తెరపై గబ్బర్‌ సింగ్‌.. పాలిటిక్స్‌లో ప్యాకేజ్‌ స్టార్‌ | CNS Yazulu Article On Pawan Kalyans Comments | Sakshi
Sakshi News home page

తెరపై గబ్బర్‌ సింగ్‌.. పాలిటిక్స్‌లో ప్యాకేజ్‌ స్టార్‌

Published Sat, Oct 7 2023 2:59 PM | Last Updated on Sat, Oct 7 2023 4:45 PM

CNS Yazulu Article On Pawan Kalyans Comments - Sakshi

డబ్బులు తీసుకుని ఓట్లు వేసే ప్రజలే అవినీతి పరులు కాబట్టి చంద్రబాబు నాయుడి అవినీతిని ప్రశ్నించనే వద్దంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.అవినీతి అన్నది అసలు ఇష్యూనే కాదని కొత్త భాష్యం చెప్పారు. ఎన్ని కోట్ల మేరకు అవినీతి చేసుకోవచ్చు? ఎంత అవినీతి అయితే ఆమోద యోగ్యం ? అన్నదే విషయమని పవన్ కళ్యాణ్ చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకుని ప్రజలకు సుద్దులు చెబుతున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పార్టీని పెట్టానన్న పవన్ కళ్యాణ్  తన  ఆత్మ బంధువు చంద్రబాబు నాయుడి అవినీతిని ఇష్యూ చేయద్దనడంపై జనసైనికులే బిక్కమొహాలేసుకుని చూస్తున్నారు.గత ఎన్నికల్లో తనను రెండు చోట్ల ఓడించిన ప్రజలపై పవన్‌కు చంద్రబాబులానే చాలా మంట ఉందని అందుకే ఆయన ప్రజలనే బోనులో నిలబెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వారాహి యాత్రలో  పవన్ కళ్యాణ్ చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. తలా తోకా లేని వ్యాఖ్యానాలూ చేస్తున్నారు. తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను ఆయన కుటుంబ సభ్యులు మర్చిపోయారేమో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తాను మద్దతు ఇచ్చిన   రాజకీయ నాయకుడు  పీకల్లోతు అవినీతి కేసుల్లో కూరుకుపోయి ఉండడం ఆయనకు ఇబ్బందిగానే ఉంది. అయినా  చంద్రబాబును ఏదో విధంగా కాపాడుకోవాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పెడనలో పవన్   జనసైనికులతో పాటు వచ్చిన కొద్ది మంది ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుణ్ని అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబుపై అవినీతి కేసులు పెట్టడం ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గమైన  కార్యక్రమం అని ఆయన బాధ పడిపోతున్నారు. అయినా వెయ్యో పదిహేను వందలో డబ్బులు తీసుకుని ఓట్లు వేసే మనం.. అవినీతి గురించి మాట్లాడనేకూడదని పవన్ కళ్యాణ్ వింత వాదన చేశారు. దీంతో జనసైనికులు కూడా షాక్ తిన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టానన్న పవనేనా ఈ వ్యాఖ్యలు చేసిందీ అని వారు కళ్లు నులుముకుని మరీ చూశారు.

అసలు మన దేశంలో అవినీతి అన్నది ఇష్యూనే కాదని మరో అడుగు ముందుకేసిన పవన్ కళ్యాణ్ ఏ మేరకు అవినీతి చేసుకోవచ్చో ఎంత అయితే ఆమోదయోగ్యమో  అన్న అంశంపై చర్చ జరగాలని  పిలుపు నిచ్చారు. చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలు నుండి విడుదల అవుతారని అన్నారు పవన్.

చంద్రబాబు నాయుడి తరపున దిగ్గజ న్యాయవాదులు  సిద్ధార్ధ లూథ్రా, హరీష్ సాల్వే, సిద్ధార్ధ అగర్వాల్, దూబే, దమ్మాల పాటి శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు తదితరులు చాలా మంది వాదిస్తున్నారు. అయితే వారంతా న్యాయస్థానాల్లో చంద్రబాబు నాయుణ్ని కాపాడ్డానికి  వాదనలు చేస్తున్నారు.

ఇక ప్రజా కోర్టులో చంద్రబాబు ను కాపాడ్డానికి మరో  న్యాయవాది రంగంలోకి దిగాడు. అతనే  పవన్ కళ్యాణ్. అందుకే చంద్రబాబు నిర్దోషి అని ఆయనే తీర్పు కూడా ఇచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కారని.. ఆయన బాబుకు మద్దతుగా వాదనలు చేయడం వకీల్ ఇసాబే అవుతుందంటున్నారు నిపుణులు. అంటే వకీల్ లెక్క అని అర్దం. చంద్రబాబుకి-పవన్ కి మధ్య ఉన్న  ఇసాబ్ సంగతి తెలుగు ప్రజలందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ అర్ధం కాని వాళ్లు ఆ ఇసాబ్నే ప్యాకేజీ అంటున్నారంతే.
 

-సీఎన్‌ఎస్‌ యాజులు, సీనియర్‌ జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement