చంద్రబాబు రాగానే మంచంపై పడుకొని మాట్లాడుతున్న పట్టాభి
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై దాడి అంటూ మంగళవారం సాగిన హైడ్రామా వెనుక రాజకీయ కోణాలున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రజాదరణ కోల్పోవడం, పంచాయతీ ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణుల్లో నైరాశ్యంతో ఎల్లో మీడియా, సోషల్ మీడియాను నమ్ముకుని చంద్రబాబు ఈ డ్రామాకు తెరతీసినట్లు స్పష్టమవుతోంది.
రెచ్చగొట్టే వ్యాఖ్యలతో..
పట్టాభిరామ్ మంగళవారం ఉదయం 10.30 సమయంలో విజయవాడ గురునానక్‌నగర్ అంబేడ్కర్ కాలనీలోని తన నివాసం నుంచి కార్యాలయానికి బయలుదేరుతుండగా కొందరు కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనలో కారు ధ్వంసం కాగా పట్టాభికి స్వల్ప గాయాలయ్యాయి. గతేడాది అక్టోబర్‌లో కూడా ఆయన వాహనంపై ఇదే తరహా ఘటన జరగడం గమనార్హం. కాగా పట్టాభి వ్యవహార శైలిపై పలు సందేహాలున్నాయి. మోకాలు, మోచేతిపై గీరుకున్నట్లుగా స్వల్ప గాయాలుండటం, నిజంగానే రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేస్తే వెంటనే లేచి నడవడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
బాబు రాక.. పట్టాభి అభినయం
ఘటన అనంతరం నిలుచునే పలు చానళ్లతో మాట్లాడిన పట్టాభి.. తమ ఇంటికి పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నట్లు తెలియగానే లేవలేనట్లుగా పడుకుని సీన్‌ను రక్తి కట్టించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి సీఎం సమాధానం చెప్పాలని పట్టాభి నివాసం వద్ద చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎంతమందిని చంపుతారు? నన్ను కూడా చంపండంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో కలసి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమవ్వడంతో పోలీసులు అడ్డుకున్నారు. వినతిపత్రం ఇచ్చే సాకుతో సీఎం ఇంటిని ముట్టడించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు నిర్దేశించినట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
అనంతరం పట్టాభిని పోలీస్ వాహనంలో ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే దీనిపై డీసీపీ హర్షవర్ధన్‌రాజు నేతృత్వంలో సెంట్రల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ఆగంతకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ లభ్యమైన కర్రపై నిందితుల వేలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు. పట్టాభిని చికిత్సకు తరలిస్తుండగా అడ్డుకున్న 13 మందిపై పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ రావి సురేష్‌రెడ్డి తెలిపారు. కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, దేవినేని చందు, బుద్దా వెంకన్న, పళ్లు శివ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు తదితరులను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
ఆది నుంచి వివాదాలే..
విజయవాడలో ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేసిన పట్టాభి టీడీపీ అండతో హోటల్స్ అసోసియేషన్ కార్యదర్శి పదవి చేపట్టారు. 2014 ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లి హడావుడి చేయడంతో వార్తలకెక్కారు. ప్రతి అంశాన్ని వివాదం చేసి గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తారని టీడీపీ నేతలే ఆయన గురించి వ్యాఖ్యానిస్తుంటారు.
రాజకీయంగా ఎదుర్కోలేకే..
రాజకీయంగా వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేక బాబు దొడ్డిదారి వ్యూహాలతోపాటు ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారాన్ని ఆశ్రయించినట్లు స్పష్టమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉదంతమే నిదర్శనం. అచ్చెన్న తన స్వగ్రామంలో రాజకీయ ప్రత్యర్థిని నామినేషన్ దాఖలు చేయనివ్వకుండా స్వయంగా బెదిరించి పార్టీ శ్రేణులను దాడులకు పురిగొల్పడం తెలిసిందే. పోలీసులు అచ్చెన్నను అరెస్టు చేయడంతో నిమ్మాడలో ఆయన దురాగతాలు బహిర్గతమవుతున్నాయి. దీన్ని కప్పిపుచ్చేందుకే పట్టాభిపై దాడి జరిగిందంటూ ఆందోళనకు స్కెచ్ వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నకిలీ కిడ్నాప్‌లు..
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవడాన్ని టీడీపీ పరివారం రాజకీయం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఒత్తిడితో పలుచోట్ల టీడీపీ బలపరిచిన నేతలు తమకు తాము కిడ్నాప్ అయినట్లు ప్రకటించుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసరెడ్డి కూడా అలాగే కనిపించకుండా పోయి కిడ్నాప్ అయినట్లు చెప్పడం, అది పోలీసులకు తెలిసిపోవడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
చంద్రబాబు దాన్ని ప్రభుత్వ హత్యగా దుష్ప్రచారం చేయడం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ స్వయంగా వెళ్లి టీడీపీ స్వరానికి తగ్గట్టు మాట్లాడడం, లోకేష్ పరామర్శించడం లాంటివన్నీ రాజకీయ ఎత్తుగడలకు నిదర్శనాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి తిరుపతిరావు తాను కిడ్నాప్ కాలేదని మీడియా ఎదుటే చెప్పినా టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు ఒత్తిడితో మళ్లీ కేసు పెట్టాడు. ఇవన్నీ టీడీపీ అధినేత పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారాలని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది క్రితం దళితులపై దాడులంటూ హంగామా సృష్టించగా, కొద్దిరోజుల క్రితం దేవాలయాలపై దాడులంటూ టీడీపీ నాయకులతో దాడులు చేయించి రభసకు దిగినట్లు పలు విచారణల్లో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment