పచ్చి అబద్ధాలు. తలా తోకా లేని సాకులు. మభ్యపెట్టే మాటలు. మేకపోతు బిల్డప్పులు. తప్పుదోవ పట్టించే ఆలోచనలు. తీరు మార్చుకోని విధానాలు. దశాబ్ధాలుగా అలవాటైపోయిన కుట్రలు. ఇవీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు సంధిస్తోన్న ఆయుధాలు. అవినీతి కేసులో అడ్డంగా దొరికి జైలుకొచ్చిన చంద్రబాబు నాయుడు రెండు మూడు రోజుల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చేయచ్చనుకున్నారు. అయితే ఇప్పటికీ బెయిల్ రాకపోవడంతో ఆయన చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. మాయదారి వేషాలు వేస్తున్నారు. వ్యవస్థలను తప్పుదోవ పట్టించి ఎలాగైనా సరే జైలు గోడలు దాటి బయటకు వచ్చేయాలని పరితపిస్తున్నారు.
371 కోట్ల ఘరానా దోపిడీ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.ఆయన జైలుకొచ్చి 50 రోజులు కావస్తోంది. ఏడు వారాలు దాటినా చంద్రబాబు నాయుడికి బెయిల్ రాలేదు. బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసుకున్నారు. న్యాయమూర్తులు వాటిపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రబాబు నాయుడిలో అసహనం పెరిగిపోతోంది. దానికి ఒంటరి తనం తోడవుతోంది. జైలు గోడలు దాటి ఎప్పుడు బయట పడతానో అన్న ఆలోచన ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉండచ్చు.
ఈ నేపథ్యంలో ఆయన జైలు నుండి బయటకు రావడానికి రక రకాల సాకులు వెతుక్కుంటున్నారు. ముందుగా కుటుంబ సభ్యుల చేత జైల్లో తనకు రక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ప్రచారం చేయించారు. తన బరువు 5 కిలోలు తగ్గిపోయిందని చెప్పించారు. అది నిజం కాదు..ఆయన జైల్లో కిలో బరువు పెరిగారని జైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. స్టెరాయిడ్స్ ఇచ్చి తనని చంపేయడానికి కుట్ర చేస్తున్నారని లోకేష్ చేత ఆరోపణలు చేయించారు. అందులోనూ నిజం లేదని అధికారులు స్పష్టత ఇచ్చారు. నీళ్లు కలుషితంగా ఉన్నాయని బురద జల్లించారు. అందులో వాస్తవం లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇలా ఏదో ఒక అబద్దంతో ఏదో ఒక సాకుతో చంద్రబాబు నాయుడు చిత్ర విచిత్ర వేషాలు వేస్తూనే ఉన్నారు.
ఏదీ వర్కవుట్ కాకపోవడం చంద్రబాబుకు మంట పుట్టిస్తోంది. దీనికి తోడు తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ప్రజల నుండి స్పందన రాకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. సామాన్య ప్రజల మాట దేవుడెరుగు తమ పార్టీ కార్యకర్తలు, నేతలే పట్టించుకోవడం లేదని తన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందడంతో చంద్రబాబు కుత కుత లాడిపోతున్నారు. గుండెల్లో రగిలిపోతున్నారు.
ఎవరిని దూషించాలో ఆయనకు అర్ధం కావడం లేదు. దీనికి ఎవరిని ద్వేషించాలో కూడా అర్దం కావడం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలే తనని జైలుకు పంపేలా చేశాయని తమ పార్టీ నేతలే సమాచారం ఇచ్చినా చంద్రబాబు కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడానికి గజ గజ వణికిపోతున్నారు. అటు కేంద్రంపైనా..ఇటు తమ పార్టీ సీనియర్ల అచేతనత్వంపైనా ఉన్న కోపం అంతా ఏపీ ప్రభుత్వంపై చూపిస్తున్నారు. పాలక పక్షంపై ఆరోపణలు చేస్తూ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా జైలు నుండి చంద్రబాబు నాయుడు ఏసీబీ న్యాయమూర్తికి జైలు అధికారుల ద్వారా ఓ లేఖను పంపారు. అందులో తన భద్రత గురించి ఏపీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్నారు. తనను జైల్లోనే అంతమొందించే కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వామపక్ష తీవ్రవాదులు తనను అంతమొందిస్తామని హెచ్చరిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి లేఖ రాసినా పోలీసులు కనీసం దానిపై దర్యాప్తు కూడా చేపట్టలేదని ఆరోపించారు. మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్ట్ అయిన కరడు గట్టిన నేరగాళ్లు జైల్లో ఉన్నారని వారి నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని వ్యాఖ్యానించారు.
అయితే ఇందులో ఏ ఒక్కటీ నిజం కాదని అధికారులు తేల్చి చెప్పారు. చంద్రబాబు చెబుతున్నట్లు వామపక్ష తీవ్ర వాదులని చెబుతోన్న లేఖ నకిలీదని తేలిందన్నారు. చంద్రబాబుకు జైల్లో అత్యంత పటిష్ఠమైన భద్రత కల్పించామన్నారు. చంద్రబాబు ఉన్న బ్యారక్‌కు దరిదాపుల్లో ఎవరూ వచ్చే వీలే లేకుండా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా రాష్ట్రంలో ప్రజల్లో విద్వేష బీజాలు నాటాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి సాకులు వెతుకుతున్నారని పాలక పక్ష నేతలు అంటున్నారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకే ఇటువంటి అబద్ధాలు చెబుతున్నారని..వాటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు.
-సీఎన్‌ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment