సాక్షి, వరంగల్: బీఆర్‌ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవహారం సర్పంచ్ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఎమ్మెల్యే రాజయ్యపై ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాటికొండ రాజయ్య ఓ మహిళా ప్రజాప్రతినిధి ద్వారా డబ్బు ఆశచూపి భర్తను ట్రాప్ చేసి తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆరోపణలు నిజం కాదని, ఎమ్మెల్యేతో రాజీ కుదిరినట్లు బాండ్ పేపర్‌పై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
వేధింపుల విషయంలో మూడు నెలల క్రితం సర్పంచ్ నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో గ్రామాభివృద్ధికి 20 లక్షలు ఇస్తానని రాజయ్య చెప్పారని సర్పంచ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు గతంలో అప్పు కింద రూ. 20 లక్షలు తీసుకుంటున్నట్లు బాండ్ పేపర్‌పై సంతకం పెట్టాలని భర్త ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యే వద్ద డబ్బులు తీసుకున్నాననేది అవాస్తమని చెప్పారు.
ఈ మేరకు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తానంటున్నారు సర్పంచ్ నవ్య. తనకు, తన భర్తకు మధ్య ఎమ్మెల్యే రాజయ్య చిచ్చు పెడుతున్నాడని తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్య వల్ల తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని అన్నారు. తమకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణమని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతానని చెప్పారు.
చదవండి: బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిన అవసరం ఉంది: జూపల్లి
కాగా నవ్య ఆరోపణలపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే రాజయ్య నిరాకరించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్యను సర్పంచ్ నవ్య ఆరోపణపై నో కామెంట్ అంటూ వెళ్ళిపోయారు. నవ్య భర్త ప్రవీణ్ మాత్రం గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే ఇస్తానన్న ఫండ్స్ ఇవ్వకపోగా తమకు 25 లక్షలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. తమ పేరిట గ్రామ పెద్ద మనిషి రూ. 5 లక్షలు తీసుకోవడంతోనే ఈ గొడవ మొదలైందని చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమకు నవ్య సంతకం పెడితే పది లక్షలు వస్తాయని భార్యకు చెప్పడంతో తాను ఎమ్మెల్యే, వారి అనుచరులతో కుమ్మక్కైనట్లు ఆరోపిస్తుందని తెలిపారు. అసత్య ప్రచారమే తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment