సీట్‌ సిక్ట్సీ ..చేరుకోని కాంగ్రెస్‌ | Congress cannot achieve 60 seats in Telangana | Sakshi
Sakshi News home page

సీట్‌ సిక్ట్సీ ..చేరుకోని కాంగ్రెస్‌

Published Sun, Oct 22 2023 4:49 AM | Last Updated on Sun, Oct 22 2023 4:49 AM

Congress cannot achieve 60 seats in Telangana - Sakshi

మ్యాజిక్‌ ఫిగర్‌... అధికారం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలకు అవసరమైన కీలక సంఖ్య ఇది. మొత్తం స్థానాల్లో సగం కంటే ఒకటి ఎక్కువ స్థానాల్లో గెలుపొందిన పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాజిక్‌ సంఖ్య విషయంలోనే కాంగ్రెస్‌ పార్టీ ఫికర్‌ అవుతోంది. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 60 స్థానాలు అవసరమవుతాయి. ఈ 60 స్థానాల మ్యాజిక్‌ ఫిగర్‌ కాంగ్రెస్‌ పార్టీ గత నాలుగు ఎన్నికల్లోనూ సాధించలేదు. ఇంకోమాట చెప్పాలంటే 1985 నుంచీ ఈ 60 స్థానాలు ఆ పార్టీకి దక్కలేదు.

అయితే 1985 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణలోని అసెంబ్లీ సీట్లు 107 మాత్రమే. ఈ లెక్కన ఆ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో ఒకట్రెండు సార్లు మ్యాజిక్‌ ఫిగర్‌  వచ్చింది ఇక, తెలంగాణ ఏర్పాటయిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో అయితే ఆ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌కు ఆమడదూరంలో నిలబడింది. 2014లో 21, 2018లో 19 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. ఇప్పుడు ఆ సంఖ్య నుంచి ఏకంగా 60 స్థానాలకు ఎగబాకడం ఏ మేరకు సాధ్యమనే చర్చ కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 

గతమంతా కటువుగా..
గతాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్‌ పార్టీ ప్రయాణం ఒడిదుడుకుల మధ్యనే సాగుతున్నట్టు అర్థమవుతుంది. కొన్ని ఎన్నికల్లో బాగానే సీట్లు సాధించినా, మరికొన్ని ఎన్నికల్లో చతికిలబడి పోవడం, ఆ తర్వాతి ఎన్నికల్లో కొంత పుంజుకోవడం రివాజుగా కనిపిస్తుంది. 1983లో ఎన్టీరామారావు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక నాదెండ్ల భాస్కరరావు రూపంలో జరిగిన తిరుగుబాటు కారణంగా అసెంబ్లీ రద్దయి 1985లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోని 107 స్థానాల్లో గెలిచింది కేవలం 14 మాత్రమే. అంతకుముందు 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 43 చోట్ల గెలుపొందింది. రెండేళ్లలోనే 29 స్థానాలు కోల్పోయింది.

ఆ ఎన్నికల్లో సీపీఐ8, సీపీఎం7, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం విశేషం. ఇక, 1989లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి తెలంగాణలో బాగా మెరుగుపడింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో 107 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 58 సీట్లు వచ్చాయి. అప్పుడున్న మొత్తం స్థానాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ తెలంగాణలోనూ వచ్చింది. 1985లో 14 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ 89లో ఏకంగా 44 సీట్లను అదనంగా సాధించింది. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం ముందు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఈ ఎన్నికల్లో 107 స్థానాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది కేవలం 6 మాత్రమే. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి సొంతంగా 69 చోట్లా, సీపీఐకి 13, సీపీఎంకు 8 స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో  తెలంగాణలో 42 సీట్లను సాధించింది.

ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతం కంటే మెరుగైన ఫలితాలను తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సాధించింది. ఇక, 2004లో మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ పాదయాత్ర ప్రభావం తెలంగాణలోనూ స్పష్టంగా కనిపించింది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ 185 సీట్లు సాధిస్తే, అందులో తెలంగాణలో 48 ఉన్నాయి. అప్పుడు ఉన్న 107 స్థానాల్లో కూడా ఆ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ పుంజుకుంది. గత ఎన్నికల కంటే రెండు ఎక్కువగా అంటే 50 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. కానీ, అప్పుడున్న మొత్తం 119 అసెంబ్లీ స్థానాలతో పోలిస్తే మ్యాజిక్‌ ఫిగర్‌ మాత్రం రాలేదు.

ఈ ఫలితాలను బట్టి ఉత్థాన పతనాల పరిణామాల అనంతరం ఈసారైనా కాంగ్రెస్‌ నిలదొక్కుకుంటుందా? గత రికార్డులను బద్దలు కొట్టి 119 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 60 చోట్ల గెలుపొందుతుందా అనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కానీ, పైకి మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఏం జరుగుతుందో డిసెంబర్‌ 3 వరకు వేచి చూడాల్సిందే. 

1985కు ముందు జరిగిన ఎన్నికల ఫలితాలిలా..
1983లో తెలుగుదేశం  పార్టీ ఆవిర్భవించిన సమయంలో  తెలంగాణలో 107 అసెంబ్లీ  స్థానాలున్నాయి. ఆ ఎన్నికల్లో  ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం హవా కనిపించింది. కానీ,  తెలంగాణలో మాత్రం తెలుగుదేశంతో సమానంగా కాంగ్రెస్‌ పార్టీ 43 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. ఆ ఎన్నికల్లో  ఆంధ్రప్రాంతంలో కాంగ్రెస్‌  పార్టీ ఘోరంగా దెబ్బతింది. అక్కడ మొత్తం 187  స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచింది  17 మాత్రమే. 

1978 ఎన్నికల్లో కాంగ్రెస్‌  పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  175  స్థానాల్లో విజయం  సాధించింది. అందులో తెలంగాణలోని 107 సీట్లలో  65 స్థానాల్లో గెలుపొందింది. 

1972 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో 78 స్థానాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో 219 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం మీద ఇండిపెండెంట్లు 57 మంది గెలుపొందారు.  

1967 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది కానీ,  అప్పుడు ఇండిపెండెంట్లు తమ హవా చూపించారు. ఉమ్మడి రాష్ట్రంలో  కాంగ్రెస్‌ పార్టీకి 165 సీట్లు వస్తే అందులో తెలంగాణలో 64  ఉన్నాయి. 101 స్థానాలను ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెంట్ల హవా కొనసాగింది. మొత్తం 287 స్థానాలకు గాను 68 చోట్ల స్వతంత్రులే గెలుపొందారు. తెలంగాణలో వీరి సంఖ్య 26 కావడం గమనార్హం.  

1962లోనూ కాంగ్రెస్‌ పార్టీనే గెలిచింది. తెలంగాణలోనూ 64 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో సీపీఐకి 18 స్థానాలు వచ్చాయి.  ఇండిపెండెంట్లు 19 మంది గెలిచారు.ఈ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా  సీపీఐ 51 స్థానాల్లో గెలుపొందింది. కానీ, తర్వాతి రెండు ఎన్నికల్లోనూ సీపీఐకి  గణనీయంగా సీట్లు తగ్గడంతో చాలా మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు.  

మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీనే  అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు సందర్భం కావడంతో 1955లో ఆంధ్రప్రాంతంలో జరిగిన  ఎన్నికల్లో గెలుపొందిన వారినే 1962 వరకు కొనసాగించారు. కానీ, తెలంగాణలో మాత్రం 1957లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ  68 చోట్ల గెలుపొందగా, ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) తరఫున పోటీ  చేసిన కమ్యూనిస్టులు 22 చోట్ల గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ 10 మంది 
ఇండిపెండెంట్లు గెలుపొందడం విశేషం.  

- మేకల కల్యాణ్‌ చక్రవర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement