గతంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన, అప్పుల తీరు తెన్నులపైన సందర్భానుసారంగా మీడియాలో కథనాలు వస్తుండేవి. నిత్యం ప్రభుత్వాన్ని వెంబడించి, వేధించే విధంగా వార్తలు ఇచ్చేవారు కారు. కాని ఇటీవలి కాలంలో ధోరణి పూర్తిగా మారిపోయింది. తమకు ఇష్టం లేని ప్రభుత్వం ఉంటే ఆర్థిక శాఖలో ఏ చిన్న పరిణామం జరిగినా, గోరంతలు, కొండంతలు చేసి రాయడం ఆనవాయితీగా మారింది. ఏ రాష్ట్రంలో అయినా ఆర్దిక శాఖ, పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎవరి పరిధులలో అవి పనిచేస్తుంటాయి. ప్రభుత్వం చేసే వ్యయాలు, అందులో ఉన్న లోటుపాట్లు, ఆదాయ వనరులు సమకూరడంలో అంచనాలు తప్పడం మొదలైన వాటిపై కాగ్ ఏటా నివేదికలు ఇస్తుంది.
చదవండి: జగన్, చంద్రబాబుల ప్రసంగాలలో వ్యత్యాసం ఏమిటి!
ఆ నివేదికలపై పీఏసీలో చర్చ జరుగుతుంది. పీఏసీ సాధారణంగా విపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఛైర్మన్‌గా ఉంటారు. ప్రజాస్వామ్య రాజకీయాలలో భాగంగా పీఏసీని కూడా వాడుకోవడం అప్పడప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ కాగ్ ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం కోరినప్పుడు, ఏవైనా అభ్యంతరాలు చెప్పినప్పుడు ప్రభుత్వం వివరణ ఇస్తుంటుంది. చాలా వరకు వాటితో కాగ్ సంతృప్తి చెందుతుంటుంది. అది వేరే సంగతి.
ప్రతిపక్షాలు కానీ, వాటికి మద్దతు ఇచ్చే మీడియా కానీ ఏపీలో అప్పులు తప్ప ఇంకొకటి లేదన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. సగటు పాఠకుడు లేదా వీక్షకుడికి ఇబ్బడిముబ్బడిగా దుబారా చేస్తున్నారేమో అన్న అనుమానం కలగాలన్నది వీరి లక్ష్యం. ఆ క్రమంలో కాగ్ చిన్న కొర్రీ వేసినా, వెంటనే తాటికాయంత అక్షరాలలో ఈ పత్రికలు వార్తలు రాయడం, దానిపై ప్రతిపక్ష టీడీపీ పెద్ద ఎత్తున విమర్శ చేయడం, నిత్య కృత్యం అయిపోయింది. ఆర్థిక శాఖ నుంచి సమాచారం తెచ్చుకోవడం అంత తేలిక కాదు. కానీ ఇటీవలి కాలంలో ఒక వర్గం మీడియా ఈ సమాచారాన్ని సంపాదించడంలో సఫలం అవుతోందనే చెప్పాలి.
ఆ వెంటనే రకరకాల వార్తలు, విశ్లేషణలు ఇస్తూ విమర్శల పర్వం సాగిస్తుంది. కోరస్‌గా విపక్ష టీడీపీ నేతలు అందుకుంటారు. కానీ తాజాగా వచ్చిన కాగ్ తాత్కాలిక నివేదిక కాని, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన వివరణ గురించి కానీ ఇవే పక్షాలు పట్టించుకోవు. నిజానికి ఒక వర్గం మీడియా ఇలాంటి వాటిపై ఎప్పటికప్పుడు వాస్తవిక దృక్పథంలో విశ్లేషణ ఇస్తే తప్పుకాదు. కానీ ఎంతసేపు బురద చల్లడం మా వంతు, కడుక్కోవడం మీ వంతు అన్న చందంగానే వ్యవహరిస్తున్నాయి.
ఇప్పుడు బుగ్గన వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారా? అన్నది సందేహమే. గత చంద్రబాబు పాలన టైమ్‌తో పోల్చితే ఆర్థిక నిర్వహణ మెరుగైందని వివరిస్తూ, 2021-22లో ద్రవ్యలోటును 2.10 శాతానికి పరిమితం చేశామని తెలిపారు. అంతకుముందు కరోనా సమయంలో మాత్రం ఈ లోటు 5.41 శాతంగా ఉందని, తదుపరి దానిని నియంత్రించామని ఆయన చెప్పారు. అంతేకాక 37 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి అవకాశం ఉన్నా, 25,194 కోట్ల మేరే అప్పు తీసుకున్నట్లు గణాంకాలు వివరించారు.
టీడీపీ హయాంతో పోల్చి చూపుతూ అప్పట్లో ద్రవ్యలోటు నాలుగు శాతంగా ఉన్న విషయాన్ని తెలిపారు. ప్రభుత్వాలు చేస్తున్న రుణాలపై వడ్డీల విషయంలో కూడా గతానికి, ఇప్పటికి తేడా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో సగటున ఎనిమిది శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటే ఇప్పుడు ఏడు శాతానికే రుణాలు వస్తున్నాయి. అసలు జగన్‌కు అప్పు ఎవరు ఇస్తారన్న దగ్గరనుంచి ఇన్ని అప్పులా? అనేవరకు టీడీపీ నేతలు వెళ్లారు. అంటే ప్రభుత్వానికి అసలు పుట్టరాదన్నది వీరి కోరిక. రాజధాని అమరావతిలో వ్యయం చేయడానికి గాను చంద్రబాబు ప్రభుత్వం అత్యధిక వడ్డీకి బాండ్లు జారీ చేసింది.
అప్పుడు ఆయన కానీ, ఆయన వర్గం మీడియా కానీ చేసిన ప్రచారం ఏమిటో తెలుసా? చంద్రబాబు ముఖం చూసి బాండ్లు కొన్నారని అన్నారు. దీనికి అంతా ఆశ్చర్యపోయారు. ఈ బాండ్ల కొనుగోలు అన్నది ఆయా రాష్ట్రాల పరపతిని బట్టి ఉంటుంది కానీ, నేతల మొహాలను చూసికాదు. ఇక బుగ్గన ఒక సవాల్ చేశారు. తమ ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుందని, అందువల్ల ఆ టైమ్‌లో కొంత అప్పు అధికంగా చేయవలసి వచ్చిందని ఆయన వివరించారు.
అదే సమయంలో అమ్మ ఒడి ఇవ్వవద్దని, రైతు భరోసా, ఆసరా, విద్యాదీవెన, తదితర స్కీములు అమలు చేయవద్దని టీడీపీ చెప్పకలుగుతుందా అని ప్రశ్నించారు. వీటన్నిటికి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కానీ, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కానీ సమాధానం చెప్పగలరా? వారిలో ఒక విద్య ఉంది. ఎదుటి పక్షం ఏమి అడిగినా వారు వాటికి సమాధానం ఇవ్వరు. తాము చెప్పదలచుకున్నదో, లేక చేయదలచుకున్న ఆరోపణో చేసుకుంటూ పోతారు. రాష్ట్రం సర్వనాశనం అయిందని ప్రచారం చేస్తారు. ఎలా అంటే దాని గురించి మాట్లాడారు.
జగన్ ప్రభుత్వం అమలు చేసే స్కీములు గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేని పరిస్థితి. తాము అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తామని చెప్పగలరా అంటే ఆ మాట అనలేరు. ఆ స్కీముల సంగతి వస్తే, ఇంకా సరిగా అమలు అవడం లేదని, కోతలు పెడుతున్నారని , తాము ఇంకా ఎక్కువ ఇచ్చామని అంటారు. అది నిజమైతే రాష్ట్రం టిడిపి హాయంలోనే నాశనం అయి ఉండాలి కదా అన్న సందేహం వస్తే ఎవరూ తీర్చడానికి సిద్దపడరు. శ్రీలంక అయిపోయిందని కొన్నాళ్లు, ఆర్బిసి ఆంక్షలు పెట్టిందని మరికొన్నాళ్లు, రకరకాల ప్రచారాలు చేస్తుంటారు. వారికి తమ వర్గం మీడియా అండ ఉంది కనుక నడిచిపోతోంది. కాని జనం నమ్మడం లేదు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. పేదలకు తాము వస్తే పలానా రకాలుగా ఆర్ధిక సాయం చేస్తామని వైసీపీ తన మానిఫెస్టోలో తెలిపింది. ఆ ప్రకారం చేస్తోంది.
విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణ విషయం వచ్చినప్పుడు ఇరవైమూడు శాతం పిట్ మెంట్ ఇస్తే అన్యాయం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. అంటే ఉదాహరణకు ఏభైవేల రూపాయల నెలసరి జీతం వచ్చే ఒక వ్యక్తికి వేతన సవరణ ద్వారా ప్రతి నెల సుమారుగా పది వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు పెరుగుతుందన్నమాట. లక్ష రూపాయలు వచ్చే ఉద్యోగికి అయితే అది పాతిక వేల నుంచి ముప్పైవేల రూపాయలు ఉంటుంది.
ధరలను బట్టి మళ్లీ డిఎ పెరుగుతూ ఉంటుంది. వీటిని పరిశీలిస్తే ఉద్యోగికి ఏడాదికి లక్షన్నర నుంచి మూడు లక్షల రూపాయలు వరకు పెరుగుతుంటే చాలదని చెప్పే ఒక వర్గం మీడియా, పేదలకు ఏడాదికి ఆయా స్కీముల కింద ఇరవై, ముప్పైవేలు సాయం చేస్తే, రాష్ట్రం నాశనం అయిపోతున్నట్లు ప్రచారం చేస్తుంటారు. ఇక్కడ ఉద్యోగులకు జీతాలు పెంచవద్దని చెప్పడం లేదు. కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించే ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దం పడుతుంది.
ఏపీలో అవకాశం తీసుకుని మరీ అప్పుల గురించి రాసే కొన్ని మీడియా సంస్థలు, అదే తెలంగాణకు వచ్చేసరికి ఆ ప్రస్తావన తేవడానికి కూడా భయపడుతుంటాయో, లేక మొహమాటపడుతుంటాయో తెలియదు. ఉదాహరణకు ద్రవ్యలోటు విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. అదే కనుక ఏపీ ఆ స్థానంలో ఉండి ఉంటే మీడియాకాని, చంద్రబాబు కాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఏది ఏమైనా ఏ ప్రభుత్వం అయినా అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిదే. అలాగని కరోనా వంటి సంక్షోభాలు వచ్చినప్పుడు అప్పోసప్పో చేసి, ఏదో ఒక స్కీమ్ కింద పేదలను ఆదుకోవడం ప్రభుత్వ సామాజిక బాధ్యత కూడా అవుతుందని చెప్పాలి. ఆ పని చేయడం ద్వారా జగన్ ప్రభుత్వం ప్రజాదరణ చూరగొంది. విపక్షాలకు, వారికి మద్దతు ఇచ్చే మీడియాకు అదే అసలు సమస్య.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment