సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడటం దురదృష్టకరం, బాధాకరం అని కాంగ్రెస్ తెలిపింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పార్టీ పోరాడుతున్న సమయంలో ఆయన రాజీనామా చేయడంపై విచారం వ్యక్తం చేసింది. ఆజాద్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, జైరాం రమేశ్ మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయంపై స్పందించారు. ఆజాద్ రాజీనామా లేఖలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని జైరాం రమేశ్ అన్నారు.
అనంతరం ట్విట్టర్ వేదికగా ఆజాద్‌పై విమర్శలు గుప్పించారు జైరాం రమేశ్. గులాం నబీ ఆజాద్ డీఎన్‌ఏ 'మోడీ-ఫై' అయిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను ఎంతో గౌరవించిందని అన్నారు. కానీ అతను మాత్రం ద్రోహం చేశారని మండిపడ్డారు. రాజీనామా లేఖలో ఆజాద్ చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన అసలు రంగుకు నిదర్శనమన్నారు.
50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఐదు పేజీల లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. 2013లో రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నాశనమైందని ఆరోపించారు. సీనియర్లకు సముచిత స్థానం కల్పించడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు రాహుల్ త్వరలో చేపట్టబోయే 'భారత్ జోడో యాత్ర'పైనా విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు ముందు 'కాంగ్రెస్ జోడో యాత్ర' చేపట్టాల్సిందని సైటెర్లు వేశారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని లేఖ రాసిన జీ-23 నేతలను అవమానాలకు గురి చేశారని ఆరోపించారు.
గౌరవం ఉండదు..
మరోవైపు ఆజాజ్‌కు ఇకపై గౌరవం దక్కకపోవచ్చని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఆయనపై గతంలో ఎంతో ప్రేమ చూపించామన్నారు. కాంగ్రెస్‌కు గతంలోనూ ఇలా జరిగిందని, ఆ తర్వాత మళ్లీ పుంజుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో బలమైన ప్రతిపక్షం అవసరమని పేర్కొన్నారు.
బీజేపీ ఆహ్వానం..
కాంగ్రెస్ తనను తానే నాశనం చేసుకుంటోందని ఆజాద్ అన్నదాంట్లో తప్పేంలేదని బీజేపీ నేత కుల్‌దీప్ బిష్ణోయ్ అన్నారు. ఆయనను కమలం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఆదేశిస్తే తానే ఆజాద్‌తో సంప్రదింపులు జరిపి తీసుకొస్తానని చెప్పుకొచ్చారు.
చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్
Comments
Please login to add a commentAdd a comment