జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు ఇలా రెచ్చిపోయినట్లు పిచ్చితనంగా మాట్లాడుతున్నారు?. తనను హత్య చేయడానికి సుపారీ ఇచ్చారని ఎందుకు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను,ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎందుకు అంతలా దూషిస్తున్నారు. తాను అదికారంలోకి వస్తే ఎమ్మెల్యేని భీమ్లానాయక్ సినిమాలో మాదిరి లాక్కువెళతామని, వైఎస్సార్‌సీపీ వాళ్లను కొడతామని ఇలా.. ఏవేవో క్రిమినల్ భాషలో ఎందుకు మాట్లాడుతున్నారు. ఇదంతా కాకతాళీయంగా చేస్తున్నారా? కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా?..
కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రసంగిస్తున్న విషయాలలో పెక్కు వివాదాస్పదం అవుతున్నాయి. ఒక రాజకీయ నేత ప్రవర్తించవలసిన పద్దతిలో ఆయన లేరన్న అభిప్రాయం కలుగుతుంది. విధానపరమైన అంశాలు,ప్రభుత్వ పధకాల జోలికి వెళ్లకుండా రాష్ట్రంలో ఏదో అశాంతి ప్రబలిపోయిందన్న అపోహ కల్పించాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. సరిగ్గా ఇది టీడీపీ అధినేత చంద్రబాబు శైలి.
✍️ తాను అధికారంలో ఉంటే పరిస్థితి ఎలా ఉన్నా రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్లు, శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నట్లు.. అదే ఎదుటివారు అధికారంలో ఉంటే అంతా అరాచకమే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5 వంటివి ఆయనకు తందానా అంటాయి. ఇప్పుడు అదే స్టైల్ లో పవన్ కళ్యాణ్ కూడా ఉపన్యాసాలు సాగిస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఇది జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. దానిని నిజమని ధృవీకరించేలా పవన్ కల్యాణ్ ఎక్కడా గత టీడీపీ పాలన గురించి ఒక్క ముక్క మాట్లాడకుండా ఎంతసేపు జగన్ ప్రభుత్వంపైనే చేస్తున్న ఆరోపణలు గమనిస్తే పిచ్చితనం పీక్‌కు చేరినట్లు అనిపిస్తుంది.
✍️ పవన్ ప్రసంగంలో.. తనను ప్రజలు ఓడించి వైఎస్సార్‌సీపీని గెలిపించారన్న దుగ్ద కనిపిస్తుంది. అందుకే తనను కనీసం ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన బతిమాలుతున్నారు. అది కూడా అనుమానంగా ఉండబట్టే తనను చంపడానికి సుపారీ ఇచ్చారని మరో ఆరోపణ చేశారు. దీనివల్ల కొంతైనా సానుభూతి రాకపోతుందా అన్నది ఆయన ఆశ కావచ్చు. అది నిజమే అయితే ఆయన స్వయంగా లేదా, ఆయన పార్టీ నేతల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా!. అదేమీ చేయలేదంటే ఏమిటి దాని అర్ధం. కేవలం ప్రచారం కోసం ఇలాంటివి చెప్పి ప్రభుత్వంపై బురద చల్లడమే కదా!
✍️ సినిమా నటుడు కనుక ఆయనకు కొంత అభిమాన బలగం ఉంది. సామాజికపరంగా కొంతమంది ఆయనను అనుసరించవచ్చు. వారిలో ఉద్రేకం రెచ్చగొట్టం ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లుగా ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యేలను, వైస్సార్‌సీపీవాళ్లను దారుణంగా తిట్టడం ద్వారా ఆ వర్గాలలో కోపం తెప్పించాలని, వారిలో ఎవరైనా ఆవేశపరులు ఉంటే వారు రియాక్ట్ అయితే.. మళ్లీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాలన్నది ఆయన దురుద్దేశం కావచ్చు. ఇలాంటి టెక్నిక్స్ లో చంద్రబాబు దిట్ట. వాటిలోకొన్నిటిని పవన్ కల్యాణ్ కు నేర్పి పంపినట్లుగా ఉంది.
✍️ పవన్ కల్యాణ్, చంద్రబాబులతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి కావాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నట్లుగా భ్రమ కల్పించి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజీని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి అందులోనూ కాకినాడ వంటి ప్రశాంతమైన నగరంలో పవన్ రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నం ఇంతా అంతా కాదు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటన్నింటిని ప్రస్తావించి మరోసారి ప్రచారం చేయడం ఇష్టం లేదు. ఈ సందర్భంగా కాకినాడ నుంచి పోటీచేసి తనను ఓడించాలని ద్వారంపూడి సవాల్ చేశారు. ఎటూ తను ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసేది ఇంకా తేల్చుకోలేదు కనుక ఆయన ఈ అవకాశాన్ని వినియోగించుకుని కాకినాడ సిటీలో పోటీచేయవచ్చు కదా!. ఆ ధైర్యం పవన్‌కు ఉందా? అన్నది సందేహమే.
✍️ పవన్ ఇప్పటిదాకా యాత్రలో ఎక్కడా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ స్కీముల గురించి తన అభిప్రాయాలు చెప్పలేదు. అమ్మ ఒడి కింద విద్యార్ధుల తల్లిదండ్రులకు పదిహేనువేల రూపాయలు చొప్పున ఇవ్వడాన్ని ఆయన అంగీకరిస్తారా?లేదా?.. చేయూత కింద 18,500 రూపాయల చొప్పున మహిళలకు ఇవ్వడం కరెక్టా ?కాదా?.. కాపునేస్తం కింద కాపు మహిళలకు ఆర్ధిక సాయం చేయడాన్ని సమర్దిస్తారా?లేదా?.. చేనేత నేస్తం కింద చేనేత కుటుంబాలకు సాయం చేయాలా?వద్దా ?.. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ,ఇళ్లు నిర్మించడాన్ని ఒప్పుకుంటారా?లేదా?.. వలంటీర్ల వ్యవస్థపై ఆయన అభిప్రాయం ఏమిటి? గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజల ముంగిటికి పాలన వెళ్ళిందా?లేదా?.. రైతు భరోసా కేంద్రాలకు రైతులకు ఉపయోగపడుతున్నాయా?లేదా?.. ఇలాంటివాటిపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.
✍️ ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటూ అబద్దపు ప్రచారం చేయడమే కాకుండా, బీహారులా మారిందని పవన్ అనడం ద్వారా ఏపీపై ఆయనకు ఉన్న అక్కసును బయటపెట్టుకున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వాన్ని చెత్తపాలనతో పోల్చుతూ జపాన్‌కు చెందిన మాకీ సంస్థ దేశ ప్రధానికి లేఖ రాసినప్పుడు మాత్రం.. పవన్ కల్యాణ్ నోట్లోవేలేసుకుని కూర్చున్నారు. చంద్రబాబు కాని, లోకేష్ కాని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాని ఒకే వ్యూహంతో వెళుతున్నారు. అదేమిటంటే..
ప్రజలు ఈ సంక్షేమ స్కీముల గురించి మర్చిపోవాలి. ఆ పిమ్మట రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న భయాన్ని కల్పించాలి. సంక్షేమ స్కీముల ద్వారా ప్రజల ఆదరణను జగన్ బాగా పొందారని గమనించిన ఈ ప్రతిపక్షం వాటి జోలికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా కుట్ర ధోరణికి వెళుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే పచ్చిగా ఇలాంటివాటిని ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా మొదటి పేజీలలో ప్రచురిస్తూ ప్రజలలో కంపరం కలిగిస్తున్నాయి. అదే తెలంగాణకాని, ఇతర రాష్ట్రాలలో కాని ఎన్ని ఘటనలు జరిగినా, ఎంత పెద్ద నేరం జరిగినా, దానిని కప్పిపుచ్చేలా వార్తలు ఇస్తున్నారు. అందుకే ఈ ఎల్లో మీడియాను జనం నమ్మవద్దని పదే,పదే చెప్పాల్సి వస్తోంది.
::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment