లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటం పార్టీకి పెద్ద సమస్యగా పరిణమించింది. సీఎంను జైలుకు పంపడాన్ని నిరసిస్తూ పార్టీ చేపడుతున్న నిరసన ప్రదర్శనలకు కొందరు పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పార్టీలోని మొత్తం 10 మంది ఎంపీల్లో ముగ్గురు పార్టీ కోసం తమ గొంతు వినిపిస్తుండగా, ఏడుగురు ఎంపీలు ఏమయ్యారో ఎవరికీ తెలియడం లేదు. కాగా ఆప్‌కి చెందిన ఏకైక లోక్‌సభ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరారు. ఈ విషయమై ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన పార్టీ నేత సంజయ్‌సింగ్‌ను ప్రశ్నించగా, ఈ అంశాన్ని పార్టీ పరిశీలిస్తుందని చెప్పారు. ఇతనితోపాటు ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్, ఎన్‌డీ గుప్తా నిరసన ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే పార్టీలో ఇంత జరుగుతున్నా ముఖం చాటేస్తున్న కొందరు కీలక నేతలున్నారు.
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా
పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా గత నెలలో కంటి ఆపరేషన్ కోసం లండన్ వెళ్లారు. ఆయన మార్చి చివరిలో తిరిగి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ లండన్‌లోనే ఉన్నారని సమాచారం. మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.
స్వాతి మలివాల్
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన సోదరి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెకు అండగా ఉండేందుకు అక్కడే కొన్నాళ్లు ఉండాల్సివస్తున్నదని స్వాతి మలివాల్ తెలిపారు. మలివాల్ ఆప్ పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
హర్భజన్ సింగ్
క్రికెటర్ హర్భజన్ సింగ్ పంజాబ్ ఆప్ ఎంపీ అయినప్పటి పార్టీ కార్యకలాపాల్లో అప్పుడప్పుడు పాల్గొంటున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై కూడా హర్బజన్ స్పందించలేదు. ఆప్ నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారా? అని మీడియా ప్రశ్నించగా అందుకు సమాధానం చెప్పేందుకు హర్బజన్ నిరాకరించారు.
అశోక్ కుమార్ మిట్టల్
పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, ఆప్ ఎంపీ అయిన మిట్టల్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ నిరసనల గురించి మాట్లాడే అధికారం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. ఏం చేయాలో పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, ఇటీవల పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు.
సంజీవ్ అరోరా
పంజాబ్‌కు చెందిన మరో ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మార్చి 24న కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. అయితే, రాంలీలా మైదాన్‌లో జరిగిన నిరసనల్లో ఆయన పాల్గొనలేదు. లూథియానాలో పార్టీ అసైన్‌మెంట్‌తో బిజీగా ఉన్నందున నిరసనలకు హాజరు కాలేకపోయానని అరోరా తెలిపారు.
బల్వీర్ సింగ్
పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ బల్వీర్ సింగ్ కూడా పార్టీ నిరసన ప్రదర్శనల్లో కనిపించలేదు. ఆయనను గైర్హాజరు గురించి ప్రశ్నించగా తాను తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని, పార్టీ ఆదేశిస్తే నిరసనల్లో పాల్గొంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment