CM Jagan Slams Chandrababu Naidu And Pawan Kalyan At Gudivada Public Meeting - Sakshi
Sakshi News home page

40 ఏళ్ల రాజకీయం.. మూడుసార్లు సీఎం.. ఏ మంచి చేయని మోసాల బాబు మళ్లీ వచ్చాడు: సీఎం జగన్‌

Published Fri, Jun 16 2023 12:31 PM | Last Updated on Fri, Jun 16 2023 4:54 PM

CM Jagan Slams Chandrababu Pawan Kalyan At Gudivada Public Meeting - Sakshi

సాక్షి, కృష్ణా: పేదల ఇళ్ల కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేకపోయాడని నిలదీశారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. గుడివాడ టిడ్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పెత్తందారుల పార్టీ అని, పేదల వ్యతిరేకి కాబట్టే చంద్రబాబు ఏం చేయలేదని విమర్శించారు సీఎం జగన్‌.

పేదవాడికి చంద్రబాబు నాయుడు ఏనాడూ సెంటు స్థలం ఇచ్చింది లేదు. మూడుసార్లు సీఎం అయినా టిడ్కో ఇళ్లు కట్టలేకపోయారు. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు కావాలంటే డబ్బు కట్టాల్సిందే. ఇదే భారం పేదలపై పడి ఉంటే.. 20 ఏళ్ల పాటు నెలకు 3 వేల చొప్పున కట్టవల్సి వచ్చేది. కానీ, మన ప్రభుత్వం కట్టించడమే కాదు.. రిజిస్ట్రేషన్‌ చేసి మరీ ఇస్తోంది. 

మంచి చేశాం కాబట్టే.. 
నాటి పాలనకు నేటి పాలనకు తేడా గమనించాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలు నెరవేర్చాం. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. లంచాలకు తావు లేకుండా లబ్ధిదారులకు నేడు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.   గ్రామస్థాయ నుంచే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఈ నాలుగేళ్ల కాలంలో రూ. 2.16 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం.  మంచి చేశాం కాబట్టే నేడు ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నామని అన్నారాయన. 

అందుకే కుప్పంలో ఇల్లు అంటున్నాడు
రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే.. కులాల సమతౌల్యం దెబ్బతింటుందని చంద్రబాబు కోర్టుల కెక్కాడు. 14 ఏళ్లు సీఎంగా పేదలకు మేలు చేయలేకపోయారు. ప్రజలకు మంచి చేసిన చరిత్రే చంద్రబాబుకు లేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని అంటున్నాడు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు తయారయ్యారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఇంకో ఛాన్స్‌ ఇస్తే మంచి చేస్తానని బాబు చెబుతున్నాడు. 

మోసాల బాబు మళ్లీ వచ్చాడు
ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి.. ఏదో చేసేస్తా అంటాడు. ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి.. ఇంకా ఎక్కువే చేస్తా అంటున్నాడు. ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి.. మీ ప్రతీ ఇంటికి బంగారం ఇస్తా అంటున్నాడు. ఇంకో చాన్స్‌ ఇవ్వండి బెంజ్‌ కారు ఇస్తా అంటూ ఎన్నికలు దగ్గర పడేసరికి ఈ పెద్ద మనిషి(చంద్రబాబు) మోసం చేయడానికి బయల్దేరాడు. ఇంకో చాన్స్‌ ఇవ్వండి.. ఇది చేస్తా అది చేస్తా అంటాడే తప్ప సీఎంగా ఉన్నప్పుడు ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని మాత్రం అడగలేడు.  మంచి చేసిన చరిత్ర ఈ పెద్దమనిషికి లేనే లేదు కాబట్టి.. ఓటేయండి అని అడగలేకపోతున్నాడని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలను గమనించాలని ప్రజలను సీఎం జగన్‌ కోరారు.

ఫార్టీ ఇయర్స్‌.. నథింగ్‌
జిత్తులు, ఎత్తులు, పొత్తులనే చంద్రబాబు నమ్ముకున్నాడు. రెండు పక్కల కూడా రెండు పార్టీలు లేకుంటే చంద్రబాబు నిలబడలేడు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోని టీడీపీ చెత్త బుట్టలో పడేస్తోంది. చంద్రబాబుది పెత్తందారుల పార్టీ. దుష్టచతుష్టయాన్నే ఆయన నమ్ముకున్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేసిన మంచిని చంద్రబాబు చూపించలేకపోయారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లు కలిసి గజదొంగల ముఠా ఏర్పడ్డాయి. వీళ్లు ఓ దత్తపుత్రుడు తోడయ్యాడు.  రాష్ట్రాన్ని దోచుకునేందుకే దొంగల ముఠాకు అధికారం కావాలి. దోచుకోవడం, పంచుకోవడం, తినడం కోసమే వీళ్లకు అధికారం కావాలి. 

రెండు పక్కల రెండు పార్టీలు ఉంటేగానీ నిలబడలేని చంద్రబాబు.. 175 సీట్లలో అభ్యర్థులను నిలబట్టలేని ఆ వ్యక్తి మనకు ప్రత్యర్థి అంట. మరోవంక రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయ్యి కూడా.. తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ,  తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ, తన వ్యాను చూసి మురిసిపోతూ.. తాను కూడా ఎమ్మెల్యే అవుతానంటూ , తనను ఎవరు ఆపుతారో చూస్తాను అని అనే ప్యాకేజీ స్టార్‌.. దత్తపుత్రుడు మరో వంక. వీళ్లు మన ప్రత్యర్థులంట. 

మీ బిడ్డ నమ్ముకుంది ప్రజలనే!
గజదొంగల ముఠా.. తోడేళ్ల ముఠాతో ఒంటరిగానే మీ బిడ్డ పోరాటం చేస్తున్నాడు. టీడీపీ హయాంలో చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలని చంద్రబాబుకు చురకలంటించారాయన.  మీ బిడ్డ రాజకీయాల్లో ప్రజలనే నమ్ముకున్నాడు. అబద్ధాలను, అవాస్తవాలను నమ్మొద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీకి అండగా నిలవండి యావత్‌ ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి కోరారాయన. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement