పార్టీ కార్యకర్తలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ధర్మ యుద్ధానికి (లోక్‌సభ ఎన్నికలకు) పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని కేంద్రమంత్రి బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అందరూ కష్టపడి పనిచేసి ధర్మం, న్యాయం కోసం కృషిచేస్తున్న మోదీని మరోసారి ప్రధానిని చేయాలని కోరారు. మంగళవారం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ముఠా వందరోజుల్లో రాష్ట్రంలోని బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పరిశ్రమలు, కాంట్రాక్టర్ల దగ్గర రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. ‘మన అందరి ఎజెండా ఒకటే..ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలి. గత పదేళ్లలో మోదీ సర్కార్ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.
12 సీట్లు గెలుస్తాం : డీకే అరుణ
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ...‘ఆరు నూరైనా.. తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాం, కాషాయ జెండా ఎగరేస్తాం. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఈసారి మోదీకే ఓటని ప్రజలు చెప్తున్నారు. కాంగ్రెస్ అరుగ్యారంటీలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. తెలంగాణలో 17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతాడా..? రాహుల్‌ను ప్రధాని అభ్యరి్థగా ఇండియా కూటమే ఒప్పుకోవడం లేదు. రాష్ట్రంలోకాంగ్రెస్ మోసపూరిత పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారు’ అని అన్నారు. బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘రాబోయే 40 రోజులు పోలింగ్‌బూత్‌లకే కార్యకర్తలు పరిమితమై పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎంఐఎంలను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది. గ్యారంటీల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారు’ అని అన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ...‘మేము రాముని పేరు చెప్పి బరాబర్ ఓట్లు అడుగుతాం. మీకు దమ్ముంటే బాబర్ పేరు చెప్పి ఓట్లు అడగండి’ అని సవాల్ విసిరారు. ‘అసలు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు? ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు చుక్కలు చూపెడతారు. ఒకట్రెండు హామీలు నెరవేర్చి ఎన్నికల కోడ్ వస్తే కాలం గడపొచ్చని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది’ అని అన్నారు. నిజామాబాద్ ఎంపీ అరి్వంద్ ధర్మపురి మాట్లాడుతూ...‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా మోదీకే ఓటేస్తామని జనం అంటున్నారు. వచ్చే నెల, నెలన్నర రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ అత్యధిక సీట్లలో గెలిచేలా కృషిచేయాలి’ అని చెప్పారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అప్పులకుప్పగా మారిస్తే, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment