ఎస్పీ, ఆప్‌కు ఎదురుదెబ్బ! ఆజంఖాన్‌ అడ్డాలో వికసించిన కమలం.. | By Election 2022 Results 3 Lok Sabha And 7 Assembly Seats Full Details | Sakshi
Sakshi News home page

By Election 2022 Results: ఎస్పీ, ఆప్‌కు ఎదురుదెబ్బ! ఆజంఖాన్‌ అడ్డాలో వికసించిన కమలం..

Published Sun, Jun 26 2022 9:02 PM | Last Updated on Sun, Jun 26 2022 9:47 PM

By Election 2022 Results 3 Lok Sabha And 7 Assembly Seats Full Details - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలు బద్ధలయ్యాయి. ఆజంఖాన్‌ అడ్డాలో కమలం వికసించింది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి షాక్‌ ఇచ్చింది. ఎస్పీ సిట్టింగ్‌ స్థానమైన రాంపూర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఘన్‌ శ్యామ్‌ లోధి జయకేతనం ఎగురవేశారు. 42 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది.. త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో రాంపూర్ లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. రాంపూర్ లోక్‌స‌భ స్థానం ఇప్ప‌టివ‌ర‌కు ఆజంఖాన్ కంచుకోట‌గా ఉంది. ఇక ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానంలోనూ కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి దినేశ్‌ లాల్‌ యాదవ్‌ 8,679 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

ఆప్‌కు ఎదురుదెబ్బ
పంజాబ్‌లో అధికార ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్‌ లోక్‌సభ స్థానంలో శిరోమణి అకాలీదళ్‌ నేత సిమ్రన్‌ జీత్‌ మాన్‌ విజయం సాధించారు. భగవంత్‌ మాన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సంగ్రూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరిగాయి.

దేశ రాజధాని ఢిల్లీలోని రాజిందర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది. ఆప్‌ నేత దినేశ్‌ పాఠక్‌ 55 శాతానికి పైగా ఓట్లు దక్కించుకుని విజయఢంకా మోగించారు. కాగా.. రాజ్యసభ ఎంపీగా గెలుపొందిన రాఘవ్‌ చద్దా.. రాజిందర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు జరిగాయి.
చదవండి👉పంజాబ్‌లో ఆప్‌కు బిగ్‌ షాక్‌.. ఇది అస్సలు ఊహించలేదు!

నాలుగింటిలో మూడు బీజేపీవే
ఈశాన్య రాష్ట్రం త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మూడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. టౌన్‌ బార్డోవాలీ స్థానం నుంచి పోటీ చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్‌ స్థానమైన అగర్తలాలో కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌ గెలుపొందారు.

► ఝార్ఖండ్‌లోని మందార్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ గెలుపొందారు.

► ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 82,888 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. 
చదవండి👉మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు

మోదీ, యోగి కృతజ్ఞతలు
తాజా ఫలితాలపై ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ.. బీజేపీకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆజంగఢ్‌, రాంపుర్‌ ఫలితాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

ఎస్పీకి కంచుకోటలైన రాంపూర్‌, ఆజంగఢ్‌లో కాషాయ జెండా రెపరెపలాడటంతో పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అభినందనలు తెలిపారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement