అభ్యర్థుల ఆస్తులపైనా కన్ను! | Keep an eye on the assets of the candidates | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ఆస్తులపైనా కన్ను!

Published Sun, May 12 2024 5:26 AM | Last Updated on Wed, May 15 2024 11:58 AM

Keep an eye on the assets of the candidates

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లిలో మైనింగ్‌పై కన్నేసి.. ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఆస్తులపైనా కన్నేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులకు నిధుల కొరత ఉందంటూ.. వారికి నిధుల సమీకరణ పేరుతో వారి ఆస్తులను తాకట్టు పెట్టుకునేందుకు సీఎం రమేశ్‌ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. 

ఎమ్మెల్యే అభ్యర్థులు తమ వంతు వాటా నిధులను తన టీమ్‌ సభ్యులకు చూపించాకే ఆయన తన వాటా నిధులను విడుదల చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తమ వద్ద నిధులు లేవంటే.. వారి ఆస్తి పత్రాలు తీసుకుని అప్పులిప్పిస్తున్నట్టు చెబుతున్నారు. అది కూడా అధిక వడ్డీకి తన సన్నిహితుల వద్ద నుంచే సీఎం రమేశ్‌ అప్పులిప్పుస్తుండటం అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

 ఇప్పటికే ఫోర్జరీ వ్యవహారంలో ఆయనపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారం తెలిసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ తాజా పరిణామాలతో భయాందోళనకు గురవుతున్నారు. అధిక వడ్డీకి తీసుకున్న ఈ మొత్తాలను సకాలంలో చెల్లించలేదన్న సాకుతో తమ ఆస్తులను తీసేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని కూటమి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.  

ఆస్తుల చిట్టాతో భయపెడుతున్న వైనం 
వాస్తవానికి కొందరు తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థులు ఎంపీ కోటా నుంచి వచ్చిన నిధు­లతోనే ఎన్నికలు కానిచ్చేదామను­కున్నారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.13 కోట్ల మేర సీఎం రమేశ్‌ నిధులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఈ నిధులు సరిపోతాయని.. తమ వంతు వాటా నిధులు అవసరం లేదని ఎమ్మెల్యే అభ్యర్థులు భావించారు. అయితే, మీ వాటా నిధులు ఎక్కడున్నాయో చెప్పాలని.. తన టీమ్‌ పరిశీలిస్తుందని ఎమ్మెల్యే అభ్య­ర్థులను సీఎం రమేశ్‌ డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. 

మీ వంతుగా మీ వద్ద రూ.10 కోట్ల మేర ఉన్నా­యని తన టీమ్‌ నిర్ధారించాకే తన కోటా రూ.13 కోట్లు విడుదల చేస్తానని ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో చోడవరం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి తన వద్ద నిధులు లేవని.. తనకు పెద్దగా ఆస్తులు కూడా లేవని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో సదరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తుల మొత్తం వివరాలను డాక్యుమెంట్స్‌తో సహా సీఎం రమేశ్‌ ఆయన ముందు ఉంచడంతో విస్తుపోవడం ఆ అభ్యర్థి వంతైందని చెబుతున్నారు. 

ఇందులో కొన్ని ఆస్తులను తాను అమ్మివేశానని.. ప్లాట్లుగా విభజించి విక్రయించినట్టు ఆ అభ్యర్థి చెప్పడంతో తాజా ఎన్‌కంబరెన్స్‌ సరి్టఫికెట్‌ (ఈసీ)­ని కూడా సీఎం రమేశ్‌ ఆయనకు చూపించినట్టు తెలుస్తోంది. ఇంతగా తమ ఆస్తులు, వాటి పత్రాలను కూడా ఆయన సేకరించడం పట్ల అభ్యర్థులు ఒకింత ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.

అధిక వడ్డీకి తాకట్టు.. 
అనకాపల్లి ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు చెందిన ఆస్తి పత్రాలన్నింటినీ సీఎం రమేశ్‌ సేకరించినట్టు చెబుతున్నారు. తమ వద్ద నిధులు లేవన్న అభ్యర్థులకు.. ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులిప్పించే ఏర్పాట్లను కూడా ఆయన చూసుకుంటున్నారు. ‘నీ ఆస్తి పత్రాలను తీసుకెళ్లి.. వైజాగ్‌లో ఫలానా వారిని కలిసి వడ్డీకి నిధులు తీసుకో’ అని వారిని ఆదేశిస్తున్నట్టు సమాచారం. తమ ఆస్తుల చిట్టాను సేకరించి.. వాటిని ఎక్కడ తాకట్టు పెట్టాలో కూడా సీఎం రమేశ్‌ చెబుతుండటంతో అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

తమ ఆస్తుల చిట్టాను ఎందుకు సేకరించారు? వాటిని తీసుకెళ్లి ఫలానా వారి వద్దనే తాకట్టు పెట్టా­లని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని అభ్య­ర్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్న వారంతా సీఎం రమేశ్‌కు చెందినవారే కావడంతో వీరి అనుమానాలు రెట్టింపవుతున్నాయి. ఎన్నికల తర్వాత తమ ఆస్తులు తమకు దక్కుతాయా?

 ఈ అప్పు పేరుతో తీసుకున్న పత్రా­లను తీసుకెళ్లి సొంతం చేసుకుంటారా అనే భయాందోళనకు గురవుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ఆస్తుల చిట్టాను మొత్తం విప్పుతుండటంతో అభ్యర్థుల్లో ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా నెలకొందని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement