బాబు హయాంలో నేరాలు-ఘోరాలు కంటపడలేదేమో? | Kommineni Comment On Eenadu Magazine Story On Vizag Kidnap Incident | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హయాంలో నేరాలు-ఘోరాలెన్నో.. కంటపడలేదేమో?

Published Sat, Jun 17 2023 1:58 PM | Last Updated on Sat, Jun 17 2023 5:00 PM

Kommineni Comment On Eenadu Magazine Story On Vizag Kidnap Incident - Sakshi

ఈనాడు మీడియా మరో అడ్డగోలు వార్తకు ఇది నిదర్శనం. ఏపీ ప్రజలపై ఆ మీడియా అక్కసు ప్రదర్శిస్తోందని, ప్రత్యేకించి విశాఖ పట్నంపై విషం కక్కుతోందనడానికి ఇంతకన్నా రుజువు అవసరం లేదు. అరాచక శక్తులకు విశాఖ అడ్డానే అంటూ ఈనాడు పత్రిక రెండు రోజుల క్రితం బ్యానర్‌ హెడింగ్ పెట్టడం ద్వారా తమ కక్షను ప్రదర్శించారు. పైగా దానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏదో అన్నారట. అవి నూటికి నూరుపాళ్లు నిజమని తేలిపోయిందట. మాఫియా రెచ్చిపోతోందని, ఇంకేదేదో చెత్త రాస్తూ తమ మాఫియా బుద్దిని ఈనాడు చూపెట్టడానికి ఏ మాత్రం సిగ్గు పడడం లేదు.

✍️ విశాఖ లోక్ సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్ జీవీరావులను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేయడం సంచలన వార్తే. ఆ విషయం బయటపడిన కొద్ది గంటలలోనే పోలీసులు వారిని పట్టుకుని బాధితులను విడిపించారు. ఇందుకు విశాఖ పోలీసులను అభినందించవలసిందే. అలా చేయకపోగా అరాచక శక్తుల అడ్డా అంటూ ఈనాడు చెలరేగిపోయింది.  దాదాపు అన్ని మీడియా ఛానెల్స్‌ ఈ వార్తను ప్రముఖంగానే ఇచ్చాయి. అందులో తప్పు లేదు. చాలా వరకు ఫ్రొఫెషనల్ గా కవర్ చేశాయి. కానీ, ఈనాడు మాత్రం తన విద్వేషాగ్నిని బహిర్గతం చేసుకోవడానికి ఈ ఘటనను ఉపయోగించింది. ఈ ఒక్క నేరంతో మొత్తం విశాఖ అంతా పాడైపోయినట్లా? ఎవడైనా బుద్ది ఉన్నవాడు ఇలాంటి చెత్త లాజిక్ తీసుకు వస్తారా?.

✍️ అదే నిజమని అనుకుంటే.. విశాఖ ప్రాంతంలో గత చంద్రబాబు పాలన సమయంలో ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని కొందరు హత్య చేశారే. అది ప్రశాంతతకు చిహ్నమని ఈనాడు ఆనాడు భావించిందా?. ఆ హత్యలతో విశాఖ జిల్లా అంతా హత్యల అడ్డాగా మారిపోయిందని ఈనాడు ఎందుకు రాయలేదు!.

గత టరమ్ లోనే విశాఖ పట్నం నడిబొడ్డులోనే ఒక మహిళను వివస్త్రను చేసి హత్య చేశారే. ఇందులో టీడీపీ నేతలపైనే ఆరోపణ వచ్చిందే! అప్పుడు మహిళలపై ఘాతుకాలకు విశాఖ కేంద్రం అయిందని రాయలేదే!.

► టీడీపీ హయాంలోనే విశాఖ భూ కబ్జాలపై సిట్ వేశారు. ఆ సందర్భంగా ఒక మంత్రి మరో మంత్రి పై కబ్జా ఆరోపణలు చేసినప్పుడు.. ఇది కబ్జాల మయం అయిందని రాయలేదే. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ కబ్జాలను కొన్నింటిని విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కక్ష అని రాశారే. 

► విజయవాడలో ఒక టీడీపీ నేత లైంగిక వేధింపులకు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆ నేతకు జీవిత ఖైదు కూడా పడింది. దాంతో టీడీపీ నేతలంగా లైంగిక నేరస్తులని ఈనాడు రాయాలి కదా!. ‘ఒహో.. టీడీపీ వాళ్లు ఏమీ చేసినా వారికి కమ్మగా ఉంటుంది’’ అని ఎవరైనా విమర్శిస్తే మరి ఏమి చెబుతారు?.

అదే విజయవాడలో చంద్రబాబు టైమ్ లో కాల్ మనీ సెక్స్ రాకెట్లకు ఎంతమంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఇదేమి దరిద్రపు పాలన అనో, టీడీపీ నేతల నీచ బుద్దులు అనో ఈనాడు రాసిందా?.. లేదే! ఇప్పుడు జరిగిన ఒక కిడ్నాప్‌ నేరానికి రాజకీయ రంగు పులిమి తమ పైత్యం అంతా ప్రదర్శిస్తోంది.


మార్గదర్శి కేసులో ఏపీసీఐడీ చెరుకూరి రామోజీరావును విచారించిన సందర్భంలో..

✍️ టీడీపీ పాలనలో ఇవేకాదు.. ఇంకా ఎన్నో ఘోరాలు జరిగాయి. విజయవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను నడిరోడ్డు మీద దీక్ష చేస్తున్న సమయంలో టీడీపీ వాళ్లు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని మాజీ మంత్రి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు. ఇందుకు ఈనాడు ఒప్పుకుని విజయవాడ హత్యల నగరం అయిపోయిందని కానీ, టీడీపీ హత్యాకాండలలో పాల్గొంటోందని కాని రాసిందా?. 

► పులివెందుల వద్ద ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాత వైఎస్ రాజరెడ్డిని టిడిపి నేతలు హత్య చేస్తే, ఆ టిడిపివారికి హైదరాబాద్ లోని టిడిపి ఆఫీస్ లో రక్షణ కల్పించారన్న అబియోగం అప్పట్లో వచ్చిందే.

► పోనీ కిడ్నాప్ ఘటనలు ఏవీ టిడిపి హయాంలో జరగలేదా! ఆనాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుర్తేడు అనేచోట పది మంది ఐఎఎస్ అదికారులను నక్సల్స్ కిడ్పాన్ చేశారు. వారిని విడిపించడానికి జైలులో ఉన్న తీవ్రవాదులను వదలిపెట్టిన చరిత్ర టిడిపిదే కదా!. 

► మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును కూడా నక్సల్స్ కిడ్నాప్ చేస్తే, ఆయన సతీమణి దీక్ష చేసి విడిపించుకోవలసి వచ్చిందే!

► గతంలో హుజూరాబాద్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న దుగ్గిరాల వెంకటరావును కాల్చి చంపారు. మండలాధ్యక్షుడుగా ఉన్న టీడీపీ నేత మలహర్ రావును హత్య చేసిన ఘటన ఉమ్మడి ఏపీలో పెను సంచలనం అయింది.

► ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కరాలలో స్నానం చేయడం కోసం సామాన్యులను నిలిపివేసిన సందర్భంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. అయినా అది చంద్రబాబు తప్పు కాదని, భక్తుల తప్పని ప్రచారం చేశారే!

✍️ ఇక తెలంగాణలో ఏవైనా నేరాలు జరిగితే ఇలాగే దిక్కుమాలిన వార్తలు ఇస్తున్నారా? ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే వణికే ఈనాడు మీడియా ఎపిలో మాత్రమే ఇలా నీచంగా రాస్తోంది. హైదరాబాద్ రింగ్ రోడ్డు వద్ద ఒక వెటర్నరీ మహిళా డాక్టర్ సామూహిక మానభంగానికి గురవడం, తదుపరి ఆమెను హత్య చేయడం ఎంత దారుణమైన ఘటనన్నది వేరే చెప్పనవసరం లేదు. ఆ దుర్ఘటన జరిగింది కనుక హైదరాబాద్ రేప్ ల అడ్డా అని ఈనాడు ఎందుకు రాయలేదు! ఆ తర్వాత కూడా పలు రేప్ కేసులు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి ఒక మహిళను ఎంత ఘాతుకంగా హతమార్చింది చూశాం. కొన్ని కిడ్పాప్ ఘటనలు, తుపాకి కాల్పులు ,రియల్ ఎస్టేట్ తగాదాలు, హత్యలు కూడా జరిగాయి. అయినా హైదరాబాద్ లో వచ్చే పరిశ్రమలు ఆగిపోతున్నాయా? లేదే!

✍️ దీని అర్ధం ఏమిటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సమాజంలో కొన్ని నేరాలు రకరకాల కారణాలతో జరుగుతుంటాయి. వాటిని అవకాశం ఉన్న మేరకు అదుపు చేయడం పోలీసుల బాధ్యత. నేరం జరిగిపోతే నిందితులను పట్టుకుని శిక్షించడం పోలీసుల కర్తవ్యం. అది జరుగుతోందా?లేదా? అన్నది చూడాలి కాని ప్రతి ఘటనకు ప్రభుత్వానికి , అదికారంలో ఉన్న పార్టీకి పులిమి వార్తలు ఇచ్చి ప్రజలలో వ్యతిరేకత పెంచాలని చూడడం జర్నలిజం అవుతుందా!. మీడియా ఈ రకంగా నైతికంగా పతనం అవడం శోచనీయం.

✍️ అమిత్ షా ఆధ్వర్యంలోనే పోలీసు శాఖ డిల్లీలో పనిచేస్తుంటుంది. కానీ అక్కడ ఎన్ని నేరాలు జరిగాయి.మహిళల రేప్ లు జరిగాయి. దాంతో డిల్లీ అరాచక శక్తుల అడ్డాగా మారిందని ఈనాడు రాయలేదే! యూపీలో ఒక మాజీ ఎంపీని ,ఆయన సోదరుడిని పోలీసుల సమక్షంలో ప్రజలంతా చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ మధ్య కోర్టులోనే కాల్పులు జరిగాయి. అయినా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ శాంతి భద్రతలను బాగా కాపాడుతున్నారని ఎందుకు ప్రచారం జరుగుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పవచ్చు. ఈనాడు మీడియా ఏపీలో ఏ చిన్న ఘటన జరిగినా దానిని వైఎస్సార్‌సీపీకి అంటకట్టి.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చేస్తున్న కుట్రలు ప్రజలకు అర్దం కాకుండా ఉంటాయా?. 


:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement