సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభిస్తామంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి..కాళేశ్వరంకన్నా పెద్దదైన ఈ ప్రాజెక్టు పాలమూరు ప్రజల కరువు తీరుస్తుంది. కానీ కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేస్తున్నాయి.. మనకు పనోళ్లు కావాలా, పగోళ్లు కావాలా ప్రజలు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో నోబెల్స్..గోబెల్స్‌కు మధ్యే పోటీ. మరింత అభివృద్ధి కోసం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రజలు ఇప్ప టికే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని నిర్ణయించుకున్నా రు’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలను ఆయన ప్రారంభించారు. మమత మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వర రావు జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఖమ్మంరూరల్ మండలం మద్దులపల్లిలో రూ.25 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు గవర్నర్ ఆమోదం పొందిందన్నారు. ఇన్ని రోజులు పెండింగ్‌లో పెట్టినా బిల్లును ఆమోదించడం.. ధర్మమే గెలుస్తుందనడానికి నిదర్శనమని తెలిపారు.
లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఆకలైనప్పుడు అన్నం పెట్టకపోగా, ఇప్పుడు గోరుముద్దలు తినిపిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా ప్రజల కరుణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్‌పై ఉండాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నాయని, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే కేసీఆర్‌ను దీవించాలన్నారు.
మమత కళాశాల సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ నిరుపేదలకు వైద్యం అందించేలా 25 ఏళ్ల క్రితం కాలేజీని స్థాపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment