AP: పురందేశ్వరికి ముందే తెలిసిపోయిందా? | Kommineni Comment On Purandeswari Over Liquor Policy Allegations | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై లిక్కర్‌ స్కాం కేసు.. పురందేశ్వరికి ముందే తెలిసిపోయిందా?

Published Tue, Oct 31 2023 12:05 PM | Last Updated on Tue, Oct 31 2023 12:23 PM

Kommineni Comment On Purandeswari Liquor Policy Allegations - Sakshi

ఈ మధ్య బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ ప్రభుత్వంపై మద్యం కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఏమిటి.. ఈ మహిళా నేతకు మద్యం గోలేమిటి అనే సందేహం వచ్చింది. ఆమె వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి, లోక్ సభ లో పార్టీ నేత మిధున్ రెడ్డిలపై కూడా కొన్ని విమర్శలు  చేశారు. దానికి విజయసాయి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన పలు విషయాలు బహిర్గతం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. అవేమిటో తెలియదు. ఇప్పుడు అసలు విషయం వెల్లడైంది.

ఆమె ఎందుకు మద్యం కుంభకోణం అంటూ గగ్గోలు పెట్టారో అర్ధం అయింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మద్యం స్కామ్ కేసు రాబోతోందని ఆమెకు, చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ ముఖ్యనేతలు కొందరికి సమాచారం ఉండి ఉండాలి. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుకు స్వయానా ఆమె వదిన కావడంతో ఆ బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు ఆమె ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించి ఉండాలి. ఎందుకంటే టీడీపీ నేతలు ఏ విమర్శలు చేసినా జనం పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. అన్నీ అబద్దాలు ఆడుతున్నారనే భావన జనంలోకి వెళుతోంది. ఆమె ఒకటికి రెండుసార్లు మద్యం కుంభకోణం అనడం, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం.. ఇదంతా రాజకీయంలే అనుకున్నవారికి అసలు విషయం అర్ధం అయింది.

✍️చంద్రబాబుపై ఏపీ సీఐడీ మద్యం స్కామ్ కేసును నమోదు చేసింది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.1,300 కోట్ల మేర నష్టం చేశారన్నది అభియోగం. ఈ విషయాలు జనంలోకి వెళ్లడానికి ముందుగానే ఎదురు దాడి చేయాలని పురందేశ్వరి బృందం అనుకుని అలా ప్రభుత్వంపై విమర్శలు చేశారని తేలుతోంది. ఇక ఈ కేసు విషయానికి వస్తే, నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు,యనమల రామకృష్ణుడి బంధువులకు మద్యం కంపెనీల ఏర్పాటులో ప్రత్యేక రాయితీలు ఇచ్చారన్న  ఆరోపణలను దర్యాప్తు సంస్థ మోపింది. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ వాట్ తో పాటు ఆరుశాతంగా ఉన్న ప్రివిలేజ్ ఫీజ్ ను పది శాతం చేయాలని సూచిస్తే, ఈ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసిందని సీఐడీ దర్యాప్తులో తేలింది. ఇదంతా క్విడ్ ప్రోకో ప్రకారం జరిగిందని అనుమానిస్తున్నారు. ఇవే విషయాలను ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలియచేశారు.

ఈ కేసులో ఏ పరిణామాలు సంభవిస్తాయో తెలియదు కాని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రూ. 338 కోట్ల మొత్తం చేతులు మారిందని ఆరోపణ వస్తేనే ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు గత ఆరునెలలుగా బెయిల్ రాలేదు. విచారణ పూర్తి కానందున ఇప్పటికీ బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. అదే సూత్రం చంద్రబాబు కేసులో కూడా వర్తిస్తే, ఆయనకు బెయిల్ రావడం కష్టమే కావచ్చన్నది ఒక అభిప్రాయంగా ఉంది. అందుకే కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండా ఆయన న్యాయవాదులు 17-ఏ అనో, అనారోగ్యం అనో కారణాలు చూపుతూ మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ లు వేశారు.
 

✍️చంద్రబాబు టైమ్ లో జరిగిన మద్యం స్కామ్ పై పురందేశ్వరి స్పందిస్తారో లేదో తెలియదు. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ మాత్రం తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతోందని, ఆయనపై 35 లక్షల కేసులు పెట్టాలని చిత్రమైన విమర్శ చేశారు. మద్యం తాగి అనారోగ్యంపాలై 35 వేల మంది మణించారని కూడా ఆరోపించారు. దీనిపై చర్చకు సిద్దమా?అని ఆయన ప్రశ్నించారు. ఎవరి హయాంలో మద్యం దందా జరిగిందో తేల్చుకుందామని ఆయన అన్నారు.

