రాహుల్ గాంధీ సభలకు జనం రాలేదు
ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అభాసుపాలైంది
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలుకు నోచుకోలేదు
బీజేపీ, కాంగ్రెస్ విశ్వసనీయత కోల్పోయాయి
‘సాక్షి’తో ఎమ్మెల్యే హరీశ్‌రావు
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం.. బీజేపీ పదేళ్లలో ఏమీ చేయకపోవడంతో ఆ పార్టీలు ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయాయని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు చెప్పారు.
కాంగ్రెస్‌పై ఓటర్లకు విరక్తి కలిగిందని, ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అభాసుపాలైందని, రాష్ట్రంలో మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, అనూహ్య ఫలితాలు రానున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా హరీశ్‌రావు శనివారం సాక్షితో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
అసెంబ్లీ ఎన్నికల్లో హామీలుగా ఇచ్చిన ఆరు గ్యారంటీలనే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అలాంటిది పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త గ్యారంటీలంటూ అబద్ధపు మాటలతో ప్రజల ముందుకొస్తున్నారు. ఈ గ్యారంటీలను ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరు. రాష్ట్రంలో ఏం జరుగుతుందనే అవగాహన లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఏది రాసిస్తే దాన్ని రాహుల్‌గాంధీ చదువుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్‌లో నడుస్తోంది.
రాహుల్ గాంధీ ఉదయ్‌పూర్‌లో చేసిన డిక్లరేషన్ అమలు చేయకపోవడంతో నాయకులు, కార్యకర్తల్లో విశ్వసనీయతను కోల్పోయారు. ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వమని చెబుతూ వచ్చి చివరకు వారికే ఎక్కువగా టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకున్నవారిని నట్టేట ముంచారు.
సర్కారు నుంచి వేధింపులు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విరక్తి కలిగింది. హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ సభనే దీనికి నిదర్శనం. జనాలు రాకపోతే సుమారు 45 నిమిషాలపాటు రాహుల్ బస్సులోనే ఉండిపోయారు. సభ ప్రాంగణంలోకి వెళ్లండంటూ స్వయంగా రేవంత్‌రెడ్డి గేట్ దగ్గరుండి కోరినా.. ప్రజలు లోపలికి పోని పరిస్థితి ఉంది.
కాంగ్రెస్ మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారు. గాలిలో ఉన్న కాంగ్రెస్‌ను భూమి మీదకు దించాలంటే ఆ పార్టీ నేతలను ఓడించాలి. నిరుద్యోగులు, ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. వ్యాపారులతోపాటు అన్ని వర్గాల వారికి ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయి. అక్రమ కేసులు పెట్టి గౌడన్నలను జైలు పాలు చేశారు, చంచల్‌గూడ జైలులో ఇప్పుడు సగం మంది వారే ఉన్నారు.
బీజేపీ ఒరగబెట్టింది ఏమీలేదు
పదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీలేదు, అందుకే దేవుని పేరుతో ఎన్నికల్లోకి వస్తున్నారు. అయోధ్యలో రామాలయాన్ని ట్రస్ట్ నిర్మించింది. ఆలయ నిర్మాణానికి చాలామంది ప్రజలు ఇచ్చారు... నేను కూడా విరాళం ఇచ్చా. అయితే, ఆ గుడిని తాము కట్టించామని బీజేపీ చెప్పుకుంటోంది.
విదేశాల నుంచి నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం చేయలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి చేసింది గుండు సున్నా. బీజేపీ ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్‌ను దూరం చేసింది. బీడీ కట్టలకు జీఎస్టీ పెట్టడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.
తులం బంగారం తుస్సు
పేదింటి ఆడ బిడ్డల పెళ్లికి ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి కింద ఇస్తామని చెప్పిన రూ.లక్ష చెక్ బౌన్స్ అయింది. తులం బంగారం హామీ కూడా తుస్సుమంది. వడ్లకు తరుగు తీస్తున్నారని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నారు. వడ్లకు తరుగు తీస్తున్న కాంగ్రెస్‌కు రైతులు ఓట్లలో తరుగు పెట్టాలి. రాష్ట్రంలో అప్పులు చూపించి.. దివాళా తీసిందని ప్రభుత్వం చెబుతుండటంతో పెట్టుబడులు రాకుండా పోతున్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు నా సవాల్‌ను స్వీకరించలేదు. ఆగస్టు 15లోపు ఆరు గ్యారంటీలు, రూ 2లక్షల రుణ మాఫీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పినా సీఎం ఇప్పటివరకు స్పందించలేదు. సవాల్‌ను స్వీకరించకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీలు బోగస్ సర్వేలు విడుదల చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నాయి. యువత వాటిని నమ్మొద్దు.
(గజవెల్లి షణ్ముఖరాజు)
Comments
Please login to add a commentAdd a comment