వంగా గీత జనసేనలో చేరుతోందంటూ తప్పుడు ప్రచారం
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా: వంగా గీత
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపు కోసం వక్రమార్గం పడుతున్నారు. ఇందులో భాగంగా.. జనసేన అల్లరి మూకలు కొందరు వైఎస్సార్‌సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. ఆమెకు సినీ నటుడు చిరంజీవి రాజకీయ భిక్ష పెట్టారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి పిఠాపురంలో ప్రచారానికొస్తే, గీత తన నామినేషన్ ఉపసంహరించుకుని జనసేనలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ కుటిల రాజకీయాలకు తెరలేపారు.
వంగా గీత 1990 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. తొలుత టీడీపీలో నామినేటెడ్ పదవులు నిర్వహించిన ఆమె.. 1996 నుంచి నాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా, లోక్‌సభ సభ్యురాలిగా ఓటమి ఎరుగని నాయకురాలిగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి 2008 ఆగస్టు 2న ప్రకటించారు. 2013లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆ పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు. అలాంటి ప్రజారాజ్యం పారీ్ట.. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వంగా గీతకు రాజకీయ భిక్ష పెట్టిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
పథకం ప్రకారం కుట్ర
కాగా, ప్రజలందరూ వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నారని, జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారని వంగా గీత చెప్పారు. ఓటమి భయంతోనే జనసేన నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసంహరణ గడువు అయిపోయాక నామినేషన్‌ను నేనెలా విత్‌డ్రా చేసుకుంటానని, ప్రజలను అయోమయానికి గురి చేయాలని పథకం ప్రకారమే ఇదంతా చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలే ప్రసక్తే లేదని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్ని కుయుక్తులు పన్నినా పిఠాపురంలో ఇప్పటికే తన గెలుపు ఖాయమైందని, దానిని ఎవరూ ఆపలేరని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment