
సాక్షి, విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు క్యాంపు కార్యాలయం సిద్ధమైంది. పవన్ ఆలోచనలు, అభిరుచి మేరుకు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆఫీసు నిర్మాణం చేపట్టారు. పవన్ మెచ్చే విధంగా ఆయనకు నచ్చిన రంగుల్లో క్యాంపు ఆఫీస్ నిర్మాణం జరిగింది. ఇదంతా చూసిన తర్వాతే ఆఫీసుకు పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం.
కాగా, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి మంగళవారం తన ఆఫీసును పవన్ పరిశీలించారు. ఆఫీసు నిర్మాణంలో భాగంగా భవనంలో పైన అంతస్తులో నివాసం, కింద కార్యాలయం ఏర్పాటు చేశారు. అదే భవనంలో సమావేశం మందిరం కూడా అందుబాటులో ఉండటంతో ప్లాన్‌కు పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం. తన ఆలోచనలు, అభిరుచులకు తగిన విధంగా క్యాంపు ఆఫీసులో పవన్ మార్పులు సూచించడంతో అందుకు తగినే విధంగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, గతంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే ఆఫీసును వినియోగించుకున్నారు.
మరోవైపు.. కాసేపటి క్రితమే పార్టీ కార్యాలయానికి పవన్ బయలుదేరారు. అలాగే, ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పవన్ పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచిన విషయం తెలిసిందే. వై ప్లస్ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా పవన్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఇక.. రేపు పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.