
పవన్ నీకు దమ్ముంటే కాపులపై కాదు.. ఇతర కులాలపై పోటీచెయ్యి
కులాల మధ్య చిచ్చు పెట్టేవార్తలు రాస్తున్న ‘ఈనాడు’పై చట్టపరమైన చర్యలు
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు
సాక్షి, అమరావతి : చంద్రబాబు హయాంలో కాపుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విమర్శించారు. బుధవారం తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జీవోల్లో కేటాయింపులు తప్ప కాపుల అభ్యున్నతికి వాస్తవంగా ఖర్చు చేసింది శూన్యమన్నారు. అప్పటి ప్రభుత్వాన్ని నమ్ముకుని విదేశీ విద్యకు వెళ్లిన ఎందరో పేదింటి కాపు విద్యార్థులు నిధులు విడుదల చేయకపోవడంతో అప్పులపాలయ్యారని గుర్తు చేశారు. కాపు భవనాల నిర్మాణాలంటూ ఎల్లో మీడియాలో ఊదరగొట్టడం తప్ప ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ వచ్చాక కాపుల సంక్షేమానికి ఏకంగా రూ.39,317.80 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.
అయినా, ఈనాడు పత్రిక మాత్రం కాపులను తప్పుదారి పట్టేంచేలా అసత్య కథనాలు ప్రచురిస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు తొత్తుగా మారిన పవన్ ఏకంగా కాపులను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ కాపు ఎమ్మెల్యేలు బలంగా ఉన్నచోట మాత్రమే పవన్‌ను ఉపయోగిస్తున్నారని చెప్పారు. దమ్ముంటే పవన్.. కాపులపై కాకుండా ఇతర కులాలపై పోటీ చేయాలని సవాల్ చేశారు.
కాపులను రాజ్యాధికారం దిశగా తీసుకెళ్తారని నమ్మిన కాపునాయకులు, జేఏసీల ఆశలను పవన్ నట్టేట ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులంటే పవన్ ఒక్కడేనా? ఇతర కాపులు రాజకీయ పదవులు చేయకూడదా? అంటూ నిలదీశారు. భీమవరంలో జనసేన పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వట్లేదని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. 30 మంది కాపు, బలిజలను ఎమ్మెల్యేలను చేయడంతో పాటు మంత్రులను చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతోందన్నారు.
చంద్రబాబు మోసానికి, అరాచకత్వానికి నిర్వచనమని విశాఖలో భూకబ్జాలు, విజయవాడలో దేవస్థానం భూములను ఒక సామాజిక వర్గానికి దోచిపెట్టారని దుయ్యబట్టారు. రంగా నుంచి ముద్రగడ పద్మనాభం వరకు, తాజాగా జనసేన కార్యకర్తలు సైతం చంద్రబాబు కుట్రలకు బలైపోయారని.. అందుకే కాపులంతా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారన్నారు. కాపులకు కొమ్ముకాస్తున్న సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తూ, కులాల్లో చిచ్చుపెట్టేలా వార్తలు ప్రచురిస్తున్న ఈనాడుపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.