ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తెస్తే అవి దొంగ అప్పులు అవుతాయా? అదే తెలుగుదేశం హయాంలో అప్పులు తెస్తే మాత్రం అవి దొర అప్పులు అవుతాయా? తెలుగుదేశం పక్షాన పనిచేస్తూ బట్టలు విప్పుకు తిరుగుతున్న ఒక పత్రిక రాస్తున్న వార్తలు, కథనాలు గమనిస్తే, జర్నలిజం ఇంత నీచంగా మారిందా అన్న ఆవేదన కలుగుతుంది. రాష్ట్రాల అప్పులపై కేంద్రం పార్లమెంటులో ఇచ్చిన సమాధానంపై ఈ పత్రిక తీవ్ర అసహనంతో కథనం ఇచ్చింది.
దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని, ఏపీ ప్రభుత్వ అప్పుల గురించి సీరియస్‌గా లేదని వాపోయింది.ఏ పత్రిక అయినా రాష్ట్రాలు చేసే అప్పులపై ఒక విధానం కలిగి ఉంటే దానిని సంపాదకీయంలో రాయవచ్చు. లేదా ఆర్టికల్స్ ద్వారా తెలియచేయవచ్చు. లేదా నిజంగానే ఏ రాష్ట్రం అయినా నిబంధలకు విరుద్దంగా అప్పులు తెస్తే ఆ విషయాన్ని చెప్పవచ్చు. కాని అసలు ఏ ప్రభుత్వం అయినా నిబందనలతో నిమిత్తం లేకుండా ఎలా అప్పులు తేగలుగుతుంది. అసాధారణ పరిస్థితులలో తప్ప కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవకాశం ఇస్తుందా?
బ్యాంకులు ఏ ఆధారం లేకుండా రుణాలు ఎలా ఇస్తాయి? రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసే రుణాలు కాకుండా కార్పొరేషన్ లు, ప్రత్యేక వాహక సంస్థల ద్వారా చేసే అప్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని , తద్వారా రుణ పరిస్థితిపై , తద్వారా వచ్చే ఇబ్బందులపై విశ్లేషించవచ్చు. కాని దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నా, ఏపీ ప్రభుత్వమే అప్పులు చేస్తున్నట్లు, దానివల్ల రాష్ట్రం దివాళా తీస్తోందని ప్రచారం చేయడం దారుణంగా ఉంటుంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఆర్ధిక సంస్థలతో ఒప్పందం అయి సుమారు ఎనభైవేల కోట్ల రుణం తీసుకుంది.
అది కరెక్టా?కాదా అన్నదానిపై ఈ టీడీపీ మీడియా నోరు ఎత్తడం లేదు. తెలంగాణ అనేకాదు.అనేక రాష్ట్రాలు కార్పొరేషన్లు ,ఎస్ పి వి ల ద్వారా రుణాలు సేకరిస్తున్నాయి. మిగిలినవాటి సంగతి ఎలా ఉన్నా ఎపికి మాత్రం అప్పు పుట్టకూడదన్న తపనతో ఉన్న ఆ వర్గం మీడియా దారుణమైన కథనాలు రాయడానికి వెనుకాడడం లేదు. టీడీపీ మీడియా గా పేరొందిన ఈనాడుతో సహా మరికొన్ని మీడియా సంస్థలు ఏపీ ప్రభుత్వం అప్పు ఎనిమిది లక్షల కోట్లు అని ప్రచారం చేశాయి. కార్పొరేషన్‌ల అప్పులను కూడా బడ్జెట్ రుణాలుగా లెక్కించాలని కేంద్రం చెప్పిందని ఒకసారి, కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించిందని మరోసారి, ఇలా రకరకాల వార్తలతో ప్రజలలో గందరగోళం సృష్టించే యత్నం చేశాయి. నిజానికి కేంద్రం ఏదో ఒక రాష్ట్రానికే ఇలాంటి లేఖలు రాయలేదు. అన్ని రాష్ట్రాలకు కలిపి లేఖ రాసింది. కాని దానిని ఏపీకి మాత్రమే పరిమితం చేసి దుష్ప్రచారం చేశారు.
తీరా పార్లమెంటులో ఏపీ అప్పు 3.98 లక్షల కోట్లేనని తేల్చడంతో ఈ మీడియాకు మింగుడు పడడం లేదు. అందుకే ఆ అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కార్పొరేషన్ ల రుణాలను కూడా ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారన్న విషయాన్ని శీర్షికలలో పెట్టి సంతృప్తి చెందారు.
నిజమే. ఏ ప్రభుత్వం అయినా తన శక్తి మేరకే అప్పులు చేయాలి. పిండి కొద్ది రొట్టె అంటారు. అలాగే కేంద్రం కాని ,ఆర్బీఐ కాని, లేదా ఆయా బ్యాంకులు కాని ఇలాంటి విషయాలన్నిటిని పరిగణనలోకి తీసుకునే అప్పులను అనుమతిస్తాయి. కొన్ని సార్లు ప్రత్యేక వాహక సంస్థ ద్వారా రుణాలు తీసుకుంటారు. అది గత టీడీపీ ప్రభుత్వంలోనూ జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలోను జరుగుతుండవచ్చు. కాని అదేదో జరగకూడనిది జరిగిపోయినట్లు ఈ మీడియా ప్రచారం చేసింది.
గత ప్రభుత్వం రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని దానిని పసుపు-కుంకుమ స్కీమ్ కు మళ్లించింది. అలాగే పౌర సరఫరాల సంస్థ ద్వారా సేకరించిన రుణాలను కూడా ఇతర అవసరాలకు మళ్లించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు. అమరావతి అబివృద్ది బాండ్ల పేరుతో ప్రత్యేక అనుమతి పొంది పదిశాతం వడ్డీకి రుణాలను తెచ్చిన ఘనత కూడా గత ప్రభుత్వానిదే. అప్పుడు ఇవే పత్రికలు అబ్బో చంద్రబాబు కాబట్టి ఆ రుణాలు వచ్చాయని ప్రచారం చేశాయి. అంతే తప్ప..ఎందుకీ అడ్డగోలు అప్పులు, ఇంత వడ్డీ ఏమిటి అని ప్రశ్నించలేదు. ఇటీవల ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ ద్రవ్యలోటు రెండు శాతానికి తగ్గిన వైనాన్ని వివరించారు. అదే చంద్రబాబు టైమ్‌లో ఇది రెట్టింపు లోటుగా ఉన్న సంగతి తెలిసిందే.
గత ప్రభుత్వం పరిమితి తీసుకున్న అప్పులు పదహారు వేల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం వచ్చాక కేంద్రం కోత పెట్టింది.దానిపై జగన్ అభ్యంతరం కూడా చెప్పారు. ఇంత జరిగినా, ఇప్పుడే పరిమితి మించి అప్పులు తీసుకుంటున్నారని, చంద్రబాబు టైమ్ లో అంతా చక్కగా జరిగిపోయినట్లు గా కలరింగ్ ఇస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లపాటు కరోనా పట్టి పీడించింది. దానిని తట్టుకోవడానికి అప్పులు తీసుకోవాలని కేంద్రమే సూచించింది. ఇక గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన వేలాది కోట్ల రూపాయల బాకీల బాధ్యత ఈ ప్రభుత్వంపై పడింది.
ఇవేవి గమనంలోకి తీసుకోకుండా టీడీపీ మీడియా విష ప్రచారం చేసింది.వారికి పూర్తి నిరాశ కలిగించే రీతిలో కేంద్రం సమాధానం ఉండడంతో ఇప్పుడు కేంద్రంపైనే విమర్శలు కురిపిస్తూ ఒక పత్రిక రోదించింది. కేంద్రం ఏపీపై ఏ చర్య తీసుకోవడం లేదని , హెచ్చరికలు డ్రామాలే అంటూ ఏడ్చి మొత్తుకుంది. కేంద్రానికి రాష్ట్రం తప్పుడు లెక్కలు ఇస్తోందని కూడా ఆరోపించింది. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి వైసీపీ మద్దతు ఇచ్చాక వాటిని కేంద్రం పట్టించుకోవడం లేదని రాసింది. ఇదంతా వారి కుళ్లు బుద్ది తప్ప మరొకటి కాదు.టీడీపీ హయాంలో జరిగినవన్నీ దొర అప్పలా. పరిమితి మించి చేసిన అప్పులపై ఆనాడు కేంద్రం ఏ చర్య ఎందుకు తీసుకోలేదు? తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రుణాలు తీసుకోవడమే కష్టంగా ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. అలాంటి సమయంలో జగన్ ప్రభుత్వం సమర్దంగా నిధులు సమకూర్చుకుని తను అనుకున్న స్కీములను అమలు చేసి ప్రజల ఆదరణ పొందుతోందన్నదే ఈ టీడీపీ మీడియా బాధ తప్ప మరొకటికాదు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment