సినీతారలు రాజకీయాల్లోనూ తళుక్కుమని మెరుస్తుంటారు. ఈ కోవలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ నటుడు దేవానంద్ కూడా వస్తారు. ఆయన ఎంతో ఉత్సాహంతో రాజకీయాల్లో కాలుమోపారు. అధికారికంగా పార్టీని స్థాపించి, ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు.
అవి 1975.. ఎమర్జెన్సీ రోజులు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి దేశం మొత్తం ఉలిక్కిపడింది. దీనిలో సినిమా ప్రపంచానికీ మినహాయింపేమీ లేదు. 1977లో ఎమర్జెన్సీ తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దింపేందుకు సినీ తారలు ఏకమై జాతీయ పార్టీని స్థాపించాలనుకున్నారు. పార్టీ అధ్యక్షునిగా నటుడు దేవానంద్‌ను ఎన్నుకున్నారు.
1979లో జనతా ప్రభుత్వం కూలిపోయి, ఎన్నికలు ప్రకటన వచ్చినప్పుడు బాలీవుడ్ నటులు రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 4న ముంబైలోని తాజ్ మహల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘నేషనల్ పార్టీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు దేవానంద్ ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు.
పార్టీ ప్రధాన కార్యాలయం ముంబై పరేల్‌లోని వి శాంతారామ్ రాజ్‌కమల్ స్టూడియోలో ఏర్పాటుచేశారు. దేవానంద్, అతని సోదరుడు విజయ్ ఆనంద్, నిర్మాత,దర్శకుడు వి. శాంతారామ్, జీపీ సిప్పీ, శ్రీరామ్ బోహ్రా, ఐఎస్ జోహార్, రామానంద్ సాగర్, ఆత్మారామ్, శత్రుఘ్న సిన్హా, ధర్మేంద్ర, హేమా మాలిని, సంజీవ్ కుమార్ తదితులు పార్టీ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనేవారు. వీరంతా దేవానంద్‌కు అండగా నిలిచారు.
సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారి పార్టీ కావడంతో పెద్ద ఎత్తున జనం పార్టీలో చేరారు. దీంతో జనతా ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌లో ఆందోళన చెలరేగింది. ‘నేషనల్ పార్టీ’ ముంబైలోని శివాజీ పార్క్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభ విజయవంతమైంది. అదే సమయంలో ప్రముఖ నటుడు ఐఎస్ జోహార్ తాను జనతా ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి రాజ్ నారాయణ్‌పై ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిస్తానని సవాల్ చేశారు.
అతని ప్రకటనపై ఆగ్రహించిన రాజ్ నారాయణ్ జోహార్ ఇకపై ఇలాంటి చేష్టలను మానుకోకపోతే, చేతులు కాళ్లు విరగ్గొడతానని జోహార్‌ను హెచ్చరించారట. దీనికితోడు ‘నేషనల్ పార్టీ’కి వస్తున్న ఆదరణకు అడ్డుకట్ట వేయకపోతే తమ మనుగడకు ఇబ్బంది ఏర్పడుతుందని భావించిన జనతా ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు.. పలువురు నటులను తమవైపు తిప్పుకున్నారట. దీంతో ‘నేషనల్ పార్టీ’లో అంతవరకూ చురుగ్గా ఉన్న సినీ కళాకారులు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వైదొలగారట. చివరికి దేవానంద్ ఒంటరిగా మిగిలిపోయారట. అటువంటి పరిస్థితిలో ఆయన ‘నేషనల్ పార్టీ’ని ముందుకు తీసుకువెళ్లలేకపోయాట.
Comments
Please login to add a commentAdd a comment