✍️ఇలా అర్ధం ,పర్దం లేని అబద్దాల వల్లే చంద్రబాబు, లోకేష్ ల ప్రకటనలకు విలువ లేకుండా పోతోంది. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు ఏమిటి? లోకేష్ చేస్తున్న ఆరోపణ ఏమిటి?. ముందుగా చంద్రబాబు పై వచ్చిన అభియోగాలు ఏ రకంగా వాస్తవం కాదో ప్రజలకు వివరించాలి కదా!. ఆ తర్వాత ఏ ఆరోపణ అయినా చేయవచ్చు. అది వేరే సంగతి. కాగ్ సైతం చంద్రబాబు టైమ్ లో మద్యం వ్యాపారంలో ఖజానాకు నష్టం కలిగిందని పేర్కొందా?లేదా?. 2014 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఎన్నికైన నంద్యాల నుంచి ఎన్నికైన ఎస్పివై రెడ్డికి.. ఢిల్లీ ఏపీ భవన్ లోనే పచ్చ కండువా కప్పి టిడిపిలోకి తీసుకున్నది అవాస్తవమా? ఆయనకు అప్పుడు ఇచ్చిన ఆఫర్ ఏమిటో జనానికి తెలియదా?. ఆ విషయం ఆ రోజుల్లో ఎస్పివై రెడ్డే అంతరంగికంగా చెబుతుండేవారని అంటారు. అప్పుడే ఆయన డిస్టిలరీని స్థాపించారు. దానికి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అని ఆయన పార్టీ మారినట్లు చెప్పేవారు. ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ కూడా బాగానే కుదిరింది.

✍️నిజానికి ఆయన ఒక్కరికే కాదు. మరో ఇద్దరు  వైఎస్సార్‌సీపీ ఎంపీలను కూడా టిడిపిలోకి లాగారు. ఇరవై మూడు మంది వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని బహిరంగంగానే చెప్పుకునేవారు. కర్నూలు జిల్లా కొడుమూరుకు అప్పట్లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఒక నేత తనకు ఎంత ఆఫర్ వచ్చింది ఓపెన్ గానే చెప్పడం కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాను అప్పుల్లో ఉన్నానని, వాటన్నింటిని టీడీపీ అధినాయకత్వం తీర్చి వేయడానికి ఒప్పుకుందని, అందుకే పార్టీ మారానని తన సన్నిహితులు పలువురికి చెప్పేవారు. మరో ఎమ్మెల్యేకి బెంగుళూరులో డబ్బు  ఏర్పాటు జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. వీటిలో కొన్నిటింకి టీడీపీ మద్దతు ఇచ్చే ఒక పత్రికాధిపతి కూడా మద్యవర్తిగా కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. కాకపోతే ఇప్పుడు  ఈ మద్యం కుంభకోణం జరగలేదని టీడీపీ నేతలు డబాయించవచ్చు. స్కిల్ కేసులో మాదిరి అసలు విషయం జోలికి వెళ్లకుండా అక్రమ కేసు అని బుకాయించవచ్చు. కాని, అసలు విషయాలన్ని బయటకు వస్తే టిడిపికి, చంద్రబాబుకు మరింత ఇబ్బంది అని భయపడుతున్నారనిపిస్తుంది.

జగన్ అధికారంలోకి వచ్చాక ఒక కొత్త డిస్టిలరీ ఇవ్వకపోయినా,కొత్త బ్రాండ్లు ఏమీ రాకపోయినా చంద్రబాబు టైమ్ లో ఇచ్చిన లైసెన్స్ లన్ని,కొత్త బ్రాండ్లన్నీ  ఇప్పుడే ఇచ్చినట్లు ప్రచారం చేయడం టీడీపీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కథనాలు ఇవ్వడం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే పురందేశ్వరి కూడా ముందుగానే వైఎస్సార్‌సీపీపై ఎదురు దాడి చేస్తే చంద్రబాబు పై ఉన్న స్కామ్ కు ప్రాధాన్యత తగ్గుతుందని అనుకుని ఉండాలి. అలాకాని పక్షంలో ఆమె చంద్రబాబు టైమ్ లో జరిగినట్లు సీఐడీ చెబుతున్న ఈ స్కామ్ పై స్పందించవలసి ఉంటుంది. స్కిల్ స్కామ్ కేసులోనే ఆమె చంద్రబాబుకు మద్దతు ఇస్తూ మాట్లాడి అభాసుపాలయ్యారు. అయినా ఆమె పార్టీ కన్నా, బంధుత్వానికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.

✍️ఒకప్పుడు దగ్గుబాటి కుటుంబానికి, చంద్రబాబుకు ఉప్పు-నిప్పుగా పరిస్థితి ఉన్నా.. చంద్రబాబు ఎలాగో వారిని తన దారిలోకి తెచ్చుకున్నట్లు అనిపిస్తుంది. లోకేష్ మద్య నిషేధం గురించి చెబుతున్నారు. బహుశా ఆయన బాగా చిన్నవాడై ఉండవచ్చు. 1994లో ఎన్.టి.రామారావు ప్రభుత్వంలోకి రాగానే మద్య నిషేధం అమలు చేశారు. ఆయనను కూలదోసి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తాను ఇంకా కఠినంగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని కొంతకాలం ఊదరగొట్టి, ఆ వెంటనే ఇది మనవల్ల కావడం లేదని చేతులెత్తేసి, ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్త డ్రామాకు తెరదీసి మధ్య నిషేదాన్నే ఎత్తివేశారు. మరి అందుకు ఆయనపై ఎన్ని లక్షల కేసులు పెట్టాలో కూడా లోకేష్ ఆలోచించుకోవాలి.

✍️1999 ఎన్నికల సమయంలో అనుకుంటా!మద్యం కంపెనీలకు సుమారు 400 కోట్లు చెల్లించిన వైనంపై  ఆరోపణలు వచ్చాయి. వాటిపై కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి పాల్వాయి గోవర్దనరెడ్డి కోర్టుకు వెళ్లారు. అప్పుడు ఎలా చంద్రబాబు ఆ కేసునుంచి బయటపడింది లోకేష్ తెలుసుకుంటే, ఆ అనుభవం బాగా ఉపయోగపడవచ్చు.చంద్రబాబు క్విడ్  ప్రోకో కారణంగా అప్పట్లో ఏడాదికి రూ. 1300 కోట్ల నష్టం ప్రభుత్వానికి వచ్చిందని సీఐడీ చెబుతోంటే దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఈనాడు మీడియా  నేరుగా చంద్రబాబుపై కక్షసాధింపుల పర్వంలో భాగంగా మద్యం కేసు పెట్టినట్లు చెప్పేసింది.

✍️అసలు వార్తను పక్కకు దోసి చంద్రబాబును ప్రభుత్వం వేధిస్తోందని పత్రికలో, టీవీలో ప్రచారం చేశారు. మరి గతంలో ఎమ్.పిగా ఉన్న వైఎస్ జగన్ పై పదకుండు కేసులు పెట్టినప్పుడు, ఒక చార్ఝీషీట్ పై మరో చార్జీషీట్ వేసినప్పుడు అదంతా సక్రమం అనిపించిన ఈనాడుకు.. ఇప్పుడు చంద్రబాబుపై అవినీతి అభియోగాలు వస్తే మాత్రం అంతా అక్రమం అని గగ్గోలు పెడుతోంది. అందుకే ఈనాడు రామోజీరావుకు, చంద్రబాబుకు మద్య బందం ఫెవీకాల్ వంటిదని అందరూ అంటుంటారు. ఇక మరో పత్రిక ఆంద్రజ్యోతి ఒకవైపు కేసు కక్ష అంటూనే, మరో వైపు అప్పటి ఇంకో అధికారి అజయ్ కల్లంపై ఎందుకు కేసు పెట్టలేదని స్టోరీ ఇచ్చింది. అంటే ముందుగా ఈ అక్రమం జరిగిందని ఆ పత్రిక  ఒప్పుకుని , ఆ తర్వాత ఏమైనా రాసుకోవచ్చు. చంద్రబాబుపై కేసు పెడితే అక్రమం అయితే, మరి అజయ్ కల్లంపై కేసు పెట్టాలని ఎలా రాస్తారో తెలియదు. జగన్ ప్రభుత్వంపై మద్యం లో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, ప్రభుత్వం టీడీపీ హయాలో ఏదో జరిగిపోయిందని కేసు పెట్టిందని ఈనాడు తెగ బాధపడిపోయింది. ఈ ప్రభుత్వంపై ఏవైనా ఆరోపణలు ఉంటే ఆధారసహితంగా చేయాలి. దానికి ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. అంతే తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు జరిగినా వాటిపై కేసులే పెట్టవద్దని ఈనాడు వంటి మీడియా విచిత్రమైన వాదన చేయడం దేనికి సంకేతం అవుతుంది?. రామోజీరావు అవినీతికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు కాదా?. ఇప్పటికే వివిధ కేసులలో విలవిలలాడుతున్న చంద్రబాబుకు ఈ మద్యం స్కామ్ మరో దెబ్బే అని చెప్పాలి.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement