
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కమిటీలోనూ స్థానం కల్పించకుండా అవమానపరుస్తున్నారంటూ ఆయన అనుచరులు ఆదివారం గాందీభవన్‌లో ఆందోళనకు దిగారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి పార్టీ కి సేవ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ప్రభాకర్‌కే ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు.
పదవులు రాకుండా జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు, రాష్ట్ర స్థాయిలో మరికొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో పొన్నంకు స్థానం కల్పించనందుకు నిరసనగా గాంధీభవన్‌కు వచ్చిన ఆయన అనుచరులు రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన నేతలను కూడా అడ్డుకునే యత్నం చేశారు.
అవసరమైతే తన పదవి ఇస్తానన్న కోమటిరెడ్డి
సరిగ్గా అదే సమయంలో గాందీభవన్‌కు వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వారితో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైతే తన స్థానంలో పొన్నం పేరు చేర్చాలని పార్టీని కోరు తానని చెప్పారు. సీనియర్ నేత జానారెడ్డి స్పంది స్తూ పార్టీ వదిలి వెళ్లిపోయిన మహేశ్వర్‌రెడ్డి స్థానంలో పొన్నంకు అవకాశం కల్పించాలని సూచించారు. మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ త్వరలోనే పొన్నంకు చైర్మన్ పదవి వస్తుందన్నారు.
పీఏసీ సభ్యులు ఎక్కువయ్యారు.. అందుకే: ఠాక్రే
రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ పొన్నం విషయంలో ఆందోళన అవసరం లేదని, త్వరలోనే ఆయనకు మంచి హోదా కల్పిస్తామని, పీఏసీ సభ్యులు ఎక్కువ కావడంతోనే ఆయనకు అవకాశం కల్పించలేకపోయామన్నారు.