ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తామన్న బీఆర్‌ఎస్ ప్రకటనతో అలర్ట్
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్టులు
సాక్షి, హైదరాబాద్/ దుండిగల్/ గచ్చిబౌలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రి హరీశ్‌రావును, ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్టు చేసి, నివాసం నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. నేతలతోపాటు క్షేత్రస్థాయి క్రియాశీల నాయకులు, కార్యకర్తలను కూడా పోలీస్‌స్టేషన్లకు రావాలంటూ ఆదేశించడం గమనార్హం.
ఎక్కడికక్కడ బలగాల మోహరింపుతో..
ఫిరాయింపుల అంశంపై వివాదం, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై దాడి నేపథ్యంలో.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని బీఆర్‌ఎస్ గురువారం రాత్రి ప్రకటించింది. దీనితో అప్రమత్తమైన పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే భారీగా మోహరించారు. జిల్లాల్లోనూ బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలు చేసేందుకు ప్రయతి్నంచగా.. అడ్డుకుని అరెస్టులు చేశారు.
ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకుని..
మంత్రి హరీశ్‌రావు కేశంపేట పోలీసు స్టేషన్ నుంచి విడుదలయ్యాక శుక్రవారం తెల్లవారుజామున కోకాపేటలోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పట్నుంచే అక్కడ పోలీసులు మోహరించారు. పార్టీ నేతలెవరూ హరీశ్‌రావు ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురువారం నాటి తోపులాటలో భుజానికి గాయమై నొప్పితో బాధపడుతున్న హరీశ్‌రావు.. ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. దీంతో హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భుజానికి గాయమైన హరీశ్‌రావును పరామర్శించేందుకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి,, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, పార్టీ నేతలు జైపాల్‌రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్దకు రాగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో వారు పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం తర్వాత పోలీసులు హరీశ్‌రావును ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఎడమ భుజానికి స్కానింగ్‌తోపాటు ఇతర వైద్య పరీక్షలు చేశారు. పదిహేను రోజుల పాటు ఫిజియోథెరపీ తీసుకోవాలని హరీశ్‌కు వైద్యులు సూచించారు.
శంభీపూర్ రాజు నివాసం వద్ద ఉద్రిక్తత
మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసం నుంచి అరికెపూడి ఇంటికి వెళతామని బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో.. శుక్రవారం తెల్లవారుజాము నుంచే అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అప్పటికే శంభీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు. ఈ ఇద్దరినీ పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆ ఇంటి పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో శంభీపూర్ రాజు నివాసం వద్ద పాడి కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను హత్య చేయించేందుకు ప్రయతి్నంచారని, తన ఇంటిపై దాడికి ఉసిగొల్పాడని ఆరోపించారు.
హైడ్రా పేరిట ఇష్టానుసారం బిల్డింగులను కూల్చివేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తనకు దూకుడు ఎక్కువని అంటున్న దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువని వ్యాఖ్యానించారు. అరికెపూడి గాం«దీకి నీతి, నిజాయతీ ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద గురువారం బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన విధులకు కౌశిక్‌రెడ్డి ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని సైబరాబాద్ అడ్మిన్ ఏడీసీపీ రవి చందన్‌రెడ్డి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కౌశిక్‌రెడ్డిపై బీఎన్‌ఎస్ 132, 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment