![Congress Party Demand To Speed Up Investigation Of TRS MLA Poaching Case - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/2/G-NIRANJAN-3.jpg.webp?itok=Na4ZsNz1)
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో జరుగుతున్న సిట్ విచారణ పరిధిని మరింత పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 2014లో కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు పార్టీలు మారడానికి గల కారణాలు ప్రజలకు తెలియాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు.
గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014, 2019 లలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు పార్టీ మారేందుకు ఎంత ఎర వేశారో తేల్చాలన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ సభ్యుడిగా గెలిచి 2014లో మంత్రి అయితే, సబితా ఇంద్రారెడ్డి 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మంత్రి అయ్యార ని, వీళ్లకు ఏం ఎరవేశారని ప్రశ్నించారు.
కార్మిక మంత్రి మల్లారెడ్డి కూడా 2016లో టీడీపీ ఎంపీగా గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరారని గుర్తు చేశారు. ప్రలోభాలలో భాగంగానే మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి, తలసాని సాయికిరణ్‌కు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇచ్చారని విమర్శించారు. ఈ విషయమై తలసాని, మల్లారెడ్డికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment