బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్టీలోని సాంప్రదాయ వర్గాలను అణచివేస్తున్నారా? తన సామాజికవర్గం మేలు కోసం ఇతర వర్గాలను తొక్కిపెడుతున్నారా? పార్టీని బాగుచేస్తారని నియమిస్తే ఏపీ బీజేపీని కమ్మ రాజ్యంగా తయారు చేస్తున్నారా? పురంధేశ్వరి తీరుపై పార్టీ ఒరిజినల్ నాయకులు, ఆర్ఎస్ఎస్ వాదులు ఏమనుకుంటున్నారు? తనవారి కోసం, చంద్రబాబు వర్గం కోసం ఒరిజినల్ బీజేపీ నేతలను పురంధేశ్వరి అడ్డుకుంటున్నారా? అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?
ఏపీలో కాషాయ సేనకు అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీకి తొలి నుంచీ అండగా ఉన్న సంప్రదాయవర్గాలపై కక్ష సాధిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీకి మొదటి నుంచి బ్రాహ్మణలు, వైశ్యులు, క్షత్రియులుతో పాటు మరికొన్ని వర్గాలు అండగా ఉండేవి. ప్రతి ఎన్నికల్లోను అభ్యర్థులతో సంబంధం లేకుండా బీజేపీకి తన సాంప్రదాయ ఓటు బ్యాంకు కొనసాగుతూ వచ్చేది. పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తరువాత బీజేపీకి అండగా ఉన్న వర్గాలను తొక్కిపెట్టి పార్టీలో తన సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దపీట వేస్తున్నారు. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులుగా తన కులం వారినే నియమిస్తున్నారు. మిగతా వర్గాల వారిని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని ఆర్‌ఎస్ఎస్ వాదులు, తొలి నుంచీ పార్టీలోనే ఉంటున్నవారు విమర్శిస్తున్నారు.
విశాఖ బీజేపీ ఎంపీ స్థానాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్ నరసింహారావు ఆశిస్తున్నారు. విశాఖలోనే నివాసం ఉంటూ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన మేనకోడలు భర్త, బాలకృష్ణ చిన్నల్లుడు గీతం భరత్ కోసం జీవీఎల్‌కు మొండి చేయి చూపించారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికైన సోము వీర్రాజును తప్పించి బీజేపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కుట్ర చేసి పురందేశ్వరిని అధ్యక్ష పదవి దక్కేలా చేశారు. రాజమండ్రి ఎంపీ సీటును సోము వీర్రాజు ఆశిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాదిని కాదని పురందేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పార్టీలో కాపులను కూడా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బండ బూతులు తిట్టిన, ఉగ్రవాది అంటూ సంబోధించిన, హోం మంత్రి అమిత్ షా కాన్వాయ్‌పై చంద్రబాబు రాళ్ల దాడి చేయించినా.. అవన్నీ పక్కన పెట్టి కులాన్ని దృష్టిలో పెట్టుకొనే బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరేలా పురందేశ్వరి చక్రం తిప్పారని మండిపడుతున్నారు. తన సామాజిక వర్గానికే చెందిన లంకా దినకర్‌ను అధికార ప్రతినిధిగా ఎంపిక చేసి జాతీయ చానల్స్‌కు ఇంటర్వ్యూలు, చర్చా వేదికల కోసం పంపుతున్నారు.
పురందేశ్వరి పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీపతి రాజాను మీడియా రాష్ట్ర కోఆర్డినేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పాతూరి నాగభూషణంను నియమించారు. బీజేపీ తరఫున సోషల్ మీడియా విభాగం చూసే వ్యక్తి తపన్ చౌదరి, మహిళ విభాగం అధ్యక్షురాలు నిర్మల కిషోర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.
విజయవాడ పార్లమెంటుకు టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు కాబట్టి పురందేశ్వరి ఊరుకున్నారని, లేదంటే విజయవాడ నుంచి బీజేపీ తరుపున సుజనా చౌదరిని కూడా పోటీ చేయించేవారు అంటున్నారు. రాష్ట్ర కమిటీలో కీలకమైన పదవులన్నీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారితోనే పురందేశ్వరి భర్తీ చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆర్ఎస్ఎస్ వాదులు, బ్రాహ్మణులు ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు గుర్రుగా ఉన్నారు. వారందరూ పార్టీకి విధేయులుగా ఉండడం, క్రమశిక్షణ కలిగిన వారు కావడంతో కమ్మ కులాభిమానంతో పార్టీలో జరుగుతున్న అరాచకాలపై నోరు మెదపలేకపోతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తరువాత బీజేపీ విలువలను, సిద్ధాంతాలను పక్కనపెట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే రానున్న రోజుల్లో బీజేపీకి మద్దతుగా ఉంటూ వస్తున్న సాంప్రదాయవర్గాలన్నీ దూరం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment