సాక్షి, జనగాం : రేవంత్‌రెడ్డికి ఆయన పార్టీ నేతలే రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. చేర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ రేవంత్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి ఉద్యమకారులపై తుపాకులు పట్టుకుని తిరిగాడని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్రోళ్ల బూట్లు మోశాడని మండిపడ్డారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, పిచ్చికుక్కలు మొరిగితే పట్టించుకుంటామా అని దుయ్యబట్టారు.
‘ మన దేశంలో ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదు. ఎన్నికలు వస్తే అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి సభలు జరగవు. అక్కడ టీవీల్లో చర్చలు పెడతారు. ప్రజాస్వామ్యంలో పరిణితి సాధించిన దేశాలు బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాయి. మనదగ్గర ఎన్నికలు వస్తే నేరాలు ఘోరాలు, అబాంఢాలు పుట్టుకొస్తాయి. ఎన్నికల్లో ఎవరో చెప్పారని నిర్ణయం తీసుకోవద్దు. అన్ని విషయాలపై చర్చించి ఓటు ఎవరికేయాలో నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల్లో అభ్యర్థితో పాటు పార్టీ చరిత్రను పరిశీలించాలి. మనం వేసే ఓటు ఐదేళ్ల తలరాతను మారుస్తుంది.
2004 ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ తెలంగాణను మోసం చేసింది. బీఆర్‌ఎస్‌ను చీల్చాలని ప్రయత్నం చేసింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఇప్పుడు బచ్చన్నపేట చెరువు నిండుగా కనిపిస్తోంది. రైతులకు రైతు బంధు ఇచ్చిందెవరు. బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. ఎవరికి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయించాలి. 3 గంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ అంటున్నాడు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ అంటున్నడు. ధరణిని బంగాళాఖాతంలో పారేద్దామని భట్టి విక్రమార్క అంటున్నాడు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్‌ఎస్ కావాలా 3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోవాలి.
ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం. పల్లారాజేశ్వర్‌రెడ్డి నాతోనే ఉంటాడు. జనగామను అభివృద్ధి చేసే బాధ్యత నాది’అని కేసీఆర్ అన్నారు.
ఇదీచదవండి.. అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో రూ. 6.5 కోట్ల పట్టివేత.. ఆ లీడర్‌వేనని అనుమానాలు?
Comments
Please login to add a commentAdd a comment