మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా! అలాగైతే కొద్ది రోజుల క్రితం ఈనాడు, ఆంధ్రజ్యోతి లలో ప్రచురితమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూలను చదవండి. ఇదేమిటీ! ఈ ఇంటర్వ్యూ ఇలా ఉందేమిటి? ఇందులో కీలకమైన ప్రశ్నలేవి? అనే సంశయం వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ కు వాటికి సమాధానం ఇవ్వడం చాతకాదనో, లేక తాము మోస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అనో వాటిని వేసినట్లు లేరు. మొత్తం మీద ఈ ఇంటర్వ్యూ చదివితే ఏమనిపిస్తుందంటే తెలుగుదేశం పార్టీ కోసం ,లేదా చంద్రబాబు కోసం , టీడీపీ పక్షాన, టీడీపీ విలేకరులు ఈ ఇంటర్వ్యూ చేశారని అర్ధం అవుతుంది.
వారాహి యాత్ర సందర్భంగా పవన్ ఇంటర్వ్యూ ఇవ్వడం ఆసక్తికరమైన విషయమే. కానీ.. అందులో ముఖ్యమైన విమర్శలు కానివ్వండి, ప్రజలలో ఉన్న సందేహాలు కానివ్వండి .. అన్ని వస్తాయని అనుకుంటాం. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం అవేవి అడగలేదు. పవన్ వాటిని తీర్చే ప్రయత్నమూ చేయలేదు. అయితే ఒక్క విషయాన్ని ఈ టీడీపీ మీడియా పవన్‌తో చెప్పించగలిగించింది. అదేమిటంటే ‘‘తాను సీఎం పదవికి అర్హుడను కానని, ఏదో తన వాహనం ముందు నిలబడి కొంతమంది అభిమానులు ‘సీఎం, సీఎం..’ అంటూ నినాదాలు చేస్తుంటారు కనుక వారిని సంతృప్తి పరచడానికే సీఎం అవుతానని అన్నానని’’ పవన్ చెప్పించడం ద్వారా టీడీపీ లక్ష్యాన్ని ఒక పత్రిక నెరవేర్చగలిగింది. ఆ క్రమంలో పవన్ మరింత పరువు పోగొట్టుకున్నారు.
❓పవన్‌ను ఉద్దేశించి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. అందులో పవన్ కళ్యాణ్ వీధి రౌడి భాషలో ప్రసంగాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాపులకు అన్యాయం జరగడంలో ,వారు రోడ్డు ఎక్కడంలో పవన్ కు బాధ్యత ఉందని ముద్రగడ స్పష్టం చేశారు. ఆయన కామెంట్లపై పవన్ స్పందన అడగాలి కదా!
ఇదీ చదవండి: కెలికి మరీ.. అనుభవిస్తున్న జనసేనాని
❓కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకు ఆయన బదులు ఇచ్చి తనపై పోటీ చేసి కాకినాడలో ఓడించాలని సవాల్ చేశారు. దాని గురించి అడగాలి కదా!..
❓చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ చేసిన అనేక విమర్శలను ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారా? అని అడగాలి కదా!
❓ ఆరోజుల్లో అమరావతిని కుల రాజధాని అని ఎందుకు అన్నారు? ఇప్పుడు ఇంకోలా ఎందుకు మాట్లాడుతున్నారు? అభిప్రాయం మార్చుకున్నారా?అని అడగాలి కదా!
❓ చంద్రబాబు ప్రభుత్వం అవినీతి మయం అయిందని, లోకేష్ అవినీతి చేస్తున్నారని ఆరోపించారు కదా.. ఇప్పుడు మీ వైఖరి మారింది కదా అని ప్రశ్నించాలి కదా!
❓ ఈ మధ్య ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మినీ మానిఫెస్టో ఒక దానిని ప్రకటించారు. దానిని సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారో పవన్ ను అడిగి తెలుసుకోవాలి కదా! అసలు అది అమలు అయ్యేదేనా?లేక మోసఫెస్టోనా అని అడగాలి కదా!
❓అసలు.. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ స్కీములు కొన్నిటిని ప్రస్తావించి వాటిపై పవన్ భావన ఏమిటో, అసలు ఆ స్కీముల గురించి ఆయనకు తెలుసో ,లేదో ప్రశ్నించాలి కదా!
❓జగన్ అమలు చేస్తున్న స్కీములతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్ లు గతంలో అన్నారు. కాని అవే స్కీములను ఇంకా ఐదు రెట్లు ఎక్కువగా ఇస్తామని చంద్రబాబు అంటున్నారు. అప్పుడు శ్రీలంక అవుతుందా?లేదా? అన్నది అడగాలి కదా!
❓ ఏపీలో వ్యక్తిగత తగాదాలతో నేరాలు జరిగితే బూతద్దంలో చూపుతూ విమర్శలు చేస్తున్నారు కదా! మరి తెలంగాణలో, యుపిలో ,ఇతర రాష్ట్రాలలో ఇవే తరహాలో ,కొన్నిసార్లు ఇంకా ఘోరంగా నేరాలు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని అనాలి కదా!
❓రాజకీయంగా బిజెపి, టిడిపి, జనసేన కలవాలని మరోసారి అన్నారు. అదెలా సాధ్యమో తెలుసుకోవాలి కదా!
❓గతంలో ప్రధాని మోడీని చంద్రబాబు ,టిడిపి నేతలు దూషించిన వైనాన్ని పవన్ సమర్ధిస్తారా? లేదా వాటిని తూచ్ అని మర్చిపోవాలని బిజెపివారికి చెబుతున్నారా?
❓ఒకప్పుడు చెగువేరా ? ఆ తర్వాత మాయావతి, తదుపరి మళ్లీ మోడీ ఇలా సిద్దాంతాలు మార్చేసిన తీరుపై పవన్ ను ప్రశ్నించాలి కదా!
❓ చంద్రబాబు లేదా లోకేష్ లు సి.ఎమ్. అవడానికి మద్దతు ఇస్తున్నట్లేనా? పవన్ సి.ఎమ్. కావాలంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయాలి కదా! వాటి గురించి తెలుసుకోవాలి కదా!
❓ఒకసారి సి.ఎమ్ .అవుతానని, ఇంకోసారి కానని, ఇలా రకరకాలుగా చెప్పడం వల్ల జనసేనలో గందరగోళం ఏర్పడలేదా ?
❓ప్రత్యేక హోదా అంశాన్ని వదలివేయడానికి పవన్ రెడీ అయినట్లేనా?
❓అసలు పవన్ కళ్యాణ్ ఎన్నికల ఎజెండా ఏమిటి? ముఖ్యమంత్రి జగన్ ను, వైసిపి ప్రభుత్వాన్ని రోజూ దూషిస్తూనే ఉన్న పవన్ మరోసారి ఇంటర్వ్యూల రూపంలో తిట్టడం మినహాయించి కాంక్రీట్ గా ఏమైనా చెప్పారా?..
✍️పవన్ ఇంటర్వ్యూలను పరిశీలిస్తే.. పై తరహా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం మచ్చుకు కూడా కనిపించదు.
✍️ఈ మధ్యకాలంలో సాక్షి మీడియాలో వస్తున్న ఇంటర్వ్యూలు చాలా బెటర్‌గా ఉంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా వారిపై విపక్షం చేస్తున్న విమర్శలన్నిటిని ప్రశ్నల రూపంలో అడుగుతున్నారు. ఈ మాత్రం కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు చేయలేకపోయారంటే యాజమాన్యం నుంచి వారు ఎంతటి ఒత్తిడి ఎదుర్కుంటున్నారో తెలుస్తూనే ఉంది.
✍️అందుకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎలా నచ్చుతుందో ,ఎలా ఉపయోగపడుతుందో అదే విధంగా ఈనాడు, జ్యోతి మీడియాలు ఇంటరవ్యూలు చేశాయి. అదే ప్రయోజనం కోసం పవన్ కళ్యాణ్ సమాధానాలు చెప్పారు. ఈ మాత్రం దానికి పేజీలకు,పేజీలు కేటాయించి ప్రజలను విసిగించడం తప్ప ఏమైనా ఉందా!. పవన్ వీపును ఈ మీడియా గోకితే, ఈ మీడియా వీపును పవన్ గోకారన్నమాట. అందుకే వీటిని మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూలు అంటారు. స్థూలంగా చూస్తే అసలు పవన్ ఇంటర్వ్యూలు ఇచ్చారా?లేక ఈ మీడియానే ప్రశ్నలు, సమాధానాలు రాసుకుని ఆయన తరపున అచ్చేశాయా అనే అనుమానం కలుగుతుంది. ఈ వన్‌సైడెడ్ ఇంటర్వ్యూలతో పవన్‌కి ఉన్నపరువు కాస్త గంగలో కలిసిపోయినట్లే!.
::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment