సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అంకెలగారడీ, మాయమాటలతో మేడిపండు మాదిరిగా రంగుల మెగా బడ్జెట్ ప్రవేశపెట్టారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అభివర్ణించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో కొత్తగా కేటాయింపులులేవని, గతంలో ఇచ్చిన హామీల అమలుకు కూడా కేటాయింపులు చేయలేదని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడానికి అంకెలు పెంచి బడ్జెట్ పెట్టారని ఆరోపించారు.
బడ్జెట్‌ను సంపూర్ణంగా అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంటే వాస్తవిక బడ్జెట్ పెట్టేవారని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇంటిస్థలాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొ న్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం 5 గంటలు కూడా నాణ్యంగా సరఫరా చేయడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
50 శాతం జనాభా కలిగిన బీసీలకు బడ్జెట్ కేటాయింపులో కనీస ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను గత ఎనిమిదేళ్లుగా పక్కదారి పట్టిస్తున్నదని ఆరోపించారు. రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల సుమారు 16 లక్షలమంది రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారని విచారం వ్యక్తం చేశారు. బీసీ, గిరిజనబంధు హామీ, నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్‌లో మాటేలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment