రాజకీయాలలో ఒక్క పదం చాలు మొత్తం వాతావరణాన్ని మార్చడానికి. తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఆసరాగా చేసుకుని అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలు, నేతలు తీవ్ర అలజడి సృష్టించడానికి యత్నించారు. వారికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు కూడా కొన్ని ఆందోళనలకు దిగినా, మొత్తం మీద బీఆర్ఎస్‌దే పై చేయి అయినట్లు అనిపిస్తుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు పోటాపోటీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనన్న భావన ఏర్పడిన తరుణంలో రేవంత్ ఉచిత విద్యుత్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్య ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది.
అదే టైమ్‌లో కాంగ్రెస్‌లోని ఇతర వర్గాలు ఆ పాయింట్ ఆధారంగా ఆయనను ఇరుకున పెట్టడానికి సహజంగానే యత్నిస్తాయి. తెలంగాణ మంత్రి కేటిఆర్ అయితే పవర్ పుల్ పంచ్ డైలాగు వాడారు. రేవంత్ వీటన్నిటికి సమాధానం ఇస్తూ ట్వీట్ చేసినా జరగవలసిన నష్టం కొంతమేర జరిగిపోయింది. అమెరికాలో జరిగిన తానా సభలో ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో ఇరవై నాలుగు గంటలపాటు వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వనవసరం లేదని, ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్‌ల వ్యవహారం ఉందని ఆరోపించారు.
తెలంగాణలో 95 శాతం మంది మూడు ఎకరాలలోపు వారేనని, ఎకరానికి నీరు ఇవ్వడానికి గంట సమయం పడుతుందని, ఆ లెక్కన మూడు గంటల సమయం కరెంటు ఇస్తే చాలని, మొత్తం మీద ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు నాలుగునెలల ముందు ఇలాంటి వ్యాఖ్య చేయడంతో బీఆర్ఎస్ వెంటనే రంగంలో దూకి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఉండదని, మూడు గంటలే విద్యుత్ సరఫరా అన్న రేవంత్‌ను ఉరికించాలని అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.
కేటిఆర్ స్పందిస్తూ మూడు పంటలు పండించే బీఆర్ఎస్ కావాలా? మూడు గంటలే కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా ? అని సవాల్ విసిరారు. దీనిపై కాంగ్రెస్‌లో కూడా అలజడి ఏర్పడింది. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యం ఠాకూర్ మొదలు సీఎల్పి నేత భట్టి విక్రమార్క, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు రకరకాలుగా స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్య ఒకరకంగా రేవంత్‌ను ఇబ్బంది పెట్టేదే. రేవంత్‌కు అండగా ఉన్నట్లు కనిపిస్తూనే, వ్యంగ్యంగా మాట్లాడారు. ఇండియాలో ఉన్నంతవరకు బాగానే ఉన్నారని, అమెరికాలో తానా సభలో నటుడు బాలకృష్ణ, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావులను కలిసిన తర్వాత రేవంత్ ఇలా మాట్లాడారేమోనని అన్నారు.
చదవండి: పవన్ ఇంతకీ ఏం సాధించినట్లు?.. పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదేనేమో!
ప్రత్యేకించి బాలకృష్ణ తిక్క ఈయనకు అంటిందేమో అన్నట్లు వెంకటరెడ్డి చమత్కరించారు. రేవంత్‌లో తెలుగుదేశం వాసనలు పోలేదని పరోక్షంగా ఆయన చెప్పారన్నమాట. అదే టైమ్‌లో అసలు తెలంగాణలో రైతులకు ఎక్కడ 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని ప్రశ్నించారు. అలా ఇస్తున్నట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
ఉచిత విద్యుత్ అన్నది కాంగ్రెస్ పేటెంట్ అని, 24 గంటల కరెంటు ఇస్తామని భట్టి పేర్కొన్నారు. వరంగల్ వచ్చి ప్రత్యేకంగా సభ పెట్టి రైతుల డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్‌కు ఇది ఊహించని పరిణామమే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీతో ప్రకటింప చేశారు. కాని అప్పుడు అది ఎలా సాధ్యమో కాంగ్రెస్ నేతలెవరూ వివరించలేదు.
రేవంత్ ఆర్ధికవేత్త మాదిరి మాట్లాడి బోర్ల పడ్డారనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందని రేవంత్ చెప్పడం వల్ల పార్టీ ఇరుకున పడినట్లయింది. ఆయన చెప్పినదానిలో హేతుబద్దత ఉందా? లేదా? అన్నది వేరే చర్చ. కాని ఆయన డిఫెన్స్‌లో పడడం వల్లే, తన ప్రకటనను వక్రీకరించారని, బీఆర్ఎస్ మూడు చెరువుల నీళ్లు తాగడం ఖాయమని, మూడోసారి అధికారంలో రాలేదని ఆయన సమాధానం ఇచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తామని, రైతు బంధు కింద ఎకరాకు పదిహేనువేలు ఇస్తామని, తదితర అంశాలన్నిటిని ప్రస్తావించినా కీలకమైన ఉచిత విద్యుత్ విషయంలో అనవసర వివాదం సృష్టించుకున్నారు.
దీనిపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, రేవంత్ దిష్టి బొమ్మలు దహనం చేయడం వంటి వాటిలో రాజకీయం వేడెక్కింది. దీనికి పోటీగా కాంగ్రెస్ కూడా నిరసనలు చేపట్టినా, వాటికి అంత ప్రాధాన్యత లేకుండా పోయినట్లయింది. రాహుల్ గాంధీపై బీజేపీ కక్ష కట్టిందని నిరసిస్తూ తాము గాందీ భవన్‌లో నిరశన చేయబోతుండగా, దానిని చెడగొట్టడానికి బీఆర్ఎస్ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేసినా, అందులో పస కనిపించలేదు. ఇటీవలే రేవంత్ మరో సందర్భంలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సీఎం కావచ్చని అనడం కూడా విమర్శలకు దారి తీసింది.
కాంగ్రెస్‌లో టీడీపీ నేతల ఆధిపత్యం పెరిగిపోయిందన్న భావనను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌పై రాజకీయంగా దాడి పెంచవలసిన తరుణంలో రేవంత్ స్వయంకృతాపరాధంతో ఆత్మరక్షణలో పడ్డారు. వెంటనే కొందరు నేతలు అధిష్టానానికి దీనిపై ఫిర్యాదులు కూడా చేశారు. ఈ సందర్భంగా రేవంత్ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు శిష్యుడుగానే ఉన్నారన్న అభిప్రాయాన్ని ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ యత్నించింది. చంద్రబాబు వ్యవసాయం దండగ అని అంటే, రేవంత్ ఉచిత విద్యుత్ దండగ అని అంటున్నారని ఆరోపించింది.
2004 ఎన్నికల ముందు ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ నేతగా ప్రకటించారు. దానిపై అప్పట్లో కూడా పార్టీలో బిన్నాబిప్రాయాలు వచ్చాయి. సాధ్యాసాధ్యాలపై కూడా చర్చలు జరిగాయి.అయినా వైఎస్ వెనక్కి తగ్గలేదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని టీడీపీ నేతలతో అన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా కూడా తదనుగుణంగా కార్టూన్లు కూడా వేశాయి.
చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం
టీడీపీ 2004లో ఓడిపోవడానికి ఇది కూడా కారణం అయింది. చంద్రబాబు చేసిన ఒకటి, రెండు వ్యాఖ్యలు టీడీపీ కొంప ముంచాయి. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యల వల్ల అంత నష్టం జరుగుతుందా? లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. అయితే అసలే ప్రతిపక్షంలో ఉండి నానా తంటాలు పడుతున్న తరుణంలో రేవంత్ ఇలా మాట్లాడడం రాజకీయంగా తెలివైన పనికాదు. గతంలో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముల్కి నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు ముల్కికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ సందర్భంలో ఆయన ఇదే ఫైనల్ అన్న వ్యాఖ్య చేశారు. దానిపై ఆయనను వ్యతిరేకించే ఆంధ్ర కాంగ్రెస్ నేతలు కొందరు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి ఆజ్యం పోశారు.
చివరికి పివి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టవలసి వచ్చింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో వలంటీర్లను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయనను తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. వాటిని వెనక్కి తీసుకోలేక, సమర్దించుకోలేక సతమతమవుతున్నారు. ఇలా ఆయా నేతలు చేసిన పలుప్రకటనలను ఉదాహరణగా తీసుకోవచ్చు. మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి బీసీలా? వంకాయలా అని యాథాలాపంగా అన్నారు. అది ఆరోజుల్లో పెద్ద వివాదం అయింది. చంద్రబాబు నాయుడు ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించిన వైనం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది.
అలాగే మగపిల్లాడిని కంటానని కోడలు అంటే అత్త వద్దంటుందా అని మరో అభిప్రాయం చెప్పి మహిళల ఆగ్రహానికి ఆయన గురి అయ్యారు. అసెంబ్లీలో ఒకసారి చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ఒక కామెంట్‌పై టీడీపీ నానా రచ్చ చేసింది. తదుపరి వైఎస్ దానిని వెనక్కి తీసుకున్నారు. ఇవన్ని ఎందుకంటే రాజకీయాలలో అందులోను ఎన్నికల సమయంలో నేతలు చాలా వ్యూహాత్మకంగా ఉండాలి.
ఒక్కోసారి ఒక్క నినాదమే పార్టీకి ఎంతో ఉపయోగపడవచ్చు. 1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హటావో నినాదం మొత్తం దేశాన్ని కదల్చివేసింది. 1999లో ఈసారి వాజ్ పేయికే అన్న నినాదం బీజేపీకి కలిసి వచ్చింది. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ నినాదం పెద్ద ఉద్యమానికి అండగా నిలిచింది. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క చాన్స్ అన్న ప్రచారం బాగా కలిసి వచ్చింది.
ఇలా ఆయా వ్యాఖ్యలు కొన్నిసార్లు నెగిటివ్‌గా, మరికొన్నిసార్లు పాజిటివ్‌గా మారతాయి. ఎన్నికల సమయంలో నెగిటివ్ వ్యాఖ్యలు చేశారో,ప్రత్యర్ది పార్టీ దానిని అందిపుచ్చుకుని ప్రజలలో ఆ పార్టీ నేత పరపతిని దెబ్బతీస్తుంది. సరిగ్గా ఇప్పుడు రేవంత్‌ను బీఆర్ఎస్ అలాగే ఇరుకునపెట్టింది. దానికి కాంగ్రెస్‌లో అంతర్గతంగా ఉండే వర్గాలు కూడా ఆయనను చికాకుపెట్టాయి. అందుకే కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు.. నోరు జారితే వెనక్కి తీసుకోలేం అని అంటారు. దానిని నేతలు గుర్తుంచుకోకపోతే వారికే నష్టం.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment