సాక్షి, పశ్చిమగోదావరి: కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు మాజీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. అలాగే, బూట్లు వేసుకుని దేవుడిని పూజించే సంస్కారం చంద్రబాబుది అంటూ ఘాటు విమర్శలు చేశారు. చేతకాని కూటమి పాలనను ప్రజలు నిలదీస్తారని ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలకు తెరలేపారా? అంటూ ప్రశ్నించారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం పశ్చిమ గోదావరిలో మీడియాతో మాట్లాడుతూ..‘గత రెండు మూడు రోజులుగా నీచాతినీచమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తానే అని చెప్పుకునే విధంగా సీఎం చంద్రబాబు ఆ కలియుగ దైవాన్ని అడ్డుపెట్టుకున్నాడు. వంద రోజుల పరిపాలన గురించి మాట్లాడకూడదని డైవర్షన్‌గా నీచ రాజకీయాలు చేస్తున్నారు. పవిత్రమైన తిరుపతి ప్రసాదంపై ఎంతో దారుణంగా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఆ వేంకటేశ్వరస్వామి సహించడు. తిరుపతిలో ఏ వస్తువు కొనాలన్నా టెండర్ ప్రకారం పూర్తిగా తనిఖీలు అయ్యాకే అనుమతి ఇస్తారు.
నిజంగా జూలై 22న రిపోర్ట్ వస్తే ఇంతకాలం ఎందుకు తొక్కి ఉంచారు. నీ చేతకాని 100రోజుల పరిపాలన ప్రజలు నిలదీస్తారని ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలకు తెరలేపారా?. ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిరం కట్టి తిరుపతిలో అడ్మినిస్ట్రేషన్ నచ్చి వారిని అయోధ్యకు తీసుకెళ్లారు. తిరుపతి వంటి అడ్మినిస్ట్రేషన్ అయోధ్యలో తీసుకురావాలని చూశారు. అటువంటి తిరుపతిలో తప్పు జరిగిందని చెప్పడం ఎంత దారుణం. కోట్లాది మంది హిందూ భక్తులు మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు. బూట్లు వేసుకుని దేవుడిని పూజించే సంస్కారం చంద్రబాబుది. నీ హయాంలో జరిగిన తప్పు ఎవరి మీదకి నెట్టేస్తున్నావ్. ఇదంతా వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. తగిన మూల్యం చెల్లించక తప్పదు.
హాథిరామ్ మఠం దేవాదాయ శాఖ భూములను కాజేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తున్నారు. గత ఐదేళ్లలో దేవాలయాలు చాలా బాగా నడిచాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాలను అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. సీజీఎఫ్ నిధుల ద్వారా 600 కోట్లతో పురాతన దేవాలయాలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 4100 పైగా దేవాలయాలను అభివృద్ధి చేశాం. మేము దేవాలయాలను ఇంత అభివృద్ధి చేస్తే చంద్రబాబు దేవాదాయ శాఖలో రివ్యూ చేసి గత ప్రభుత్వంలో జరుగుతున్న దేవాలయాల పనులను ఆపేయమని ఆదేశాలు జారీచేశారు. ఇదంతా చూస్తూ బీజేపీ నాయకులు ఎందుకు నిలదీయడంలేదు. కూటమి భాగస్వాములు ఏం చేస్తున్నారు.
సూపర్ సిక్స్ అన్నారు ఏమైపోయింది. ఒక ప్రాంతంలో వచ్చిన వరదను కూడా మీరు ఎదుర్కోలేక పోయారు. దేశ రాజకీయాల్లో ఎక్కడ కూడా చంద్రబాబు లాంటి నీచమైన నాయకుడు ఉండడు. ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకుని లెంపలు వేసుకుని చేసిన తప్పు ఒప్పుకో. మన రాష్ట్రానికే తలమానికంగా నిలిచే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మీదే నిందలు వేయడం అత్యంత బాధాకరం’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: దేవుడి మీద రాజకీయం చంద్రబాబుకే చెల్లింది: ఎమ్మెల్సీ బొత్స
Comments
Please login to add a commentAdd a comment