
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీకి రికార్ఢు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. దీంతో, టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఆసక్తికరంగా మారింది.
అయితే, ఏపీలో పొత్తులు లేకపోయినా పోటీకి సై అంటూ బీజేపీ అభ్యర్థులు వేలాదిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇప్పటి వరకు 3283 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క గుంటూరు జిల్లా నుంచే దాదాపు 125కుపైగా దరఖాస్తులు రావడం విశేషం. ఇక, 25 లోక్‌సభ స్థానాలకుగానూ 1861 దరఖాస్తులు అందాయి.
పార్లమెంట్ స్థానాలపై ఫోకస్..
మరోవైపు.. నేడు శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగనుంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు, ప్రతీ లోక్‌సభ స్థానానికి మూడు పేర్ల చొప్పున అభ్యర్థుల జాబితాను ఎంపిక చేసి శివప్రకాష్ పార్టీ జాతీయ నాయకత్వానికి పంపనున్నారు. ప్రతీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో ఉన్న నేతలు నేడు జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. ప్రతీ పార్లమెంట్ స్థానంపై చర్చించడానికి ఒక గంట సమయం కేటాయించినట్టు సమాచారం.
పొత్తులపై నో కామెంట్స్..
మరోవైపు.. టీడీపీ, జనసేన ఏకపక్ష ప్రకటనలపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇటీవల జరిగిన కోర్ కమిటీ సమావేశాల్లో మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తేనే బీజేపీకి ఓటు షేర్ పెరుగుతుందని నేతలు చెబుతున్నారు. ఇక, ఏపీ చీఫ్ పురంధేశ్వరిపైన స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలపై అసంతృప్తులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో, పొత్తుల అంశంపై ఎవరూ మాట్లాడవద్దని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం అధికార వైఎస్సార్‌సీపీ సహా ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ-జనసేన కూటమి తొలి అభ్యర్థుల జాబితా నేపథ్యంలో టికెట్ దక్కనివారు చంద్రబాబు, పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల నిరసనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment