
తిరుపతి గాంధీ రోడ్డు: అధికారంలో ఉండగా విజయవాడలో 40 ఆలయాలకు పైగా కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మత రాజకీయాలు నెరిపే చంద్రబాబు నిద్రలేచినప్పుడల్లా నేను హిందువునని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తుంటారని ఎద్దేవా చేశారు. ఆలయాల కూల్చివేతపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని నిర్మిస్తానని నమ్మబలికి విస్మరించారని దుయ్యబట్టారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి సొంత జిల్లాను అభివృద్ధి చేయలేని అసమర్థుడని, అందుకే ఇక్కడి ప్రజలకు మొహం చాటేస్తున్నారన్నారు.
తిరుపతిలో జరగబోయే పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తామని చెప్పారు. బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు రైతులతో ఆందోళనలు చేయిస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి సాగు బిల్లులపై అవగాహన కల్పిస్తామన్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు పోటీపడి రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ కావాల్సి వస్తే ఏపీలో రెండు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు, డొమెస్టిక్ కార్గో నడిపేలా నెల రోజుల్లోనే చర్యలు చేపడుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment