రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలల నుంచి రైతులకు ఉరిశిక్ష వేస్తోంది. పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు చనిపోతుంటే ప్రభుత్వం వారిలో ధైర్యాన్ని నింపలేకపోతోంది. మేము వెళ్లి కల్లాల వద్ద, రచ్చబండ పెట్టి ధైర్యం చెప్తామంటే వెళ్లనీయడం లేదు. ప్రభుత్వం వరి కొనుగోలు చేయకుంటే రైతులు సీఎం కేసీఆర్‌ను ఉరేస్తారన్న విషయాన్ని మర్చిపోవద్దు.
– టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్/అంబర్‌పేట/గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో టీపీసీసీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘రైతులతో రచ్చబండ’ను పోలీసులు భగ్నం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను అన్నదాతలకు వివరించేందుకు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోగా ఆదివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సోమవారం ఉదయం టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్‌రెడ్డి సహా నియోజకవర్గ, జిల్లా, మండల స్థాయి నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. హైదరాబాద్‌లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో పలుమార్లు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
అయినప్పటికీ పోలీసులు వెళ్లకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎర్రవెల్లి వెళ్లేందుకు రేవంత్‌రెడ్డి ప్రయ త్నించారు. ఇంట్లోంచి బయటకు వచ్చి తన కారు ఎ క్కేందుకు సిద్ధమవగా అడ్డుకున్న పోలీసులు ఆయ న్ను అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో తరలించేందుకు యత్నించారు. కార్యకర్తలు నినాదాలు చేస్తూ పోలీసు వాహనంపై ఎక్కి అడ్డుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వా దం చోటుచేసుకుంది. అరగంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ తోపులాటలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి స్వల్ప గాయాలయ్యాయి. చివరకు రేవంత్‌ను పోలీసులు అంబర్‌పేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుస్టేషన్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతోపాటు రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు సో మవారం సాయంత్రం రేవంత్‌ను విడుదల చేశారు.
ఎర్రవల్లి అష్టదిగ్బంధం...
రచ్చబండకు అనుమతిలేదంటూ సిద్దిపేట సీపీ శ్వేత ఆదేశాల మేరకు డీసీపీ మహేందర్, ఏసీపీలు మడత రమేశ్, గురువారెడ్డిల అధ్వర్యంలో సోమ వారం తెల్లవారుజాము నుంచి వందలాది పోలీసు లు ఎర్రవల్లి గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేశారు. 16 మంది సీఐలు, 25 మందికిపైగా ఎస్‌ఐలు, వివిధ స్థాయిల పోలీసులు గ్రామానికి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను నిలువరించేందుకు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కేవలం సరైన గుర్తింపు కార్డులు చూపిన ఎర్రవల్లి గ్రామస్తులనే గ్రామంలోకి అనుమతించారు. మీడియాపైనా ఆంక్షలు విధించారు. జిల్లా సరిహద్దు గ్రామాలు వంటిమామిడి, పీర్లపల్లిల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి అనుమానితులను నిలువరించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు: కాంగ్రెస్ నేతలు
రైతులతో రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధించడాన్ని పలువురు టీపీసీసీ నేతలు ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, టీఆర్‌ఎస్–బీజేపీలు కుమ్మక్కై ఆందో ళనలను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతించిన అధికార టీఆర్‌ఎస్... తమ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని ఎలా అడ్డుకుంటుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు వీహెచ్, మల్లురవి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment