ నుంచి 508 కోట్ల దాకా ముడుపులు అందుకున్నారంటూ బఘేల్‌పై వచ్చిన ఆరోపణలు ఓటర్లపై గట్టి ప్రభావం చూపుతాయని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే...
2008
అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైన తొలినాళ్లలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడిచింది. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా సీఎం రమణ్‌సింగ్ మిస్టర్ క్లీన్ ఇమేజీ ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించింది. 50 స్థానాలు సాధించి అధికారం నిలుపుకుంది.
ఇటు బస్తర్ మొదలుకుని అటు సర్గుజా దాకా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలన్నింట్లోనూ బీజేపీ హవా సాగింది. అక్కడి 26 స్థానాలకు గాను ఆ పార్టీ ఏకంగా 23 చోట్ల నెగ్గింది! ప్రజల్లో బాగా ఆదరణ ఉన్న కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి సుడిగాలి ప్రచారం చేసినా లాభం లేకపోయింది. ఆ పార్టీ చివరికి 38 సీట్లతో సరిపెట్టుకుంది. దానికి పోలైన ఓట్లు కూడా 38 శాతమే కావడం విశేషం. బీజేపీ 40 శాతం ఓట్లు సాధించింది. బీఎస్పీ రెండు సీట్లు నెగ్గింది.
2013
ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ హ్యాట్రిక్ కొట్టారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆయన విజయ పథంలో నడిపి తొలిసారి సీఎం అయ్యారు. అప్పట్నుంచీ 15 ఏళ్లపాటు రాష్ట్రంలో ఆయన హవా సాగింది. రమణ్ పరిపాలనా శైలి కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం!
2008 ఎన్నికల విజయం తర్వాత ఆయన అమలు చేసిన ఆహార భద్రత పథకం ఛత్తీస్‌గఢ్‌లో 60 శాతం మంది కనీసావసరాలు తీర్చింది. దాంతో ప్రజలు మరోసారి రమణ్ పాలనకే ఓటేశారు. బీజేపీకి 49 సీట్లు రాగా కాంగ్రెస్‌కు 39 స్థానాలొచ్చాయి. మొత్తమ్మీద బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 40 శాతం పోలయ్యాయి. బీఎస్పీకి ఒక స్థానం దక్కింది.
2018
సుదీర్ఘంగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రతికూలంగా మారింది. దీనికి తోడు రైతు రుణ మాఫీని పాక్షికంగా అమలు చేసి చేతులెత్తేయడం కూడా రమణ్‌సింగ్ సర్కారుకు బాగా ప్రతికూలంగా మారింది. మార్పుకు పట్టం కట్టండంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి జనం జై కొట్టారు. దాంతో హస్తం పార్టీ 68 సీట్లతో ఘన విజయం సాధించింది.
బీజేపీ కంచుకోటలైన సర్గుజా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏకంగా క్లీన్‌స్వీప్ చేయడం విశేషం! దాంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సరిగ్గా 15 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ ఏకంగా 43 శాతం ఓట్లు కొల్లగొట్టగా బీజేపీ కేవలం 33 శాతంతో ఘోరంగా చతికిలపడింది. ఇక బీఎస్పీ మరోసారి రెండు స్థానాలతో రాష్ట్రంలో ఉనికి నిలుపుకుంది.
Comments
Please login to add a commentAdd a comment