లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలనలో వేధింపులకు గురవుతున్నట్లు రైతులు భావిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 స్థానాలకు గాను 400 సీట్లను గెలుచుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బీజేపీ ఎన్నికల హామీ అమలు అసంభవంగా కనిపిస్తోందని తెలిపారు. ‘ఉత్తరప్రదేశ్ ప్రజలు, రైతులు ప్రస్తుతం రైతుల ఆదాయం ఎంత అని బీజేపీని అడుగుతున్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు కూడా పైకెగబాకాయి. అలాంటప్పుడు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీ ఎప్పటికి నెరవేరుతుంది?’అని ఆయన ప్రశ్నించారు.
లక్నోలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నా రైతులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ‘రైతులు అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ, వారు ఇప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములకు సక్రమమైన పరిహారం అందజేస్తాం’అని చెప్పారు. పాడి పరిశ్రమకు సంబంధించి అనేక పథకాలు, హామీలను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. చెరకు రైతులకు చెల్లింపుల విషయమై ఆయన మాట్లాడుతూ..‘అసలు విషయం చెల్లింపులకు సంబంధించింది కాదు. పాత బకాయిల గురించి. రైతుల వేదన సీఎం యోగికి వినిపించడం లేదు’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment