
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 15న పార్టీ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేయడంతోపాటు మేనిఫెస్టోను ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు 17 రోజుల వ్యవధిలో 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు వరుసగా సభల్లో పాల్గొని సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో 19 నుంచి 25 వరకు విరామం తీసుకోనున్నారు.
తిరిగి ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9 వరకు వరుస సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. నవంబర్ 4న కూడా ప్రచారానికి కేసీఆర్ విరామం ప్రకటించారు. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేసి కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి సీఎం ఎన్నికల ప్రచార సభల తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ పర్యటన షెడ్యూల్‌లో కొన్ని మార్పుచేర్పులు ఉండొచ్చని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment