బీహార్‌లో ఎన్డీయే కూటమికి మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ) ఝలక్ ఇచ్చింది. తాము కోరుకున్న స్థానాలు ఇవ్వని పక్షంలో ఒంటరి పోరుకైనా సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో ఉన్న మంత్రి పశుపతి కుమార్ పరాస్ స్వయంగా ప్రకటించారు.
రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్‌ఎల్‌జేపీ)కి గట్టిపట్టు ఉన్న ఐదు స్థానాల్లో పోటీ ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరతాం. ఆ సీట్లను వేరేవాళ్లకు కేటాయిస్తే చూస్తూ ఊరుకోం. నేను కూడా లోక్‌సభ బరిలో ఉంటా అని పశుపతి కుమార్ పరాస్ స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని గనుక విస్మరిస్తే.. ఏ నిర్ణయం తీసుకోవటానికైనా వెనకాడబోమని ఎన్డీయేను హెచ్చరించారాయన.
కూటమిలో భాగంగా చిరాగ్ పాశ్వన్ లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్)కి బీజేపీ ఐదు సీట్లను కేటాయించింది. అందులో.. ఆర్‌ఎల్‌జేపీ చీఫ్ పశుపతి ప్రాతినిధ్యం వహిస్తున్న హాజీపూర్ స్థానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూటమిలో తమకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఆర్‌ఎల్‌జేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ‘కూటమి నుంచి వెళ్లిపోవడానికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి’ అంటూ పశుపతి వ్యాఖ్యానించడం గమనార్హం.
‘మేము ఎన్డీయేలో భాగం. మేము నిజాయితీగా కూటమిలో ఉన్నాం. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటే మాకు గౌరవం ఉంది. మా పార్టీకి బీజేపీ నుంచి ప్రాధాన్యత లభించటం లేదని వార్తలు వస్తున్నాయి. మా పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ చివరి జాబితా వెల్లడించే వరకు మేము వేచిచూస్తాం. ఆ తర్వాత మేము ఇక ఎవరికి గౌరవం ఇవ్వాల్సి అవసరం లేదు. మా స్వేచ్ఛానుసారం కూటమి నుంచి బయటకు వచ్చేస్తాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు’ అని పశుపతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment