
సాక్షి, విశాఖపట్నం: వలంటీర్లపై కత్తి కట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి వలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చారు. ఇటీవల ఆయన మహిళల కిడ్నాప్‌లకు సహకరించే సంఘ విద్రోహశక్తులంటూ అభివర్ణించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు ఆగ్రహోదగ్రులయ్యారు. రోడ్లెక్కి నిరసన తెలియజేశారు. పవన్ దిష్టి»ొమ్మలను దహనం చేసి ఆయన వైఖరిని దుమ్మెత్తి పోశారు. ఊహించని ఈ పరిణామానికి దిగివచ్చిన పవన్.. తాను వలంటీర్లందరినీ అలా అనలేదని, కొందరిని ఉద్దేశించే అలా అన్నానని ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు.
పవన్ గత వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారకముందే తాజాగా మరోసారి వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత నెలలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్‌లో బంగారం కోసం ఓ వృద్ధురాలిని వెంకటేష్ అనే వ్యక్తి హత్య చేశాడు. గతంలో ఇతను వలంటీర్‌గా పని చేస్తున్నప్పుడు ఫిర్యాదులు రావడంతో అధికారులు తొలగించారు. ఇది వృద్ధురాలి హత్యకు ముందే జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న పవన్ శనివారం వరలక్ష్మి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అంతటితో ఆగకుండా అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్నాల కోసం నియమించిన వలంటరీ వ్యవస్థ ఈ రోజు ప్రజల ప్రాణాలు తీస్తోంది. వీరు అసాంఘిక శక్తుల్లా మారి నేరాలకు తెగబడుతున్నారు. పోలీస్ వెరిఫికేషన్ లేకుండా వలంటీరు ఉద్యోగాలిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
జనసేన అద్భుతాలు చేయదు..
జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తుందని తాను చెప్పడం లేదని, వ్యవస్థలను బలోపేతం చేసి, శాంతిభద్రతలను కాపాడతామని పవన్ చెప్పారు. విశాఖ ఎంపీ కుటుంబాన్ని రౌడీషీటర్లు కిడ్నాప్ చేస్తే.. అదే ఎంపీ వారినే వెనకేసుకొస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తానన్నారు.