జనసేనకు ఘోర పరాభవం.. అన్నిచోట్లా డిపాజిట్లు గల్లంతు | JANA SENA CANDIDATES LOSE DEPOSITS IN ALL 8 CONSTITUENCIES | Sakshi
Sakshi News home page

జనసేనకు ఘోర పరాభవం.. అన్నిచోట్లా డిపాజిట్లు గల్లంతు

Published Mon, Dec 4 2023 5:51 AM | Last Updated on Mon, Dec 4 2023 4:21 PM

JANA SENA CANDIDATES LOSE DEPOSITS IN ALL 8 CONSTITUENCIES - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో పోటీచేసినా ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా ఓడిపోయారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయారు. మొత్తంగా కలిపి కొన్ని వేల ఓట్లు మాత్రమే సాధించగలిగారు. తమ పార్టీకి పట్టు ఉండడంతో పాటు, గెలిచే అవకాశాలున్న స్థానాలను కూడా జనసేన డిమాండ్‌ చేసి తీసుకుందని సీట్ల సర్దుబాటు సమయంలోనే ఆయా స్థానాల్లోని బీజేపీ నాయకులు విమర్శించారు.

ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో సహకరించే పరిస్థితి లేదంటూ కూడా కొందరు స్థానిక నాయకులు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. జనసేన తరఫున కూకట్‌పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, తాండూరులో నేమూరి శంకర్‌గౌడ్, కోదాడ నుంచి మేకల సతీశ్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో లక్ష్మణ్‌గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెంలో లక్కినేని సురేందర్‌రావు, వైరాలో డాక్టర్‌ తేజావత్‌ సంపత్‌నాయక్, అశ్వారావుపేట నుంచి ముయబోయిన ఉమాదేవి పోటీచేశారు.

కూకట్‌పల్లిలో ప్రేమ్‌కుమార్‌కు అత్యధికంగా 39,830 ఓట్లు రాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ పోటీచేసిన తాండూరులో మూడువేలకు పైగా మాత్రమే వచ్చాయి. కోదాడలో 1,200 ఓట్లు, నాగర్‌కర్నూల్‌లో 1,800 ఓట్లు, ఖమ్మంలో 1,500 ఓట్లు, కొత్తగూడెంలో 1,800, వైరాలో 2,600, అశ్వారావుపేటలో 2,200 ఓట్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. తెలంగాణలో అంతగా పట్టు, గుర్తింపు లేని జనసేనకు ఎనిమిది సీట్లు కేటాయించడం వల్ల తమకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు.

జనసేన రాష్ట్రంలో రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీ కాకపోవడంతో ఎన్నికల్లో పోటీకి ‘కామన్స్ సింబల్‌’దక్కలేదు. ఆ పార్టీకి గతంలో కేటాయించిన గాజు గ్లాస్‌ సింబల్‌కూడాను ఈసీ కేటాయించకపోవడంతో, అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగానే బరిలో నిలిచారు. జనసేనకు కేటాయించిన ఎనిమిది సీట్లలో తమ పార్టీ నేతలు పోటీచేసి ఉంటే కనీసం రెండు, మూడు అయినా గెలిచే అవకాశాలుండేవని బీజేపీ నాయకులు వాపోతున్నారు. కూకట్‌పల్లి, తాండూరు, తదితర సీట్లు జనసేనకు కేటాయించడం పట్ల ఆయా చోట్ల బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇంత చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement