సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ధరణిలో భూమి వచ్చిందంటే ఎవడూ మార్చలేడని.. నీ భూమి హక్కు నీ బొటన వేలుతో మాత్రమే మార్చేలా తీసుకొచ్చామన్నారు. ధరణిలో సమస్యలు ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా రావాలని అని ప్రశ్నించారు. ధరణితో భూమి సేఫ్ అని, రైతు బంధు డబ్బులు నేరుగా బ్యాంకులోనే పడతాయని చెప్పారు.
గులాబీ గూటికి యాదాద్రి నేతలు
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్‌లో వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. అనిల్ కుమార్, శేఖర్ రెడ్డి చెరో పదవి తీసుకొని పని చేయాలని సూచించారు. అనిల్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు జిమ్మేదారి తనదని అన్నారు.
అనేక అవమానాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. గత ముఖ్యమంత్రులు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కరెంట్ లేక గతంలో పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్ ఇస్తామంటే ఎవరూ నమ్మలేదని.. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అన్నారు.
‘24 గంటల కరెంట్‌తో రైతులు ఎప్పుడైనా పొలానికి నీళ్లు పెట్టుకోవచ్చు. రాష్ట్రంలోప్రస్తుతం మూడు పంటలు పండుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని రైసు మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయి. రైతు బాగుంటేనే పదిమందికి అన్నం పెడతాడు. బస్వాపూర్ ప్రాజెక్టుతో భువనగిరి, ఆలేరులో కరువే రాదు. 8 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దాని అప్పు ఎప్పుడో తేరిపోయింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
చదవండి: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం..
Comments
Please login to add a commentAdd a comment