సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది. ఆత్మగౌరవ నినాదంతో ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌తో పోరుకే సిద్ధమైనట్లు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు హుజూరాబాద్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రాజకీయంగా పావులు కదిపే పనిలో ఉన్నారు. ‘హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఆరుసార్లు గెలిచింది కేవలం కేసీఆర్ బొమ్మతోనే’ అన్న సంకేతాలను పంపించడం ద్వారా ఆయన కేడర్‌ను తమవైపు తిప్పుకునేందుకు మైండ్‌గేమ్ ప్రారంభించినట్లు అర్థమవుతోంది. హుజూరాబాద్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఇప్పటికే ఈటలకు మద్దతు ప్రకటించినా.. రోజులు గడిచేకొద్దీ పరిస్థితి మారుతుందనే ఆశాభావంతో అడుగులు వేస్తున్నారు. మండలాల వారీగా ఈటలకు వ్యతిరేకంగా నాయకులను కూడగట్టే పనిలో పడ్డారు.
ఈటల ప్రతిష్ట దెబ్బతీయడమే లక్ష్యంగా..
మెదక్ జిల్లా మాసాయిపేట అసైన్డ్ భూముల కొనుగోలు, దేవరయాంజాల్ భూములకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఈటల ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అదే సమయంలో బీసీ నాయకుడన్న పేరును చెరిపేసేందుకు ‘ఈటల రాజేందర్ రెడ్డి’ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈటల తనయుడు నితిన్‌రెడ్డికి సంబంధించి మేడ్చల్ జిల్లాలోని రావల్‌కోల్ భూ లావాదేవీల్లో ఆయన తండ్రి పేరును ఈటల రాజేందర్ రెడ్డిగా చూపించిన విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెచ్చారు. దీనిని ప్రచారాస్త్రంగా మార్చాలని మంత్రి గంగుల కమలాకర్ పథక రచన చేస్తున్నట్లు సమాచారం. కాగా.. ఈటలకు సంబంధించి మరిన్ని వివాదాస్పద అంశాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా నాయకులు
హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోతోంది. ఇటీవల గంగుల జన్మదినం సందర్భంగా హుజూరాబాద్‌లో ఆయన ఫొటోతో కొందరు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులుగా ఉన్న హుజూరాబాద్ మండలాధ్యక్షుడు జి.కొమరారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, జమ్మికుంటకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, సీనియర్ నేత తుమ్మటి సమ్మిరెడ్డి, హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భర్త శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ నిర్మల, ఎంపీపీ రాణి భర్త సురేందర్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశినికోటి స్వప్న భర్త కోటి, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, ఇల్లంతకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేశ్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేశ్, జమ్మికుంట జెడ్పీటీసీ శ్రీరాం శ్యాం, మాజీ వైస్ ఎంపీపీ చొక్కా రంజిత్, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీల భర్తలు, ఇతర నాయకులు ఈటల వెంటే ఉన్నారు. 90 శాతం మంది ఎంపీటీసీలు, సర్పంచులు ఆయన వెంటే ఉన్నారు.
అదే సమయంలో ఇల్లంతకుంట నుంచి జెడ్పీటీసీగా గెలిచిన కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బండ శ్రీనివాస్, వీణవంక నాయకులు ఈటలకు దూరంగా ఉంటున్నారు. ఎంపీపీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు కూడా సీన్‌లోకి రాకుండా వారి భర్తలు మాత్రమే ఇప్పటివరకు ఈటల వెంట కనిపించారు. జమ్మికుంట పట్టణానికి చెందిన కౌన్సిలర్ పొనగంటి మల్లయ్యతోపాటు జమ్మికుంట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటరెడ్డి, పాపక్కపల్లి సర్పంచి మహేందర్, ఇల్లంతకుంట మండలానికి చెందిన పలు గ్రామాల సర్పంచులు, నాయకులు సోమవారం కరీంనగర్‌లో మంత్రి గంగులను కలిసి, తాము పార్టీ వెంటే ఉంటామని చెప్పారు. కాగా పదవులు పోయే పరిస్థితి ఏర్పడితే ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు టీఆర్‌ఎస్‌లోనే కొనసాగే అవకాశం ఉందని చెపుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు కూడా ఈటలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
టీఆర్‌ఎస్ టికెట్టు కోసం యత్నాలు షురూ
ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అప్పటికి కరోనా ఉధృతి తగ్గితే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ లోపు టీఆర్‌ఎస్ టిక్కెట్టు కోసం యత్నాలు మొదలయ్యాయి. గతంలో ఈటల మీద ఓడిపోయిన కౌశిక్ రెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి టికెట్టు ఇవ్వనున్నట్లు ప్రచారం ఓవైపు జరుగుతుండగా, గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వకుళాభరణం కృష్ణమోహన్ రావు కూడా రేసులోకి వస్తున్నారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ, ఆయనను వేములవాడ నుంచి ఫోకస్ చేసే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు కుటుంబం నుంచి ఒకరికి అవకాశం ఇస్తారని భావిస్తున్నప్పటికీ, ఇప్పటికే రెండు పదవులు వాళ్లింట్లో ఉండడం అడ్డంకిగా మారనుంది. బీజేపీలో ఉన్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి రావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా స్పష్టత లేదు. ఆయన బీజేపీ నుంచే పోటీ చేసే అవకాశం ఉంది.
కౌశిక్ రెడ్డి ద్వారా సరికొత్త రాజకీయం?
ఈటల రాజేందర్‌పై గతంలో పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని తెరపైకి తెచ్చేందుకు టీఆర్‌ఎస్ నాయకత్వం అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కౌశిక్ భుజాల పైనుంచి తుపాకీ ఎక్కుపెట్టి ఈటలను టార్గెట్ చేసే సరికొత్త రాజకీయం నడుస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరిగితే కౌశిక్ రెడ్డి బలమైన ప్రత్యర్థిగా ఉంటాడని ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా టీఆర్‌ఎస్ అధిష్టానం ఇప్పటికే సమాచారం తెప్పించుకుంది. అయితే.. ఇప్పుడే కౌశిక్‌ను పార్టీలోకి తీసుకోకుండా ఆయన ఇమేజ్‌ను మరింత పెంచి ఆ తరువాత గులాబీ కండువా కప్పాలని భావిస్తున్నారు. ఈటలకు వ్యతిరేకంగా కౌశిక్‌ను ఫోకస్ చేసే ఆలోచనతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇటీవల కౌశిక్ రెడ్డి కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేడ్చల్ మండలం రావల్‌కోల్‌లో నితిన్‌రెడ్డి పేరిట 31.2 ఎకరాలు, మరో 36.39 ఎకరాల భూమిని సాదా కేశవరెడ్డి అనే బినామీ పేరిట కొనుగోలు చేశారని వెల్లడించారు. ఇదే సమావేశంలో ఈటలను ‘రెడ్డి’గా కౌశిక్ పేర్కొన్నారు. అయితే.. ఈ భూ లావాదేవీల వ్యవహారమంతా టీఆర్‌ఎస్ స్క్రిప్ట్ ప్రకారమేనని సమాచారం. తాజాగా మంగళవారం మరోసారి పాడి కౌశిక్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈటలకు సంబంధించిన మరో వివాదాన్ని ఆయన బహిర్గతం చేయబోతున్నట్లు తెలిసింది. ‘మంగళవారం కరీంనగర్‌లో మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది’ అని కౌశిక్ రెడ్డి ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం.
చదవండి: Etela Rajender: యుద్ధానికే సిద్ధం?
Etela, Putta Madhu: వేగంగా మారుతున్న సమీకరణలు..!
Comments
Please login to add a commentAdd a comment