
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయించగా అదే దారిలో నడవాలని సీపీఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. సీపీఐకి కొత్తగూ డెం, సీపీఎంకు మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలే ఇస్తామని, అధికారంలోకి వచ్చాక చెరో ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయడంతో వామపక్షాలు భగ్గుమంటున్నాయి. ఐదు సీట్ల నుంచి మూడు... తర్వాత రెండు స్థానాలకు దిగిరాగా ఇప్పుడు చెరొక సీటే ఇస్తామని ప్రకటించడంపై మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయించగా సీపీఐ శుక్రవారం జరిగే పార్టీ రాష్ట్ర సమావేశంలో చర్చించి ఒక అభిప్రాయానికి రానుంది. సీపీఎం నిర్ణయానికి అనుగుణంగా ముందుకు సాగాలని సీపీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీపీఎం 17 స్థానాలతో మొదటి జాబితా ప్రకటించగా సీపీఐ సైతం అదే స్థాయిలో జాబితా ప్రకటించే అవకాశముంది.
నామినేషన్ల గడువు వరకు తుది నిర్ణయం ప్రకటించకుండా తమకు ఆశాభంగం కలిగించిన కాంగ్రెస్‌పై లెఫ్ట్ పార్టీలు గరంగరంగా ఉన్నాయి. ఇది తమను మోసం చేయడమేనని అంటున్నాయి. తమ సత్తా చాటుకోవాలని, పోటీ చేసే అన్నిచోట్లా గణనీయంగా ఓట్లు సంపాదించాలని, ఆ మేరకు కృషి చేయాలని నిర్ణయించుకుంటున్నాయి. సీపీఐ వైఖరి శుక్రవారం వెల్లడైతే వెంటనే ఇరు పార్టీల సంయుక్త సమావేశం జరగనుంది.
45 సీట్లలో ఇరు పార్టీల పోటీ?
బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వామపక్షాలు ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సీపీఐ కూడా కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకొని ముందుకు వస్తే, ఈ ఎన్నికల బరిలో వామపక్ష ప్రజాతంత్ర, లౌకిక కూటమి పోటీలో ని లవనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా సీపీఐ, సీపీఎం కలసి పోటీ చేస్తాయని అంటున్నాయి. ఆ తర్వాత కలిసొచ్చే ఇతర ప్రజాతంత్ర, లౌకిక శక్తులతో కలసి పోటీలో ఉండాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. సీపీఐ, సీపీఎం 45కు పైగా స్థానాల్లో పోటీ చేసే అవకాశముంది. మిగిలిన స్థానాల్లో బీజేపీని ఓడించే పార్టీలకు మద్దతు ప్రకటించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment