సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటిపై వాలితే కాల్చిపడేస్తామని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ నీడను కూడా భరించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ను నమ్మి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు మోసపోయిందని, తమ గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ టీఆర్‌ఎస్‌ను నమ్మేది లేదని వ్యాఖ్యానించారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌లతో కలిసి ఆదివారం గాంధీభవన్‌లో విలేకరులతో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఎన్నటికీ కలవబోవని చెప్పారు. కేంద్రం అవినీతి చిట్టా తన వద్ద ఉందంటున్న కేసీఆర్.. ఆ సమాచారాన్ని ఎందుకు బయటపెట్టట్లేదని ప్రశ్నించారు. అవినీతి చేయడం ఎంత నేరమో, దానికి సంబంధించిన సమాచారాన్ని తెలిసి మరీ దాచడం అంతే నేరమన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ తోడుదొంగలని, దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఈ రెండు పార్టీలు అవినీతికి పాల్పడుతూ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
అస్సాం సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించలేదేం?
రాహుల్‌గాంధీని ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోని మాతృమూర్తులందరినీ అవమానించేలా ఉన్నాయని రేవంత్ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై ప్రధాని మోదీతో సహా బీజేపీ అధ్యక్షుడు నడ్డా, రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించకపోవడం దారుణమన్నారు. దేశ సంస్కృతికి మచ్చ తెచ్చేలా, జుగుప్సాకరంగా దిగజారి వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రంలోని 709 పోలీస్ స్టేషన్‌లలో సోమవారం ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీపీసీసీ నిర్ణయించిందని, జూబ్లీహిల్స్ పీఎస్‌లో తానే ఫిర్యాదు చేస్తానని రేవంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment