సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): ఎవరికి టికెట్టు దక్కుతుందో తెలియదు కానీ, మాకంటే మాకేనంటూ టీడీపీ నేతాగణం అప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. అడ్డొస్తే సహించేది లేదంటూ పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గంపై అడ్డంగా విరుచుకుపడుతున్నారు. రెండుగా విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందర్నీ ఒకచోటకు తెచ్చి సయోధ్య కుదర్చాల్సిన పార్టీ జిల్లా అధినేత తనకే టికెట్టు దక్కుతుందో లేదో తెలియక బయటకు రావడమే మానేశారు. ఎన్నికలకు రెండేళ్లుండగానే నేతలు కుమ్ములాటల్లో తేలియాడుతుండడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల తీరుతో కేడర్ విసిగిపోతోంది. కొంత మంది ఆ పార్టీ కీలక నాయకులు బహిరంగంగానే అసమ్మతి గళం వినిపిస్తున్నారు.
చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది?
‘పల్లె’.. మూటాముల్లె సర్దుకోవాల్సిందే!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించి అగ్గిరాజేశారు. ఈసారి సైకం శ్రీనివాస రెడ్డికే టికెట్ అని బాంబు పేల్చారు. ఇదే క్రమంలో పుట్టపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న కూడా ‘పల్లె’పై తిరుగుబావుటా ఎగరేశారు. నాలుగు రోజుల క్రితం బుక్కపట్నం మాజీ ఎంపీపీ పెదరాసు సుబ్రమణ్యం మీడియా ముందుకు వచ్చి.. ‘పల్లె’కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పనిచేయబోనని స్పష్టం చేశారు.
ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ ఇస్మాయిల్, కొత్తచెరువులో రఘుపతి (మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్), పెద్దన్న (లోచెర్ల), నిషార్ అహ్మద్ (మాజీ డీలర్), మండల మాజీ కన్వీనర్ శ్రీనాథ్ తదితరులు పల్లె రఘునాథ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆయన పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో కిందిస్థాయిలోని కార్యకర్తలు నిరుత్సాహంలో కూరుకుపోయారు. ‘పల్లె’ వెంట వెళ్లాలా? వద్దా? అనే సంశయంలో పడ్డారు.
ధర్మవరంలో పరిటాల వర్సెస్ వరదా
ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి బీజేపీలో చేరిన వరదాపురం సూరిని మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని పరిటాల శ్రీరామ్ చెబుతున్నారు. ఒకవేళ ఆయన చేరాల్సి వస్తే తానే కండువా వేసి ఆహ్వానిస్తానని.. పార్టీ కోసం కష్టపడ్డాక పదవుల కోసం రెకమెండ్ చేస్తానని గతంలో పేర్కొన్నారు. సూరికి ధర్మవరం టికెట్ ఇస్తే మాత్రం తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలపై వరదాపురం సూరి వర్గీయులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. సూరి టీడీపీలో చేరడం ఖాయమని, పరిటాల శ్రీరామ్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
కదిరిలో అత్తార్ వర్సెస్ కందికుంట
కదిరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట తారాస్థాయికి చేరింది. అత్తార్ చాంద్‌బాషా, కందికుంట వెంకటప్రసాద్ మధ్య కోల్డ్‌వార్ కొన్నిరోజులుగా హీట్ పుట్టిస్తోంది. టికెట్ తమకంటే తమకేనంటూ ఎవరికి వారు సొంత కేడర్ ఏర్పాటు చేసుకుని వేరు కుంపట్లు పెట్టుకున్నారు. అన్ని మండలాల్లో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. కందికుంట అనుచరులు ఇటీవల అత్తార్ అనుచరుడిపై దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది.
పెనుకొండలో తెరచుకోని టీడీపీ కార్యాలయం
పెనుకొండ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిది విచిత్ర పరిస్థితి. ఈ సారి నియోజకవర్గ పార్టీ టికెట్ యూత్‌కేనంటూ అధిష్టానం తేల్చేయడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడైన తనకే అధిష్టానం చెక్ పెట్టేలా వ్యవహరిస్తుండడంతో నెల రోజులుగా పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని కూడా ఎక్కువగా తెరవడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ రేసులో అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్.సవితమ్మతో పాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా ఉన్నారు. బీకే నాయకత్వంపై సోమందేపల్లి, పరిగి, పెనుకొండ మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటరమణ, బోయ సూరి, నాగలూరు నారాయణస్వామి తదితరులు అసంతృప్తితో ఉన్నారు.
మడకశిరలో ఈరన్న వర్సెస్ తిప్పేస్వామి
మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య సమన్వయం లోపించింది. గత కొన్ని రోజులుగా ఇద్దరూ ఒకే కార్యక్రమంలో కనిపించడంలేదు. ఈరన్న ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. కాగా గుండుమల తిప్పేస్వామి తనకు అనుకూలంగా ఉన్న మరొకరిని ఎమ్మెల్యే రేసులోకి తెచ్చే ప్లాన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
బాలయ్యో.. ఇటు చూడయ్యో..
హిందూపురంలో అయితే తెలుగు తమ్ముళ్లది కక్కలేని మింగలేని పరిస్థితి. ఎంతో నమ్మకంతో గెలిపించిన నందమూరి బాలకృష్ణ ఈ మధ్య ఇటు చూడడమే మానేశారు. సినిమా షూటింగుల్లో బిజీబిజీగా ఉంటున్నారు. చుట్టుపు చూపుగా అప్పుడప్పుడు వస్తున్నా.. గృహ ప్రవేశాలు, వివాహాల ఫంక్షన్లకే పరిమితమవుతున్నారు. తను నమ్మి ఇక్కడ ఉంచిన పీఏనేమో అసాంఘిక కార్యకలాపాల్లో తలమునకలైన పరిస్థితి. దీంతో ఆ పార్టీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment