
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఓటింగ్ యంత్రాలైన ఈవీఎంల పుణ్యమా అని ఓట్ల లెక్కింపు మొదలైన రోజే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు మొదలైన నాలుగు రోజుల వరకు ఫలితాలు వెలువడక పోవడంలో ఎన్నికల నిర్వహణలో అమెరికా, భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలంటూ ట్వీట్ల మీద ట్వీట్లు వెలువడ్డాయి. త్వరితగతిన ఫలితాలు వెలువడడం కన్నా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా సాగడం మంచిదన్న విషయం గ్రహించాల్పి అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటి అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా పోలింగ్‌లో పారదర్శకత ముఖ్యం.
భారత్‌లో జరిగే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంతో ఉంటుందన్నది అందరికి తెల్సిందే. ఎన్నికల సందర్భంగా అధిక నిధులను ఖర్చుపెట్టే పార్టీలది, అభ్యర్థులకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత మేరకు డబ్బుతో ప్రలోభ పెట్టి ఓట్లను కొనుక్కోవచ్చు. వీధుల్లో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రకటనలు కుమ్మరిస్తూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. రాజకీయ పార్టీలకు వస్తోన్న పెండింగ్ వల్ల ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరగుతూ వస్తోంది తప్ప తగ్గడం లేదు.
రాజకీయ పార్టీలకు నిధుల విరాళాలపై పారదర్శకతను తీసుకొస్తానంటూ సవాల్ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఎలక్టోరల్ బాండ్’లను తీసుకొచ్చింది. ఎవరు ఇచ్చారో, ఎంత ఇచ్చారో పార్టీలకుగానీ, ప్రజలకుగానీ తెలియకుండా ఉండేలా ఎలకోటరల్ బాండ్‌లను తీసుకరావడంతో రాజకీయ పార్టీలకు నల్లడబ్బంతా విరాళాల రూపంలో వచ్చి పడుతోంది. దాంతో ఎన్నికల సందర్భంగా డబ్బు ప్రభావం పెరిగింది. అన్ని పార్టీలకు నిధులు వస్తాయి కనుక ఎన్నికలపై డబ్బు ప్రభావం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొంత మంది కుహనా మేథావులు వాదిస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న పార్టీకే అధిక నిధులు వస్తాయని, ఆ పార్టీయే ఎన్నికల సందర్భంగా అధిక నిధులను కుమ్మరించి లాభ పడుతుందనే విషయం మనకు కొత్త కాదు.
అమెరికా తరహాలో అందరికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం మనకు లేకపోవడం భారత్ ఎన్నికల వ్యవస్థలో మరో లోపం. మన దేశంలో ఉపాధి కోసం కోట్లాది మంది వలసలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలసలు పోయారు. ఏటా కోట్లాది మంది యువత ఉపాధి కోసం వలసలు పోతూనే ఉన్నారు. ఎన్నికల సమయాలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల్లోనే ఉండి పోవడం వల్ల వారు పోలింగ్‌కు రాలేకపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి బీహార్ ఎన్నికల్లో మరి కొన్ని కేటగిరీల వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్సించారుగానీ అది సరిపోదు. అందరికి దాన్ని కల్పించాల్సిందే.
భారత్‌లో పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాలే మారిపోతాయి. 2019లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి సభ్యుల ఫిరాయింపును ప్రోత్సహించడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను శాఖ, పోలీసు శాఖ అధికారులు కూడా పాలకపక్షం తరఫున కొంతమేరకు ఓటింగ్‌ను ప్రభావితం చేస్తారు. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపర్ చేశారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
అలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా అన్నీ ఏవీఎంలకు ఎవరికి ఓటు వేశామో ఓటరు తెలుసుకునేలా రసీదు పద్ధతిని ప్రవేశపెట్టాల్సిందే. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ రసీదు సౌకర్యం కలిగిన ఈవీఎంలను ప్రతి నియోజకవర్గానికి ఐదింటిని మాత్రమే ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. ఎన్నికల్లో గెలవడమంటే అంతో ఇంతో డబ్బు అవసరం కనుక సామాన్యులు, నిజాయితీపరులు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఆ పరిస్థితి కూడా మారాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment